ఐటీ ఉద్యోగులంటేనే వేలల్లో, లక్షల్లో జీతాలు తీసుకుంటారు. అయితే ఆ జీతాలకు తగిన ఒత్తిడి వారికి వుంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించేందుకు వారందరూ వీకెండ్‌లలో ఏవేలో ప్లాన్స్ వేసుకుంటారు. ఇలా ఐటీ ఉద్యోగుల కోసం కొన్ని కంపెనీలు ఉద్యోగులకు అన్నీ సౌకర్యాలు చేస్తున్నాయి. కంపెనీ లాభాలకోసం, అభివృద్ధి కోసం శ్రమిస్తున్న వారికి కొన్ని కంపెనీలు ఇంక్రిమెంట్లు, అప్పుడప్పుడు గిఫ్టులు ఇస్తుంటాయి.
తాజాగా చెన్నైకి చెందిన ఓ ఐటీ కంపెనీ కూడా తమ కంపెనీలోని ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. ఉద్యోగులకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కార్లను బహుమతిగా అందజేసింది. అవును నిజమే. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐడియాస్2ఐటీ తన ఉద్యోగులకు 100 కార్లను బహుమతిగా ఇచ్చింది.
కేవలం ఆరుగురు ఇంజనీర్లతో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం 500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ కంపెనీ భారత్‌తో పాటు.. అమెరికా, మెక్సీకో సహా పలు దేశాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది.
ఈ నేపథ్యంలో ఈ సంస్థ కొత్త కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా.. సంస్థలో పని చేస్తున్న వంది మందికి 100 మారుతి సుజుకీ కార్లను బహుమతిగా ఇచ్చారు కంపెనీ సీఈవో. కంపెనీ అభివృద్ధికి వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా వారికి ఈ కార్లను బహుకరించినట్లు సీఈవో గాయత్రి వివేకానందన్ తెలిపారు.