బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్... బీపీఓ రంగం ప్రపంచంలో బాగా వెలుగొందనున్న పరిశ్రమ.. అని చెప్పలేం. కానీ అంతర్జాతీయ సంక్షోభంతో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రపంచానికి కాంతులను వెదజల్లుతోంది ఈ పరిశ్రమే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఉద్యోగాలను సృష్టించవచ్చు.. లాభాలను గడించవచ్చు. ప్రపంచంలోని రెండు దేశాలు ఈ బీపీఓ రంగం ద్వారా అత్యధికంగా లాభాలను ఆర్జిస్తున్నాయి.
ఆ రెండు దేశాలు భారత్, ఫిలిప్పైన్స్. అంతర్జాతీయ సంక్షోభం ప్రభావం కారణంగా ప్రాథమిక స్థాయిలో కొన్ని కష్టాలు ఎదురవుతున్నప్పటికీ వాటిని తట్టుకు నిలబడిగలిగితే తిరిగి అభివృద్ధి బాటన నడుస్తుందని బీపీఓ రంగ పరిశ్రమ వర్గాలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఫిలప్పైన్స్‌లో ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 35 నుంచి 45 శాతం మేర వృద్ధి చెంది ఏడు బిలియన్ డాలర్ల మేర లాభాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫిలిప్పైన్స్ బిజినెస్ ప్రాసెసింగ్ అసోసియేషన్ (బీపీఏపీ) ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆస్కార్ శానెజ్ మాట్లాడుతూ... ప్రస్తుతం నెలకొన్న ఆర్థికమాంద్యాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోం... బిపీఓ రంగాన్ని పురోగతి బాటలో పయనింపజేసేందుకు గల పరిష్కారాలు ఏమిటని ఆలోచిస్తామని అన్నారు. ఈ ఏడాది బీపీఓ రంగంలో వార్షిక వృద్ధి 40 శాతం వరకు ఉంటుందని పేర్కొన్నారు.
ఈ ఏడాదిలో ప్రస్తుతం మూడు లక్షల మంది ఉద్యోగులు ఈ రంగంలో పని చేస్తుండగా... 2010 నాటికి ఆ సంఖ్య, తమ అంచనా ప్రకారం 10 లక్షలకు చేరుకుంటుందని ఆస్కార్ తెలిపారు. భారత్‌లో బీపీఓ రంగ వార్షిక ఎగుమతుల్లో 40 బిలియన్ డాలర్ల లాభాలు వస్తున్నాయి. అయితే కొంతకాలం పాటు కష్టాలను ఈదక తప్పదని భారత బీపీఓ పరిశ్రమ అంగీకరించింది.
అంతర్జాతీయ వ్యాపారంలో ఔట్‌సోర్సింగ్ రంగం నుంచి లాభాలను పొందుతున్న ప్రపంచంలోని దేశాల్లో భారత్ అగ్రపథాన ఉండగా.. పది శాతం లాభాలతో ఫిలిప్పైన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఉద్యోగాలను సృష్టించేందుకు, ఎక్కువ శాతం లాభాలు వచ్చేందుకు ఈ రంగం ఎంతగానో ఉపయోగపడుతోంది.
అలాగే బ్రిటన్, అమెరికా దేశాల్లో కీలక సమయాల్లో బీపీఓ రంగంలో అపార అనుభవం ఉన్న భారత్, ఫిలిప్పైన్స్‌లు.. క్రియాశీల పాత్ర వహిస్తుండటం గమనార్హం. అందుకే.. రెండు దేశాలు కూడా బీపీఓ రంగానికి ప్రాముఖ్యాన్నిచ్చాయి.