Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూజిస్తే ప్రత్యక్షమవుతా?!

పూజిస్తే ప్రత్యక్షమవుతా?!
, గురువారం, 13 డిశెంబరు 2007 (18:52 IST)
కర్నాటకలో సాయిదీక్షలో ఉన్న ఒక కుటుంబానికి షిరిడీ సాయిబాబా ప్రత్యక్షమైన్నట్లుగా పేర్కొంటూ బట్వాడా అవుతున్న ఈమెయిల్ సంగతి మీకు తెలుసా... మానవమేధస్సుకు అందని మహత్తర శక్తి ఏదో ఈ ప్రపంచాన్ని నడిపిస్తోందని ఆధ్యాత్మిక భావనల మధ్య జీవనయానాన్ని సాగించే ఆస్తికులు విశ్వసిస్తుంటారు. అదే క్రమంలో పుణ్యం, పాపం, స్వర్గం, నరకం, పునర్జన్మ ఇత్యాది అంశాలను పరిగణనలోకి తీసుకొని అద్భుతమైన అతీత శక్తి భగవంతుడే అనే నమ్మకాన్ని చుక్కానిగా చేసుకొని సత్కార్యాలలో మునిగి తేలుతుంటారు.

ఆస్తికులలో కొందరు మానవ సేవే మాధవసేవ అనే సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి తోటి మానవులకు సహాయం చేయడం ద్వారా తాము నమ్ముకున్న భగవంతునికి సేవ చేసిన భావనతో బ్రహ్మానందాన్ని చవి చూస్తుంటారు. మరికొందరు వ్రతాలు, ఉపవాసాలు, యజ్ఞయాగాదులు చేస్తూ, మొక్కుబడులు తీర్చుకుంటూ ఇష్టదైవానికి ఆత్మనివేదన చేసుకుంటూ ఉంటారు. మార్గం ఏదైనా చేరుకునేది దైవసన్నధికే కదా అన్న సూత్రం ఆస్తికులందరికీ వర్తిస్తుందని లబ్ధప్రతిష్ఠులైన భక్తి ప్రబోధకులు తమ ప్రవచనాలలో తేటతెల్లం చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో షిరిడి సాయిబాబా భక్తులకు ప్రత్యక్షమైనట్లుగా పేర్కొంటూ నెటిజన్ల మధ్య బట్వాడా అవుతున్న ఛాయాచిత్రం వెనుక కథనాన్ని ఇదీసంగతి శీర్షికలో మీకు అందిస్తున్నాం. అపరిచితులు పంపిన ఇమెయిల్‌లో ఊటంకించిన వివరాలను అనుసరించి... కర్నాటక రాష్ట్రానికి చెందిన షిరిడి సాయిబాబా భక్తులు 108 రోజుల సాయి భజన (సాయి దీక్ష) వ్రతాన్ని చేపట్టారు.

దీక్ష చివరి రోజున వారు వైదిక ధర్మానుసారంగా హోమాన్ని నిర్వహిస్తుండగా.. హోమ గుండం సమీపంలో సాయిబాబా ప్రత్యక్షమయ్యాడని నిరూపించే ఛాయాచిత్రాన్ని ఈ మెయిల్‌తో పాటు జతచేశారు. అంతేకాక వీడియో మరియు ఫోటో కెమెరాలలో నిక్షిప్తం కాని ఆ ఘటనను మొబైల్ ఫోన్ మాత్రమే నిక్షిప్తం చేసిందని... ఆ ఛాయాచిత్రాన్ని ఈమెయిల్‌తో జత చేసినట్లు అపరిచితులు స్పష్టం చేశారు. సాయిబాబా తన భక్తుల వెన్నంటే ఉంటారనడానికి ఈ ఛాయచిత్రాన్ని నిదర్శనంగా చూపిన వారు, సాయిబాబాను విశ్వసించనివారు తాము పంపిన ఈమెయి‌ల్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని సూచించారు.
అయితే ఇదంతా వట్టిదే... మానవ కల్పితమైన దేవుని మానవుడే పూజించడమేటి...దేవుడు ప్రత్యక్షం కావడం ఏమిటి అని పైన పేర్కొన్న ఉదంతాన్ని కొట్టి పారేసే నాస్తికులకు భారతదేశంలో కొదవే లేదు.

Share this Story:

Follow Webdunia telugu