అమెరికా అర్థిక సంక్షోభ ప్రభావం సమాచార సాంకేతిక రంగంలోని ఉద్యోగులపై పడుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని సంస్థలు తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి. అందులో భాగంగానే ప్రముఖ సంస్థలైన టీసీఎస్, సత్యం ఐటీ సంస్థల్లో పదోన్నతులను తాత్కాలికంగా నిలిపి వేశారు.
టీసీఎస్ ఇప్పటికే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగులను ఉద్దేశించి మెస్సేజ్లను పంపింది. అమెరికా ఆర్థిక మార్కెట్లపై ఒక క్లారిటీ వచ్చేంత వరకూ ఆగక తప్పదని తేల్చేశారు. ఇప్పటికే ఉద్యోగుల వ్యక్తిగత పనితీరుపై సమీక్ష జరిపారు. ఒక అంచనా ఉంది. అయితే అమెరికా సంక్షోభం కారణంగా వాటిని పదోన్నతులను పెండింగ్లో పెట్టారు.
అయితే ఈ సంక్షోభం తొందరలోనే సమసి పోతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అంత వరకు పదోన్నతులపై ఆశలకు నీళ్ళొదులుకోవాలని పరోక్షంగా చెబుతున్నారు. అలాగే యాన్యువల్ అప్రైజల్ కూడా పూర్తిగా నిలిపివేశారు.
సత్యంలో ప్రతీ రెండేళ్ళకొకమారు పదోన్నతులుంటాయి. ఇది విధిగా జరిగే కార్యాక్రమం. కానీ ఈ ఏడాది పదోన్నతుల విషయంలో నాన్పుడు ధోరణితో వ్యవహరిస్తోంది. ఈ ఏడాది మొదట్లో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎంపిక చేసిన అభ్యర్థులను ఇంకా తీసుకోలేదు. ఇందు కూడా సత్యం ఆచితూచి అడుగులు వేస్తోంది. మొత్తానికి అమెరికా సంక్షోభ ప్రభావం భారత ఐటీలపై ఉంది.