పెప్సీ, కోలాల కోసం తామ్రభరణి నీటిని వాడుకోవచ్చు.. హైకోర్టు మదురై డివిజన్ బెంచ్
జల్లికట్టుపై పట్టుబట్టి దీక్ష చేసిన తమిళ తంబీలు ప్రస్తుతం పెప్సీ, కోలాల విషయంలో పెద్ద స్కెచ్ వేశారు. ఏకంగా పెప్సీ, కోక్‌లపై నిషేధం విధించారు. తమిళనాడు వ్యాపారుల సంఘం… ఈ రెండు కూల్ డ్రింకులను నిషేధి
జల్లికట్టుపై పట్టుబట్టి దీక్ష చేసిన తమిళ తంబీలు ప్రస్తుతం పెప్సీ, కోలాల విషయంలో పెద్ద స్కెచ్ వేశారు. ఏకంగా పెప్సీ, కోక్‌లపై నిషేధం విధించారు. తమిళనాడు వ్యాపారుల సంఘం… ఈ రెండు కూల్ డ్రింకులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. పెప్సీ, కోక్‌లను నిషేధిస్తూ తమిళనాడు వ్యాపారులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎందుకంటే తమిళనాడు రైతులు ఇప్పుడు కరువుతో అల్లాడుతున్నారు.
నీటికి చాలా కటకట ఏర్పడింది. అదే సమయంలో చెన్నై శివార్లలోని ఈ కంపెనీలు విపరీతంగా నీటిని వాడేస్తున్నాయట. పెద్ద పెద్ద మోటర్లు పెట్టి భూగర్భజలాలను తోడేస్తుండడంతో వాటికి చెక్ పెట్టేందుకు కూల్ డ్రింకులపై నిషేధం విధించేశారు. ఫలితంగా ఫారిన్ కూల్ డ్రింక్ కంపెనీలకు గట్టి షాకే ఇచ్చారు.
అయితే పెప్సీ, కోక్ శీతలపానీయాల తయారీ సంస్థలకు తామ్రభరణి నదీజలాలను సరఫరా చేయొద్దంటూ తిరునల్వేలి జిల్లా పాళయంకోటకు చెందిన డాక్టర్ ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లను హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. దీంతో ఆ రెండు సంస్థలకు సదరు నదీ జలాల ఉపయోగానికి మార్గం సుగుమమైంది.
తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలకు ప్రధాన నీటి వనరైన తామ్రభరణి నది నుంచి పెప్సీ, కోక్ సంస్థలు వెయ్యిలీటర్లను రూ.37.50ల ధరకు కొనుగోలు చేసి ఆ నీటితో తయారయ్యే శీతలపానీయాలను అత్యధిక ధరకు విక్రయించి.. కోట్లు సంపాదిస్తున్నారని అందుచేత.. నదీ జలాలను కోలా సంస్థలు వాడుకోనివ్వకూడదని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.
ఇదే రీతిలో మాజీ శాసన సభ్యుడు అప్పావు కూడా ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ పెప్సీ, కోక్ సంస్థలకు ఆ నదీ జలాలను సరఫరా చేయరాదంటూ స్టే ఇచ్చింది. గత ఫిబ్రవరి 15న ఈపిటిషన్లకు సంబంధించి ఇరువైపు వాద ప్రతివాదనలు పూర్తికావటంతో తీర్పును వాయిదా వేశారు. గురువారం న్యాయమూర్తులు పెప్సీ, కోక్ సంస్థలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చారు. దీంతో ఆ రెండు సంస్థలు అంతకుముందులాగే తామ్రభరణి నదీ జలాలను వాడుకునేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది.