సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల కోర్కెలను తీర్చుతారు. అలాగే కొద్ది మంది యువత తల్లిదండ్రుల కోర్కెలు, ఆకాంక్షలకు వీలుగా నడుచుకుంటుంటారు. శివ భక్తురాలైన తన తల్లి కోర్కెను తీర్చిన గుజరాతీ యువకుని కథను తెలుసుకుందాం రండి. గుజరాత్ సురేందర్ నగర్‌కు చెందిన రాకేష్.. పెళ్లీడొచ్చిన యువకుడు.
రాకేష్‌కు అదే ప్రాంతానికి చెందిన మాళవిక అనే యువతితో వివాహం నిశ్చియమైంది. ఈ వివాహాన్ని ఘనంగా జరుపుకునేందుకు కళ్యాణ మంటపానికి బదులు శ్మశాన వాటికను బుక్ చేసుకున్నాడు. తన తల్లి కోర్కె మేరకు శ్మశానవాటికలో పెళ్లి ఏర్పాట్లను రాకేష్ ఘనంగా చేశాడు. బంధుమిత్రులను ఆహ్వానించాడు. ఈ వింత పెళ్లిని తిలకించేందుకు బంధుమిత్రాదులు కూడా భారీ సంఖ్యలోనే తరలి వచ్చారు.
వేదమంత్రోచ్ఛారణల మధ్య, చితిమంటలే అగ్నిగుండంగా చేసుకుని రాకేష్-మాళవిక పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి వచ్చిన అతిథులు వధూవరులను ఆశీర్వదించి, దీవించారు. అయితే తన కుమారునికి మరుభూమిలో వివాహం చేయడానికి కారణాలు లేకపోలేదని వరుడి తల్లి అంటోంది.
శివపురాణంలో శివపార్వతుల వివాహం శ్మాశానంలోనే జరిగిందని, అందువల్ల తన కుమారుని వివాహం కూడా చితిమంటల మధ్య నిర్వహించాలని ఆనాడే నిర్ణయించానని చెపుతోంది. ఏమైనా.. ఈ కలియుగ శివపార్వతులను అభినందించాల్సిందే.