సాధారణంగా ఆలయాల్లో పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పెరుగు, పసుపు నీళ్లు, పంచామృతాలు... ఇలా వివిధ రకాల పానీయాలతో ఉత్సవ మూర్తులకు అభిషేకాలు నిర్వహిస్తుంటారు. అయితే వీటితో కాకుండా తవుడుతో అభిషేకం చేయడం ఎక్కడన్నా విన్నారా? చూశారా?
ఈ అభిషేకం చూడాలంటే కేరళలోని కొడుంగనల్లూరులో ఉన్న భగవతీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించాల్సిందే. ఈ ఆలయంలో అమ్మవారికి తవుడుతో అభిషేకం చేస్తారట. చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదూ. తవుడుతో అభిషేకం చేయడం ద్వారా అమ్మవారు ఎప్పుడూ శాంతంగా ఉండి భక్తుల కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం.
అంతే కాదు, కుట్రాలంలో ఉన్న కుట్రాలనాథునికి వివిధ రకాల మూలికలు, వేర్ల మిశ్రమంతో తయారైన తైలంతో అభిషేకం నిర్వహిస్తారట. మూలికలు కలిసి ఉండటంతో మంచి ఔషధంగా పనిచేస్తుందని, దీనిని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారట.
అలాగే చెన్నైలోని క్రోమ్‌పేట్‌లో ఉన్న చెంగచేరీ అమ్మవారికి పౌర్ణమి రోజుల్లో గోరింటాకు ఆకులతో అభిషేకం నిర్వహిస్తారట. తర్వాత ఈ ఆకులను కన్యలకు ప్రసాదంగా పంచి పెడతారట. తద్వారా వారికి త్వరలోనే వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం.