ప్రకృతి ప్రతి ప్రాణికి ప్రత్యేకమైన లక్షణాలు, గుణాలను ప్రసాదించింది. వాటిననుసరించి మిత్ర, శత్రు జీవులు ఆవిర్భవించాయి. వైరి వర్గం గురించి చెప్పాలంటే... పాము-ముంగీస, పిల్లి-ఎలుక వంటి జంతువులను ప్రధానంగా చెపుతారు. అయితే ఒక్కోసారి ఈ వైరి వర్గం పరస్పరం కలిసిపోయి మిత్రులుగా మారిపోయిన సందర్భాలు మనకు అరుదుగా కనబడుతుంటాయి.
కేరళలోని ఓ గద్ద తన సహజ ప్రవృత్తిని మానుకుని కోడి పిల్లలను పెంచుతోంది. వివరాలలోకి వెళితే... కేరళ వాస్తవ్యుడు మహదేవన్ జంతు ప్రేమికుడు. ఆయన ఓ గద్దను తెచ్చి పెంచటం ప్రారంభించాడు. ఇంతలో ఆయన ఇంటికి కొత్తగా రెండు కోడిపిల్లలు వచ్చి చేరాయి.
కోడి పిల్లలను చూసిన గద్ద సహజంగా వాటిని ఎగరేసుకుపోతుంది. అయితే ఇందుకు విరుద్దంగా గద్ద వాటిని అక్కున చేర్చుకుని సాకుతోంది. ఈ వింతను క్యాలికట్ ప్రజలు చూసి ఆశ్చర్యపోతున్నారు.