సైబర్ నేరాల నియంత్రణకు గాను కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోంది. ఫేక్ గుర్తింపు కార్డుతో ఎవరైనా నెంబర్ తీసుకుంటే వారికి ఇక చుక్కలే. ఫేక్ గుర్తింపు కార్డుతో ఎవరైనా మొబైల్ కనెక్షన్ గానీ, వోటీటీ కనెక్షన్ గానీ తీసుకున్నారని టెలికాం కంపెనీల 'కేవైసీ'లో వెల్లడైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు.
వివిధ కేసుల దర్యాప్తులో భాగంగా ఫేక్ ఐడీ కార్డులతో మొబైల్, వోటీటీ కనెక్షన్ తీసుకున్నారని పోలీసులు గుర్తించినా వారిపై కేసు నమోదు చేస్తారు. అలా ఫేక్ ఐడీ కార్డుతో కనెక్షన్ తీసుకున్నవారికి రూ.50వేల జరిమానా లేదా ఏడాది జైలు లేదా రెండూ విధించేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఈ కేంద్ర ప్రభుత్వం నూతన పాలసీ ప్రకారం తమ కాంటాక్ట్ నెంబర్ల జాబితాలో లేని నెంబరు నుంచి కాల్ వచ్చినా సరే ఆ ఫోన్ చేసింది ఎవరో ఇకపై తెలిసిపోతుంది. ప్రస్తుతం ట్రూ కాలర్ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే ఆవిధంగా ఎవరు కాల్ చేస్తున్నారో తెలుస్తుంది.
కానీ, దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే, ట్రూ కాలర్ యాప్‌తో నిమిత్తం లేకుండానే తమకు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవడం ప్రతి మొబైల్ ఫోన్ వినియోగదారుడికి హక్కుగా కేంద్రం నూతన పాలసీ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది. ఇందుకోసం మొబైల్ కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని ఆదేశించనుంది.