వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ వైపు అడుగులు వేస్తోంది. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను వినియోగదారులు షేర్ చేసుకునే సదుపాయాన్ని తీసుకురానుంది. ఈ ఫీచర్ కనుక అందుబాటులోకి వస్తే నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా డాక్యుమెంట్లను పంపించుకునే వెసులుబాటు కలుగుతుంది.
నెట్‌వర్క్ సదుపాయం లేకున్నా బ్లూటూత్ సాయంతో క్వీక్ షేర్, నియర్ బై షేర్, షేర్ఇట్ వంటి అప్లికేషన్ల ద్వారా ఫొటోలు, సినిమాలు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అచ్చం ఇలాంటి తరహా సర్వీసులనే ఇప్పుడు వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. తద్వారా డాక్యుమెంట్లను మరింత వేగంగా, సురక్షితంగా పంపేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.
కాగా, ఈ ఫీచర్‌ను ఎనేబల్ చేసుకోవాలంటే మాత్రం వాట్సాప్ సిస్టమ్ ఫైల్, ఫొటోల గ్యాలరీ యాక్సెస్ వంటి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. బ్లూటూత్ ఆన్ చేసి దగ్గరలోని వాట్సాప్ యూజర్ పరికరాన్ని గుర్తించి డాక్యుమెంట్ సెండ్ చేయాల్సి వుంటుంది.