ప్రతిపనికీ దేవుడిపై భారం వేసే వారికి మన దేశంలో కొదవలేదని ఎప్పుడో తేలిపోయిందనుకోండి. అయితే జాతి దశాదిశలను నిర్దేశించేవారు సైతం తాము చేసే ప్రతిపనికి, వేసే ప్రతి అడుగుకు ముందు రాహుకాలాలు, దుర్ముహూర్తాలు, వర్జ్యాలు చూసుకోవడం గమనిస్తే మనం పురోగమిస్తున్నామా లేక తిరోగమిస్తున్నామా అని ప్రశ్నించుకోక తప్పదు కదా.
ముందుగా మన రాష్ట్రం విషయానికొస్తే.. ప్రమాణ స్వీకారం చేసిన చాన్నాళ్లకు కూడా ముహూర్తబలాలు సరిగా లేవంటూ సచివాలయం వైపు కన్నెత్తి చూడని మంత్రుల గురించి అందరికీ తెలుసు. చివరకు ముహూర్తాలు కుదరకపోతే మంత్రివర్గ విస్తరణ కూడా జరగక పోయే పరిస్థితి.
ఉపఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రిపదవులు ఆశించిన చాలామందికి ఆశాభంగం కలిగిస్తూ, కెసిఆర్‌ను దాదాపు ఓడించినంత పనిచేసిన జీవన్‌రెడ్డిని మాత్రమే రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీనిపై ఇటీవలే ఢిల్లీ సందర్శించిన ముఖ్యమంత్రి వైఎస్‌ను విలేఖరులు ప్రశ్నిస్తే "మూఢం కదయ్యా..." అని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మూఢానికి ముందే జీవన్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చామని, అయినా కొంతమందికి మూఢాలు వర్తించవు అని ముఖ్యమంత్రి ఒడుపుగా సమాధానమిచ్చి తప్పుకున్నారు.
ఇక మరోవైపు చూస్తే ఆ చిరంజీవి ఆశీస్సులే లేకుంటే ఈ చిరంజీవి కాలు తీసి కాలు పెట్టలేడు అనే చందాన మెగాస్టార్ వ్యవహరిస్తున్నట్లు కనబడుతోంది. మూడు దశాబ్దాలు చిత్రసీమలో పరవళ్లు తొక్కిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న చిరంజీవి శ్రీ ఆంజనేయుని సతీసమేతంగా దర్శించుకున్నారు.
ఆయన పెట్టబోయే రాజకీయ పార్టీ ఆగస్టు 15న విడుదలవుతుందా లేదా ఆగస్టు 20న బయటకు వస్తుందా అనే విషయం కూడా ముహూర్త బలాల జంజాటంలో పడి నలుగుతోంది. ఇలా చిరంజీవి గొడవ చిరంజీవిదయితే, ఆయన శుభసమయాలను లెక్కగట్టేందుకు జ్యోతిష్కులకు చేతినిండా పనిదొరికినట్లే అయింది. కీలకమైన రాజకీయరంగంలోనే ఇలాంటి పరిణామాలు చూస్తే ఎవరికయినా ఒకటే ఆలోచన మనసులో.. మనం ముందుకెళుతున్నామా.. వెనక్కెళుతున్నామా... అని.