అమెరికా కావచ్చు... ఆస్ట్రేలియా కావచ్చు... ఆటలంటే ఎవరికి ఆసక్తి ఉండదు చెప్పండి... అందులోనూ ఒలంపిక్స్ అంటే మరీనూ... ప్రత్యక్షంగా చూడలేక పోయినా... సమాచార సాధానాల ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నం చేయని క్రీడాభిమానులుండరేమో... అందుకే కాబోలు ఆగస్టు నెలలో అమెరికాలో వెబ్‌ట్రాఫిక్ పెరిగిపోయింది.
అంతా ఇంతా కాదు ఏకంగా 26 శాతం బ్రౌజింగ్ పెరిగిందంటే ఆటల పట్ల అక్కడ ఎంత ఉత్సాహం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూఎస్ స్పోర్ట్స్ వెబ్‌సైట్ పరుగులు పెట్టింది. ఆ వెబ్‌సైట్ చూసే వారి సంఖ్య మామూలుగా 33.4 మిలియన్లు ఉంటుంది.
ఇది సాధారణ రోజుల సంగతి. బీజింగ్లో ఒలంపిక్స్ జరిగిన ఆగస్టు నెల రావడంతో అది కాస్త 42.3 మిలియన్లకు చేరుకుంది. ఈ విషయాన్ని వెబ్‌సైట్ ప్రతినిధి నిల్సన్ కో తెలిపారు. ఆ వెబ్‌సైట్ ఆగస్టు నెలలో రౌండ్ ది క్లాక్ వార్తలు, ఫలితాలు, వీడియోలను అందుబాటులోకి తెచ్చింది.
దీంతో 20 శాతం వరకూ బ్రౌజింగ్ పెరిగింది. బ్రౌజర్లు ఎక్కువ సమయం సైట్‌లో గడపడానికి ప్రయత్నం చేశారు. సరాసరి ప్రతి ఒక్కరూ 57 నిమిషాల 7 సెకన్లు గడిపారు. వివిధ అంశాలను ఈ సైట్ ద్వారా చూశారు.