మున్ముందు మొబైల్ చార్జీల బాదుడు తప్పేలా లేదు. రెట్టింపు చార్జీల వడ్డనకు దేశంలోని టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. గత యేడాది డిసెంబరు నెలలో 42 శాతం మేరకు మొబైల్ చార్జీలను పెంచిన టెలికాం కంపెనీలు.. ఇపుడు మరోమారు రెట్టింపు వడ్డనకు సిద్ధమవుతున్నాయి.
దేశంలోని అనేక ప్రైవేట్ టెలికాం కంపెనీలు కేంద్రానికి లక్షల కోట్ల రూపాయలు బాకీపడ్డాయి. ముఖ్యంగా, గడచిన 20 ఏళ్ల కాలానికి సంబంధించి రేడియో తరంగాలు, ఇతరత్రా బకాయిల రూపంలో టెలికం సంస్థలు మొత్తం రూ.1.47 లక్షల కోట్లను కేంద్రానికి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎయిర్ టెల్ రూ.35 వేల కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.53 వేల కోట్లు కట్టాలి. ఈ బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఇందులో ఎయిర్‌టెల్ మాత్రమే రూ.10 వేల కోట్లు చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని కూడా గడువులోగా సర్దుబాటు చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఈ భారాన్ని తట్టుకునేందుకు మొబైల్ కంపెనీలు తమ సేవల చార్జీలు పెంచాలని భావిస్తున్నాయి. ఇదే జరిగితే ప్రతి వినియోగదారుడు భారీ భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే జరిగితే మొబైల్ డేటాను కూడా మరింత పొదుపుగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
వాస్తవానికి జియో రంగ ప్రవేశానికి ముందు ఒక జీబీ డేటాకు రూ.200కు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. 2016లో జియో వచ్చిన తర్వాత, డేటా ఖర్చు గణనీయంగా పడిపోయింది. రోజుకు 1 జీబీ ఖర్చు పెట్టినా, నెలకు రూ.200 కూడా కట్టాల్సిన అవసరం లేని పరిస్థితి ఏర్పడింది.
రిలయన్స్ జియో డేటా, కాల్స్‌ను ఉచితంగా అందించి వినియోగాన్ని కొత్త పుంతలు తొక్కించింది. జియో ప్రభావానికి ఆర్-కామ్, ఎయిర్ సెల్, టాటా డొకొమో, టెలినార్ వంటి సంస్థలు మూతపడ్డాయి.
మూడేళ్లలోనే జియో చందాదారుల సంఖ్యాపరంగా నంబర్ 1 స్థాయికి చేరుకుంది. జియో దెబ్బకు తట్టుకుని నిలబడాలంటే, విలీనం ఒక్కటే మార్గమని వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్‌లు కలిసిపోయాయి. ఇపుడు కేంద్రానికి చెల్లించాల్సిన మొత్తంతో టెలికాం కంపెనీలు మరింత ఆర్థిక భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది.