దేశంలో నెట్ టెలిఫోనీ సేవలను ఉపయోగించడమా లేదా అన్నది తేలనుంది. టెలికమ్యూనికేషన్‌లపై నిర్ణయాలు చేసే విభాగం టెలికాం కమిషన్ నేటి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఒక వేళ ఇది ఉపయోగంలోకి తేవాలని నిర్ణయం వెలువడితే ఎస్‌టీడీ, లోకల్, ఐఎస్‌డీ కాల్ రేట్లు చాలా తక్కువ ధరకే లభ్యమవుతాయి.
ఇంట్లో తమ సొంత కంప్యూటర్ ద్వారా ఉచితంగా లోకల్ కాల్స్ పొందవచ్చు. అయితే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తే దేశీయ కమ్యూనికేషన్ మార్కెట్ ప్రాబల్యానికే సవాలు లాంటిదని ఇప్పటికే టెలికాం సంస్థ గగ్గోలు పెడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోను నెట్ టెలిఫోనీకి అనుమతి ఇవ్వరాదని డిమాండ్ కూడా చేస్తున్నాయి. అదలా ఉంచితే గత ఏడాది నెట్ టెలిఫోనీపై ఉన్న నిషేధాన్ని సడలించాలని టెలికాం నియంత్రణా సంస్థ ట్రాయ్ ప్రతిపాదించింది.
దీంతో నెట్ టెలిఫోనీ తెర పైకి వచ్చింది. టెలికాం సంస్థలు వీటిని అడ్డుకుంటుండంతో దీని ప్రాముఖ్యత మరింతగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్ కాల్ చేసుకునే వీలు మాత్రమే ఉంది. కానీ కంప్యూటర్ నుంచి ఫోన్‌కు కాల్ చేసే సౌలభ్యం లేదు.
అలా కాకండా పూర్థి స్థాయి ఇంటర్నెట్ టెలిఫోనీకి అనుమతి లభించినట్లయితే పీసీలు లేదా ల్యాప్‌టాప్‌ల ద్వారా ల్యాండ్‌లైన్‌లు, మొబైల్ ఫోన్‌లకు యధేచ్చగా కాల్స్ చేసి మాట్లాడుకోవచ్చు. అలాగే మొబైళ్ల నుంచి పీసీలకు కూడా కాల్స్ చేసుకోవచ్చు. చాలా వరకు ఈ కాల్స్‌కు నామమాత్రపు ఛార్జీ మాత్రమే వసూలు చేయబడుతుంది.
దీనికి గ్రీన్ సిగ్నల్ వస్తే తొలుత దీని వల్ల ఉపయోగపడేది ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలే అని చెప్పొచ్చు. ఎందుకంటే.. బ్రాండ్‌బాండ్ సేవలు ఇప్పుడిప్పుడే గ్రామాల్లో విస్తరించుకుంటోంది. టెలిఫోనీ ఛార్జీలు బ్రాండ్‌బాండ్ కన్నా చాలా చీప్. ఇక ఈ సేవలు వస్తాయని తెలిస్తే.. ఇంకే ముంది గ్రామ ప్రాంతాల వారికే కాదు, పట్టణ, నగర ప్రాంతాల వారికి కూడా పండగే.. పండగ.. మరి.