నేరాలను, ఉగ్రవాద చర్యలను అడ్డుకునేందుకోసం పోలీసులకు ఉపయోగపడే ఒక సమగ్ర సాఫ్ట్‌వేర్‌ను విప్రో ఇన్ఫోటెక్ రూపొందించింది. ఇంకా పైలట్ దశలో ఉన్న ఈ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్, ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న హైటెక్ తరహా నేరాలు, ఉగ్రవాదంపై పోరాడటంలో పోలీసులకు, ఇతర శాంతిభద్రతల విభాగాలకు తోడ్పడుతుందని సంస్థ చెప్పింది.
ప్రభుత్వం, రక్షణ విభాగాలకు సంబంధించి విప్రో జనరల్ మేనేజర్ రణ్బీర్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, వివిధ పోలీసు విభాగాల మధ్య తక్షణ సమాచారాన్ని ఈ సాఫ్ట్‌వేర్ ఎప్పటికప్పుడు అందించగలదని చెప్పారు. పోలీసు శాఖల రోజువారీ నిర్వహణకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను ఇది కవర్ చేస్తుందని చెప్పారు. బలగాల నిర్వహణ, పైనాన్స్, స్టోర్లు వంటి నేపథ్య ప్రక్రియలను కూడా ఇది నిర్వహిస్తుందని అన్నారు.
పెరుగుతున్న నేరాల శాతాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఐటి పాత్ర గణనీయంగానే ఉంటోందని తెలిపారు. శాఖా నిర్వహణ, రికార్డు నిర్వహణ కర్తవ్యాలను ఈ సాఫ్ట్‌వేర్ ఆటోమేట్ చేస్తుందని దీనిద్వారా పోలీసు శాఖలో నిర్వహణా సామర్థ్యాన్ని పెంచుతుందని సింగ్ చెప్పారు.
పౌరులు ఆరోపణలు చేయడానికి అనువుగా సిటిజన్ ఇంటర్‌ఫేస్‌ను కూడా ఈ అప్లికేషన్ కలిగి ఉందని, దాఖలు చేసిన ప్రాధమిక సమాచార నివేదిక స్థితిని ఇది చూపిస్తుందని చెప్పారు. ఇంగ్లీష్‌లోనూ, మాతృభాషలోనూ కంటెంటును యూజర్ ఇంటర్‌ఫేస్ ప్రదర్శిస్తుందని తెలిపారు.
నేరాలు, శాంతి భద్రతలు, వైర్‌లెస్, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలతో వ్యవహరిస్తున్న పోలీసు స్టేషన్లు, ఏజెన్సీలలో రికార్డుల నిర్వహణకు గాను ఆపరేషనల్ మాడ్యూళ్లను ఈ అప్లికేషన్ కలిగి ఉందని రణబీర్ సింగ్ తెలిపారు.