ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ఎన్నికల బరిలోకి దిగుతున్న భారత రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను అస్త్రంగా వాడుతున్నాయి. ముఖ్యంగా చాలామంది రాజకీయ నేతలు, పార్టీలు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను ప్రచార అస్త్రాలుగా వుపయోగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాట్సాప్‌ను కొన్ని రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై వాట్సాప్ సంస్థకు చెందిన అధికారి కార్ల్ వోగ్ మాట్లాడుతూ.. వాట్సాప్ సేవలను దుర్వినియోగం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
కొన్ని రాజకీయ పార్టీలు వాట్సాప్‌ను మంచి పనుల కోసం ఉపయోగించాలే తప్ప.. కొన్ని పార్టీల మేలు కోసం దాన్ని దుర్వినియోగం చేయకూడదన్నారు. కారణం ఏదైనా.. వాట్సాప్‌ను స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసే రాజకీయ పార్టీలను చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ హెచ్చరికలను పట్టించుకోకపోతే.. వాట్సాప్ సేవలను రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ హెచ్చరికలను రాజకీయ పార్టీలు పట్టించుకుంటాయా.. లేదా అనేది వేచి చూడాల్సిందే.