దెయ్యాలు, భూతాలు అసలు ఉన్నాయా... లేదా అనే మీమాంస నేటికీ నెలకొని ఉంది. అయితే తాము భూతాన్ని చూశామనీ, దానిని తమ కెమేరాలో బంధించామనీ అంటోంది లండన్ అతీత శక్తులపై పరిశోధనలు చేసే బృందం. ఎన్నాళ్లగానో నోరా అనే భూతం లాంక్‌షైర్‌లోని బాకప్ రాజప్రసాదం థియేటర్‌లో నివాసముంటుందని ఆ థియేటర్‌ను సందర్శించినవారు చెప్పే మాట.
ఈ నేపధ్యంలో అసలు భూతం ఉందో లేదో తేల్చేస్తామంటూ పరిశోధకులు అక్కడికి వెళ్లారు. వారికి అక్కడ చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. భౌతికంగా ఎవరూ లేకుండానే వారికి అనేక అనుభవాలు ఎదురయ్యాయి. దీంతో భూతం ఉన్న మాట నిజమేనని వారూ వంతపాడుతున్నారు. నోరా భూతాన్ని తమ కెమేరాల్లో బంధించి ప్రదర్శించారు కూడా. దాని ఫోటోను కెమేరా నుంచి కంప్యూటర్‌లోనికి డౌన్‌లోడ్ చేసినప్పుడు చిత్రం పారదర్శకంగా అగుపించిందట.
భూతానికి సంబంధించిన వివరాలను చూస్తే... 1892 కి ముందు కాలంలో ఓ ఇనుప కర్మాగారంగా ఉన్న ఈ థియేటర్ ఆ తర్వాత వినోదాన్ని అందించే స్థలంగా రూపుదిద్దుకుంది. ఇక అప్పటి నుంచి నోరా భూతం అక్కడ తిష్టవేసిందట. ఆ థియేటర్ తాలూకు వెబ్‌సైట్ సైతం తాము భూతం చేసే చిత్ర విచిత్రాలను చూశామని చెపుతోంది. అయితే థియేటర్‌లో ప్రవేశించినవారికి ఈ భూతం ఎటువంటి హానీ తలపెట్టదట. కనుక మన పెద్దవారు కథల్లో చెప్పినట్లు దెయ్యాలూ... భూతాలు ఉన్నమాట నిజమేనన్నమాట. అయితే మన కథల్లోనివన్నీ చెడ్డ దెయ్యాలు, ఇది మాత్రం మంచి భూతం.