Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్నిటికీ ఆ భగవంతుడిదే దయ...

అన్నిటికీ ఆ భగవంతుడిదే దయ...

Raju

, శుక్రవారం, 20 జూన్ 2008 (18:16 IST)
ఏదైనా పనిలో విజయాన్ని సాధించాలంటే ఇష్టదైవాన్ని ప్రార్థించాలి.. వ్రతాలు చేయాలి.. మొక్కులు మొక్కాలి. ఈ విషయంలో సైంటిస్టులు మొదలుకుని సాధారణ ప్రజలవరకు అతీతులు కారనే చెప్పాలి. అణువును అణువణువూ శోధించడం నుంచి, చంద్రయానం వరకు పరుగులు తీస్తున్న భారతీయ అంతరిక్ష శాస్త్రజ్ఞులు, ఫలానా ముహూర్త బలంలోనే పిల్లలు పుడితే కుటుంబానికి శుభం జరుగుతుందనే నమ్మకాలకు కొత్త రూపునిస్తున్న సగటు ప్రజలు.. మొత్తం భారతీయ సమాజమే విశ్వాసాలకు పీఠం కడుతున్న చరిత్రను ప్రస్తుతం మనం చూస్తున్నాం.

సైన్స్ ప్రయోగాల్లో దైవ భావనకు చోటు లేదంటున్న ఈ శాస్త్రజ్ఞులే, అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా రూపొందిస్తున్న రాకెట్ల ప్రయోగం నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ వాటిని తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధికి తీసుకుపోయి పూజిస్తున్నారు. అసాధారణ మేథోనైపుణ్యంతో రూపొందించిన ఉపగ్రహాలు కూడా ఎక్కడో ఒకచోట ప్రయోగక్రమంలో దెబ్బతినే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి శాస్త్రవేత్తలకు కూడా వారిదైన భయం ఉంటోంది మరి.

పోతే ఇవేవో మనదేశంలో మాత్రమే జరుగుతున్నాయని విచారపడాల్సిన పనిలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమాక్రాట్ పార్టీ అభ్యర్థిగా దేశమంతటా పర్యటిస్తూ హనుమంతుడి బొమ్మను వెంటబెట్టుకుని వెళ్లే బారక్ ఒబామా, చేతిలో పెన్నీ నాణేన్ని పట్టుకుని తిరిగే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మెక్‌కెయిన్, మణికట్టులో ఎప్పుడూ జీసస్ క్రాస్‌ను ధరించే హిల్లరీ క్లింటన్ ఇలా ప్రపంచ స్థాయిలో కూడా ఎవరూ విశ్వాసాలకు అతీతులు కారు. నిజమే.. నమ్మకం ఒకసారి ఏర్పడితే అది జీవితాంతమూ పట్టుకు వేలాడుతూనే ఉంటుంది మరి.

చివరకు పుట్టే సమయాన్ని కూడా మార్చేస్తున్న విశ్వాసాలు మనిషి జీవితానికి అర్థం లేకుండా చేస్తున్నాయేమో.. బిడ్డ పుట్టిన తర్వాత జాతకాల్లో ఏదైనా లోపముంటే శాంతి చేయించటం, గ్రహదోషబలాలు సరిచేయటం పాతపద్ధతి. కాని విధి, నక్షత్రాలను చూసుకుని మరీ బిడ్డను సిజేరియన్ ద్వారా తల్లిగర్భంలోంచి బయటకు లాగే పాడుకాలం కూడా మనముందుకు వచ్చేసిందిపుడు.

జీవితంలో ప్రతి అంకంలోనూ నమ్మకాలే రాజ్యమేలుతున్నాయి. కొత్త బళ్లు కొంటే పూజలు, ఇల్లు కడితే పూజలు, పరీక్షలు రాయాలంటే పూజలు, మార్కులు రావాలంటే పూజలు. ఇలా మనిషి జీవితంలో ప్రతిదీ అపాయంగాను, అభద్రతగానూ తయారవుతున్న వాతావరణంలో రోడ్డు పక్కన కనిపించే ప్రతి రాయికీ, చెట్టుకి వంగి వంగి దండాలు పెట్టే మనుషులకు కొదవేముంటుంది మరి.

ఈ మధ్య కొత్త విశ్వాసం. నగల వర్తకుల జేబులు నింపే విశ్వాసం.. అక్షయ తృతీయ విశ్వాసం. అక్షయ తృతీయ రోజున నగలు కొంటే లక్ష్మీదేవి అలా కొన్న వారి ఇంట్లోకి గలగలా నడిచొస్తుందట. అయితే జనం ఇళ్లలోకి లక్ష్మీదేవి నడిచొచ్చిందో లేదో గాని ఆ రోజు నగల కొట్టోళ్ల గల్లా పెట్టెలు మాత్రం గలగలలాడే ఉంటాయి. ఎందుకంటే పుకారుకు విశ్వాసం తోడయ్యాక వేలం వెర్రిగా జనం టి.నగర్‌కో ఇంకో నగర్‌కో పరిగెత్తి ఉంటారనడంలో సందేహమే లేదు...

మొత్తం మీద ఒక్కమాటలో చెప్పాలంటే నమ్మకమే ఇప్పుడు మనిషిని నడిపిస్తోంది. ముఖ్యమంత్రులు, మెగాస్టార్లు, ఒబామాలు, క్లింటన్‌లు, ఇస్రో శాస్త్రజ్ఞులు, లక్ష్మీదేవి గలగలలు ఇన్ని నమ్మకాల మధ్య, ఇన్ని భయాల మధ్య, ఇన్ని అభద్రతల మధ్య....

మనం అభివృద్ధి చెందుతున్నామా... దిగజారుతున్నామా....

Share this Story:

Follow Webdunia telugu