అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన ప్రతీకార పన్నులు (వాణిజ్యయుద్ధం) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా యాపిల్ సంస్థ విలవిల్లాడుతుంది. ఐఫోన్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఐఫోన్ మోడల్‌ను బట్టి వీటి ధరలు 30 నుంచి 40 శాతం వరకు పెరగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఐఫోన్లు చైనాలో తయారవుతాయి. దీంతో ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లు వీటిపై పడతాయి. ఈ నేపథ్యంలో సంస్థ వీటిని భరించడమా లేక వినియోగదారులపై మోపడమా అనేది యాపిల్ నిర్ణయించాల్సివుంది.
చాలామందికి అందుబాటులో ఉండే ఐఫోన్ 16 మోడల్ ధర 799 డాలర్లు (రూ.68 వేలు) యాపిల్ కనుక పన్నుల భారం వినియోగదారుల పైకి బదలాయిస్తే ఇది 1,142 డాలర్లకు (రూ.97 వేలు)కు చేరవచ్చని అంచనా.
ఇక ప్రీమియం మోడల్ ఐఫోన్ 16 ఐమ్యాక్స్ (1టెరాబైట్ మోడల్) 2300 డాలర్లకు (రూ.2 లక్షలు) చేరవచ్చు. గతంలో యాపిల్ అదనపు పన్నులు తప్పించుకునేందుకు ప్రత్యేక మినహాయింపులు పొందింది. కానీ, డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధంతో అవేమీ లభించేలా కనిపించడం లేదు.