అమెరికాలో విడాకులకు కారణవుతున్న "ఫేస్‌బుక్"
స్నేహితులు సరగాదా కాలక్షేపం చేయడానికి, వ్యాపార వేత్తలు తమ వాణిజ్య కార్యకలాపాలకు, ప్రేమికులు తమ చిలిపి కబుర్లకు, విద్యార్థులు నూతన విషయాలు తెలుసుకోవడానికి, చిట్కాలు, సలహాలు, సహాయం, రక్షణ... ఇలా ఒకటేంటి, ఇక్కడి అన్నీ దొరుకుతాయ్. ఒక రకంగా చెప్పాలంటే "ఇది నా అడ్డా" అనడమే. ఒక్కసారి లాగిన్ అయితే యావత్ ప్రపంచం మీ కళ్ల ముందు ఉంటుంది.అదే "ఫేస్‌బుక్" సోషల్‌నెట్ వర్కింగ్ వెబ్‌సైట్. అయితే దీని వల్ల చాలా వరకూ మంచే జరుగుతున్నా.. అమెరికన్లకు మాత్రం ఇదంటే ఇప్పుడు పెద్ద చిరాకుగా మారిపోయింది. ఫేస్‌బుక్ ఇప్పుడు అమెరికన్ల విడాకులకు కారణమవుతుంది. సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో సదరు యూజర్లు పోస్ట్ చేసే చిలిపి సందేశాలు, చిలిపి చిత్రాల వల్ల అమెరికాలోని ప్రతి ఐదు మందిలో ఒకరు విడాకులు తీసుకుంటున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది.అమెరికన్ అకాడెమీ ఆఫ్ మ్యాట్రిమోనియల్ లాయర్స్ చేపట్టిన మరో సర్వేలో కూడా 80 శాతం మంది విడాకుల లాయర్లు.. తమ వద్దకు వస్తున్న విడాకుల కేసుల్లో అధిక సంఖ్యలో ప్రజలు సోషల్ మీడియాను సాక్ష్యంగా ఉపయోగించుకొని తమను మోసం చేశారంటూ విడాకుల కోసం ధరఖాస్తులు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. మాజీ స్నేహితురాళ్లు, మాజీ ప్రియురాళ్లతో సంబంధాలను మళ్లీ కొనసాగిస్తున్నారనే నెపంతో విడాకులపై మొగ్గు చూపుతున్నారని ఆ సర్వేలో తేలింది.వీరిలో అత్యధికంగా ఫేస్‌బుక్‌నే ప్రప్రధమ సాక్ష్యంగా ఉపయోగించుకుంటున్నట్లు 66 శాతం మంది లాయర్లు చెబుతున్నారు. తర్వాతి స్థానంలో మైస్పేస్ అనే సోషల్‌నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌ను సాక్ష్యంగా ఉపయోగిస్తున్నారని 15 శాతం మంది లాయర్లు చెప్పగా.. ట్విట్టర్‌ను సాక్ష్యంగా వాడుకుంటున్నారని ఐదు శాతం, ఇతర సోషల్‌నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌ను సాక్ష్యంగా వాడుకుంటున్నారని 14 శాతం మంది లాయర్లు ఈ సర్వేలో తెలిపారు.ఈ సమస్య సాధారణ గృణిలకే కాదండోయ్.. సెలబ్రిటీలకు సైతం తప్పడం లేదు. ఇటీవలే ప్రముఖ హాలీవుడ్ తార ఇవా లాంగోరియా కూడా తన భర్త టోనీ పార్కర్ (బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు) ఫేస్‌బుక్‌లో ఓ స్త్రీతో సంబంధం కలిగి ఉన్నాడని అతడి నుండి విడిపోయింది. "అనుమానం పెనుభాతం" అని పెద్దలు ఊరికే అనలేదు సుమా..! ఏదేమైనప్పటికీ.. మానవ సంబంధాలకి అర్థాలు మారుతున్నాయనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఇక నుంచైనా ప్రజలు అనుమానం, అక్రమ సంబంధాలను వీడి సక్రమైన మార్గంలో పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.