Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహబూబ్ నగర్ జిల్లాలో తేళ్ల పంచమి... ఆ తేళ్లు ఆరోజు కుట్టవట...

Advertiesment
మహబూబ్ నగర్ జిల్లాలో తేళ్ల పంచమి... ఆ తేళ్లు ఆరోజు కుట్టవట...
, శనివారం, 2 ఆగస్టు 2014 (19:41 IST)
మామూలుగా విషపూరితమైన తేళ్లు అంటే అందరికీ భయం. కానీ ఆ గ్రామంలో భయమే భక్తిగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుల్లో కర్ణాటకలోని ఓ గ్రామంలో తేళ్లకు పూజ చేస్తున్న విచిత్రమైన సంప్రదాయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అందరూ విషపూరితమైన తేళ్లను చూసి జడుసుకుంటే ఈ గ్రామస్థులు మాత్రం పూజలు చేస్తున్నారు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని కందుకూరులో విచిత్రంగా తేళ్లను ఇలవేల్పుగా కొలుస్తారు. 
 
నాగుల పంచమిరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. జిల్లా వాసులతోపాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు నాగపంచమి రోజున పాములకు బదులు తేళ్లకు నైవేద్యాలు పెట్టి వాటిని దేవుళ్లుగా భావించి తేళ్ల పండగ జరుపుకోవడం కర్నాటక రాష్ట్రం యాద్గీర్‌ తాలుకా కందుకూరు గ్రామస్థుల సాంప్రదాయం. తేళ్ల పండగ చేసుకునే కందుకూరు గ్రామానికి తెలంగాణలోని సమీప పట్టణం మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట.
 
కందుకూరు గ్రామ సమీపంలోని కొండపై ప్రతి సంవత్సరం తేళ్ల పంచమి వేడుకలు జరుగుతాయి. దేశమంతట నాగుల పంచమి రోజున నాగదేవతకు పూజలు చేస్తే ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా తేళ్ల దేవతకు పూజలు చేస్తారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం కావడంతో స్థానికులతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ మండలాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచీ భక్తులు భారీగా తరలివస్తారు. ఈ ప్రాంతవాసులంతా తేళ్ల గుట్టపైన వెలసిన విగ్రహాలను తమ ఇంటి దేవతలుగా భావించి పూజలు చేస్తారు. మొక్కులు ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక నైవేద్యాలను సమర్పిస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. 
 
నాగుల పంచమి రోజున గుట్టపై ఉన్న ఏ రాయిని తీసినా తేళ్లు కనిపిస్తాయి. వాటిని పిల్లలు, పెద్దలు, మహిళలు భయపడకుండా పట్టుకుని చేతులు, కాళ్లు, తల, మెడ, నాలుకపై వేసుకుంటారు. విచిత్రమైన విషయం ఏమిటంటే శరీరంపై తేళ్లను ఎక్కడ వేసుకున్నా కరవవు. మామూలుగా తేళ్లు విషపూరితమైనవి. తేళ్లను తాకితే అవి ఇట్టే కుట్టేస్తాయి. దీంతో శరీరంలో విష ప్రభావం కనిపిస్తుంది. కుట్టిన వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. అందుకే మామూలుగా తేళ్లని చూస్తేనే ఎవరికైనా భయమే. 
 
అయితే ఇందుకు విరుద్దంగా నాగులపంచమి రోజున తేళ్ల గుట్టపై తేళ్లను పట్టుకున్నా... అవి కరవకుండా మిన్నకుండిపోతాయి. ఇదే ఇక్కడి ప్రత్యేకత అని స్థానికులు చెబుతారు. అందుకే చిన్న పిల్లలు సైతం తేళ్లతో ఆడుకుంటారు.. ఇది కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే తేళ్లు కరవకుండా ఉంటాయని చెబుతారు. అంతేకాదు గుట్టపై వేల సంఖ్యలో తేళ్లు తిరుగుతుంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ తేళ్లను దేవతగా పూజిస్తారు. ఇది తమకు అనాదిగా వస్తున్న ఆచారమని స్థానికులు అన్నారు. 
 
కొత్తదంపతులు, ఏదైన శుభకార్యాలకు వెళ్లేవారు తేళ్ల దేవతను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నాగుల పంచమి రోజున తేళ్ల పండుగా ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజులు తేళ్ల దేవతకు పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసంతో చెప్తున్నారు.
 
పంచమిరోజు తమను తేళ్లు కరవవని వారి నమ్మకం. ఒకవేళ కరిచినా కుంకుమ వేసుకుంటే సరిపోతుందని గ్రామస్థులు చెబుతున్నారు. తేళ్లూ... దేవుళ్లని నమ్ముతున్న ఆ ఊరి జనం తేళ్ల విగ్రహాలకు ఏకంగా గుడిని కూడా కట్టారు. గుడిలో కొండ మహేశ్వరి దేవతగా పేర్కొనే తేలు విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రతి ఏటా నాగుల పంచమి రోజు ఆ విగ్రహాలకు నైవేద్యాలు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ విధంగా దేశమంతా పుట్టలో పాలుపోసి నాగుల పంచమిని జరుపుకుంటే ఈ గ్రామస్థులు మాత్రం తేళ్ల పంచమిని జరుపుకుని ఆశ్చర్యపరుస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu