అదో చిన్న పల్లెటూరు. ఆ ఊరికి వెళ్లేందుకు ఓ కంకర రోడ్డు. ఆ రోడ్డు ప్రక్కనే ఓ రాళ్లగుట్ట. ఈ రాళ్లగుట్ట ఎవరో తీసుకవచ్చి పోసింది కాదు. భక్తులు ఒక్కో రాయిని పోలెమ్మ అమ్మవారికి సమర్పించడం ద్వారా ఏర్పడింది. అమ్మవారికి రాళ్లు సమర్పించడమేమిటని ఆశ్చర్యపోతున్నారా...? అయితే మీకీ సంగతి చెప్పి తీరాల్సిందే....
విశాఖ జిల్లా ఆనందపురం మండలం మెట్టమీదపాలెంలో కొలువై వుంది పోలెమ్మ అమ్మవారు. అమ్మవారికి రాయి సమర్పిస్తే చాలు కోరిన కోర్కెలు నెరవేరతాయట. అంతేకాదు రాయి సమర్పించిన భక్తుల కుటుంబాలను అమ్మవారు చల్లగా చూస్తారని స్థానికుల విశ్వాసం. పోలెమ్మకు పసుపు, కుంకుమలను సమర్పించినవారి జీవితాలు పచ్చగా నూరేళ్లు వర్థిల్లుతాయని నమ్మకం.
దీంతో మెట్టమీదపాలేనికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. వచ్చిన ప్రతి భక్తుడు పోలెమ్మకు రాయి సమర్పించడంతో అక్కడ ఓ పెద్ద రాళ్లు గుట్ట ఏర్పడింది. అమ్మవారికి రాళ్లను సమర్పించడం ఇప్పటిది కాదనీ, తరతరాలుగా ఓ ఆచారంగా వస్తోందనీ గ్రామ ప్రజలు చెపుతున్నారు.