ఇటీవలనే గుజరాత్ ప్రజలు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దీపావళి ముగిసిన మరునాడు గుజరాతీలు బంధుమిత్రసపరివారసమేతంగా నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకుంటారు.
అయితే గుజరాత్‌లోని ఖేడా జిల్లాకు చెందిన వసో కుగ్రామానికి చెందిన గ్రామస్థులు మాత్రం మహాశివునితో మాట్లాడిన 'దాదా' చేతుల మీదుగా ఉగాదినాడు ప్రసాదం అందుకునేందుకు ఎదురు చూస్తుంటారు. ఉగాదిని పురస్కరించుకుని ప్రజలచే దాదాగా పిలవబడే యోగేంద్రభాయ్ బాబూభాయ్ పటేల్ తన స్వంత ఆలయంలో 'సువర్ణ భైరేంజ్ మహోత్సవాన్ని' నిర్వహిస్తాడు.
ఈ మహోత్సవంలో అందరూ పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా నెయ్యిలో ఉడికించిన వంద కిలోల వరి అన్నంలో 40 కిలోల డ్రై ఫ్రూట్స్, కేసరి మరియు చక్కెర కలిసిన ఆహారానికి బంగారు పూతతో కూడిన పొరను అద్దుతారు. దాదా ఆలయం ముందు భారీ సంఖ్యలో బారులు తీరిన భక్తులకు పైన పేర్కొన్న పదార్థాన్ని 'ప్రసాదం'గా పంచుతారు.
ఇక దాదా దేవునితో సంభాషించిన వృత్తాంతం ఎవరికైనా సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది. దాదా ఆధ్యాత్మిక పయనం వెనుక ఆశ్చర్యాన్ని రేకెత్తించే మలుపులు అనేకం. పటేల్ కుటంబంలో జన్మించిన దాదాకు యోగేంద్రభాయ్ బాబూభాయ్ పటేల్‌గా నామకరణం చేశారు. అతని తండ్రి స్వర్గీయ బాబూభాయ్‌కు అత్యున్నత స్థాయిలోని ఆధ్యాత్మిక సంగతుల పట్ల అవగాహన శూన్యం.
దాదాగా పిలవబడే పటేల్‌కు చదువు అంతగా వంటపట్టలేదు. దాంతో స్వంతంగా ఫ్రిడ్జులను రిపేరు చేసే వృత్తిని పటేల్ ఎంచుకుని అందుకుగాను ఒక దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పటేల్ వ్యాపారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా సాగడం మొదలుపెట్టింది.
ఇదిలా ఉండగా...
ఒకానొక రోజు...
15 సంవత్సరాల క్రితం నాటి మాట...
హఠాత్తుగా పటేల్ తన దేహంపై పట్టును కోల్పోసాగాడు. "అంతేకాక పంచేయాంద్రియాలు మాట వినడం మానేసాయి. గాలిలో తేలిపోతున్న అనుభూతిలో నేనుండగా... పరమశివుడు నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు... ఒకరితో ఒకరం సంభాషించుకోసాగాం..." అని దాదా పరవశంగా తెలిపాడు.
"పరమేశ్వరుని చేరుకోవడం కన్నా ఉత్తమమైన సత్‌గతి మానవునికి ఏముంటుంది?!" అరమోడ్పు కన్నులతో చెప్పిన దాదా అప్పటి నుంచి మానవాతీత శక్తులు తనను అంటిపెట్టుకుని ఉన్నాయని నమ్మబలుకుతాడు. వివాహమై ఒక కుమార్తె కలిగినప్పటికీ, సదా సదాశివుని ధ్యానంలో గడిపే దాదా... నిద్రాహారాలపై అపరిమితమైన నియంత్రణను అలవరచుకున్నాడు.
"దాదా ఏది చెబితే అది జరిగి తీరుతుంది. అలాగే ఇది జరగదు అని దాదా చెబితే దాని గురించిన ఆందోళన పడవలసిన అవసరం లేదని" దాదా అతీత శక్తుల పట్ల ప్రగాఢ విశ్వాసాన్ని కలిగిన గ్రామస్థులు చెపుతుంటారు. దాదా దర్శనార్ధం భక్తులు దూరప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు.
ఒకనాటి పటేల్ రిఫ్రిజిరేటర్ దుకాణం కేవలం జ్ఞాపకాలకే పరిమితమైంది.
ఎందుకంటే...
దుకాణం ఉన్న చోట దాదా కొలువైన దేవాలయం వెలిసింది కనుక...