ఫేస్‌బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లినట్టు తాజాగా మరో వార్త వచ్చింది. ఇది ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. నిజానికి ఫేస్‌బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమచారం విషయంలో గోప్యత లేదంటూ గతంలో అనేక కథనాలు వచ్చాయి. వీటిని ఫేస్‌బుక్ యాజమాన్యం కొట్టిపారేసింది. కానీ, ఇపుడు మరోమారు ఇలాంటి వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది.
తాజాగా 267 మిలియన్ల మందికి పైగా ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత వివరాలు 'డార్క్ వెబ్' చేతుల్లోకి వెళ్లినట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ అనే సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది.
డార్క్ వెబ్ చేతుల్లోకి ఖాతాదారుల యూజర్ ఐడీలు, పూర్తి పేరు, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్లు, టైమ్ స్టాంప్ వివరాలు, రిలేషన్ షిప్ స్టేటస్, వయసు ఇత్యాది అంశాలన్నీ 'డార్క్ వెబ్'కు విక్రయించినట్టు తెలుస్తోంది.
ఫేస్‌బుక్‌లోని థర్డ్ పార్టీ ఏపీఐ లోపాలను ఆధారంగా చేసుకుని ఈ డేటాను తస్కరించి ఉండే అవకాశాలను కొట్టిపారేయమని మరో సైబర్ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది. ఫేస్‌బుక్ యూజర్లు వెంటనే తమ ఖాతాల భద్రతను మరింత కట్టుదిట్టం చేసుకోవాలని, లేకపోతే సైబర్ నేరగాళ్ల వలకు చిక్కే అవకాశాలు ఉంటాయని హెచ్చరించింది. మెరుగైన భద్రత కోసం రెండంచెల పాస్ వర్డ్ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.