ప్రస్తుతం మన దేశంలో 2జి(రెండో తరానికి చెందిన) సేవలు మాత్రమే లభిస్తున్నాయి. ఈ సేవల్లో డేటా బదిలీ ప్రక్రియ వేగంగా ఉండదు. అందువల్ల వీడియో సేవలను అందుకోలేము. ఈ సమస్యను అధిగమించేందుకే సాంకేతిక రంగంలోకి వచ్చిందే 3జి టెక్నాలజీ.
ఎన్‌టిటి డొకొమో కంపెనీ ఈ సేవలను ప్రపంచానికి పరిచయం చేసింది. సెకనుకు 3.1 ఎంబి కంటే అధిక వేగంతో బ్రాడ్‌బాండ్ సేవలను అందించే టెక్నాలజీయే 3జిగా పేర్కొనవచ్చు. కొత్తగా రంగంలోకి వచ్చిన 4జిలో బ్రాడ్‌బాండ్ వేగం ఒక గిగాబైట్ వరకూ ఉంటుంది. కనిష్టంగా సెకనుకు 100 ఎంబి వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. అందుకే 4జి సేవలను అల్ట్రా బ్రాడ్‌బాండ్ సేవలుగా వ్యవహరిస్తున్నారు.
కనిష్టంగా సెకనుకు 100 ఎంబి వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసే స్తోమత కలిగిన 4జి ఉండటంతో మధ్యలో 3జి సేవల అవసరం ఎందుకు వస్తుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రభుత్వం సైతం 3జి స్పెక్ట్రమ్‌ను విలీనం చేసి, 4జిలో భాగంగా విక్రయిస్తుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
అత్యాధునికమైన అల్ట్రా బ్రాడ్‌బాండ్ సేవలను (4జి) ప్రవేశపెట్టేందుకు అవసరమైన అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని ట్రాయ్ తెలిపింది. 4జికి చెందిన లైసెన్సు, ధరలు, స్పెక్ట్రమ్ కేటాయింపు తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 15 నాటికి పరిశ్రమ అభిప్రాయాలను కూడా స్వీకరించి 4జి విధానాన్ని రూపొందించేందుకు ట్రాయ్ కృషి చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రపంచంలోని నార్వే, స్వీడన్ దేశాల్లో 4జి సేవలు అందుబాటులోకి వచ్చాయి. అమెరికా, కొరియా, జపాన్ దేశాలు ఈ సేవలను ప్రారంభించడానికి సన్నద్ధమౌతుండటంతో మన దేశంలోను 4జి సేవలను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ట్రాయ్ వర్గాలు వెల్లడించాయి.