దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. యూపీఐ సపోర్ట్‌తో జియో పే అనే కొత్త అప్ డేట్‌ను తీసుకురానుంది. ఇది ప్రస్తుతానికి కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చిందని సమాచారం.
ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ సేవలు పరిమిత వినియోగదారులకు పొందుతున్నారు. ఎన్పీసీఐ భాగస్వామ్యంతో జియో ఫోన్‌లో ఆర్థిక లావాదేవీలు జరపడానికి జియో ప్రయత్నిస్తోందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.
తొలుత ఈ సేవలు కొన్ని వేల మందికి అందుబాటులోకి వచ్చాయని సమాచారం. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను చూస్తుంటే ఇందులో ట్యాప్ అండ్ పే, సెండ్ మనీ, రీచార్జ్, అకౌంట్స్ ఆప్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. నగదు పంపడానికి, పొందడానికి జియో ఫోన్‌లో ఉన్న జియో పే యాప్ కూడా యూపీఐని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఫోన్‌లో ఉన్న బిల్ట్-ఇన్ ఎన్ఎఫ్‌సీ ద్వారా ఈ ఫోన్‌లో సింగిల్ ట్యాప్ ద్వారా నగదు చెల్లింపులు జరపవచ్చు. దీనికోసం జియో.. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, స్టాండర్ట్ చార్టర్డ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్ వంటి బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కూడా తెలుస్తోంది.