"హెలో వరల్డ్ ఐ యామ్ రోబో" ఏంటీ రోబో సినిమాలో డైలాగ్ చెబుతున్నారు అనుకుంటున్నారా.. అవును.. మానవుడు అబివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానానికి పరాకాష్టే ఈ రోబో. మనుషులు సైతం చేయలేని అసాధ్యమైన పనులను సునాయాసంగా చేయగలడం రోబోలకే చెల్లుతుంది. సరే.. అది సినిమా కాబట్టి కొంత మేర కల్పితాలు ఉండవచ్చు.
అలాంటిదే ఓ కొత్త రోబో మార్కెట్‌లోకి రానుంది. కాకపోతే ఇది రోబో సినిమాలో లాగా అద్భుతాలేమి చెయ్యదు. ఎందుకంటే ఇది మనిషిలా ఉండే రోబో కాదు. ఇది ఓ "రోబో కార్" అసలు మనిషితో సంబంధం లేకుండా బిజీ బిజీగా ఉండే రహదారులపై రయ్యిమంటూ దూసుకుపోవడం దీని ప్రత్యేకత. ఇంతకీ ఈ కారు తయారు చేసింది ఎవరో తెల్సా.. గూగుల్.
అవును.. ఇంటర్నెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలుగుతున్న అంతర్జాల దిగ్గజం గూగుల్ ఈ సరికొత్త రోబో కారుకు రూపకల్పన చేసింది. అంతే కాదు.. ప్రయోగాత్మకంగా దీనిని విజయవంతంగా నడిపింది కూడాను. గూగుల్ తయారు చేసిన ఈ కారును ఎవరూ నడపక్కర్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు దగ్గరగా ఉన్న రోబోటిక్ సాంకేతికతతో మనుషుల కంటే భద్రంగా ఈ కార్లను నడపొచ్చట.
అమెరికాలో అతి ఏటవాలుగా ఉండే వంకర టింకర మార్గమైన సాన్ ఫ్రాన్సిస్కోలోని లొంబార్డ్ స్ట్రీట్‌లో ఎటువంటి ప్రమాదం లేకుండా ఈ కారు చక్కర్లు కొట్టి విమర్శకుల చేత సైతం శభాష్ అనిపించుకుంది. ఈ కార్లను ఇప్పటికే ఎలాంటి మానవ సహాయం లేకుండా 2,24,000 కిలోమీటర్ల మేర నడిపించారు. ఈ దర్నీలో కారుకు చిన్న గీత కూడా పడలేదట.
అంతేనా.. డ్రైవింగ్‌లో నిపుణత పొందిన వారిని ఈ కార్లలో కూర్చోబెట్టినా కారును నియంత్రించాల్సిన అవసరం ఎప్పుడూ వారికి రాలేదట. అయితే ఒక్కసారి మాత్రం ట్రాఫిక్ లైటు దగ్గర కారు ఆగినప్పుడు వెనక నుంచి వేరే కారు ఢీకొంది. కానీ.. అది గూగుల్ కారు తప్పిదం కాదు. వెనుక నుంచి వచ్చిన కారు సిగ్నల్‌ను గమనించకపోవడంతో ఆ ప్రమాదం సంభవించింది.
రద్దీగా ఉండే రహదారులలో మనుషులను, ఇతర వాహనాలను తప్పించుకుని వెళ్లడంతో పాటు ట్రాఫిక్ సంకేతాలను, నిబంధనలను కూడా పాటించే విధంగా ఈ కారు రూపొందించారు. అంతా బాగానే ఉంది కానీ.. ఒక వేళ దురదృష్టవశాత్తు ఈ కారు వల్ల లేదా కారుకే ప్రమాదం సంభవిస్తే ఎవిరిని శిక్షించాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
డ్రైవరు ఎలాగూ ఉండడు కాబట్టి డ్రైవరును శిక్షించలేం..! పోనీ కారు వల్ల ప్రమాదం సంభవించింది కాబట్టి కారు యజమానిని శిక్షించాలా..? లేక కారులో ఉన్న సాఫ్ట్‌వేర్‌ని శిక్షించాలా..? ఇవన్నీ కాకుండా.. ఇటువంటి కారును రూపొందించిన గూగుల్ సంస్థను శిక్షించాలా..? అని విశ్లేషకులు ప్రశ్నిస్తే.. మాత్రం చట్టం కంటే సాంకేతికత ఎప్పుడూ ముందుంటుందని గూగుల్ జవాబిస్తోంది.