ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యపు ఛాయలు తగ్గుముఖం పట్టనుండటంతో దేశీయ ఐటీ రంగంలో సేవలు, కార్యక్రమాలు, పనితనం ఆశాజనకంగా మారింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో ఐటీ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీల ఆదాయం ఐదు శాతం పెరగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశంలోని పలు ఐటీ కంపెనీలు విదేశాల నుంచి ఆర్డర్లను పొందడంతో పరిస్థితి ఆశాజనకంగా మారిందని, వేతనాలను పెంచడంతోపాటు ఉద్యోగుల సంఖ్యను కూడా పెంచుకునేందుకు పలు ఐటీ కంపెనీలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయని విశ్లేషకులు తెలిపారు. తృతీయ త్రైమాసికంలో పని దినాలు తక్కువ కావడంతో, పని భారం పెరిగిందని, అలాగే పలు కంపెనీలు జీతభత్యాలను పెంచడంలో నిమగ్నమై ఉండటంతో ఆయా కంపెనీల ఆర్థిక స్థితిగతులలో కాస్త ప్రభావం కనపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
డిసెంబరు నెలతో ముగిసిన త్రైమాసికంలో దేశీయ రూపాయి మారకం విలువ అమెరికా డాలరుతో పోలిస్తే దాదాపు మూడు శాతం, వార్షిక పరంగా తీసుకుంటే 4.47 శాతం వృద్ధి చెందిందని బ్రోకరేజ్ కంపెనీ షేర్‌ఖాన్ పేర్కొంది. వేతనాల వృద్ధి, అమ్మకాల ఖర్చులో వృద్ధి జరగడంతోపాటు రూపాయి మారకం విలువ వేగవంతంగా పెరగడంతో ఐటీ కంపెనీల ఆదాయంలో 0.9 శాతం నుంచి 1.8 శాతానికి తగ్గే సూచనలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఐటీ రంగంలో పరిస్థితి సజావుగానే ఉందని గార్టనర్ ప్రిన్సిపల్ రీసెర్చ్ విశ్లేషకులు దీప్తరూప్ చక్రవర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. మాంద్యం తగ్గుముఖం పడుతుండటంతో మార్జిన్ మెలమెల్లగా స్థిరత్వాన్ని పొందుతోందని, ద్వితీయ త్రైమాసికంలో ఐటీ రంగంలో పరిస్థితి సజావుగానే ఉండిందని, ఇదే పరిస్థితి మూడవ త్రైమాసికంలోను ఉంటుందని విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా దేశీయ ఐటీ రంగంలోని ప్రముఖ కంపెనీలైన ఇన్ఫోసిస్ జనవరి మూడవ వారంలో తమ ఫలితాలను వెల్లడించనుంది. అలాగే ప్రముఖ ఐటీ కంపెనీలైన విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫలితాలు కూడా వెలువడనున్నాయని విశ్లేషకులు తెలిపారు.