ఆ ఆలయంలో ఎటు చూసినా మహిళలు గుంపులు గుంపులుగా కనిపిస్తారు. గాజులు, అందెల సవ్వడులతో ఆలయం మారుమ్రోగుతుంటుంది. గర్భగుడిలో చూస్తే ఆభరణాల కాంతిలో ముద్దులొలికిస్తుంటాడు చిన్నికృష్ణుడు.
అదే కేరళలోని కోట్టయం అనే ప్రాంతానికి సమీపంలో ఉన్న పూవాందురుందులోని శ్రీకృష్ణాలయం. దేశంలోనే మహిళలచే నిర్వహించబడే ఆలయంగా ఈ ఆలయం చరిత్ర సృష్టించింది. ఆలయం నిర్మించిన స్థలం కూడా మహిళలదే, నిధులు కూడా వారు సమకూర్చుకున్నవే.
సుమారు 70 మంది మహిళలు కలిసి జ్యోతి పౌర్ణమి పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆలయంలోని కృష్ణునికి సేవ చేయడం, దైవ కార్యాల్లో మునిగిపోవడం ద్వారా ప్రశాంతత లభిస్తోందని అక్కడి మహిళలు అంటున్నారు.
మహిళలు మాత్రమే ఉండే ఈ ఆలయంలో వారి అభిరుచికి తగ్గట్టుగానే ప్రార్థనా గీతాలు కూడా ఉంటాయి. సర్వ ఐశ్వర్య పూజ, విద్యాగోపాల మంత్రార్చనలు వంటి పూజలు ఈ ఆలయంలో నిత్యం జరుగుతుంటాయి.
ఏకాదశి నాడు ఈ ఆలయంలో మహిళలు విశేష పూజలు నిర్వహిస్తారు. పర్వదినాల్లో ఆలయానికి మహిళలు తెల్ల చీరలు కట్టుకుని వస్తుంటారు. ఈ ఆలయంలో శ్రీకృష్ణుని పూజించేందుకు పురుషులు కూడా వస్తుంటారు.