Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దివ్యఖురాన్ అవతరించిన రోజు రంజాన్... ఈద్ ముబారక్

దివ్యఖురాన్ అవతరించిన రోజు రంజాన్... ఈద్ ముబారక్
, సోమవారం, 20 ఆగస్టు 2012 (12:07 IST)
PTI
పండుగలు మానవ జీవన స్రవంతిలో ఓ భాగమై, జాతీయతా సంస్కృతికీ అద్దంపడుతున్నాయి. "పండుగ" అనేది ఏ మతానికి సంబంధించినదైనా... దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. అలాంటి సందేశాత్మక పండుగల్లో ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే "రంజాన్" కూడా ఒకటి.

చంద్రమాన క్యాలెండర్ ప్రకారం, ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదో నెలను "రంజాన్" మాసంగా పరిగణిస్తారు. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైన మాసంగా భావించి, నిష్ఠ, నియమాలతో ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు. "రంజాన్" మాసానికి మరో గొప్ప విశిష్టత ఏమిటంటే...? ఈ నెలలోనే మహమ్మదీయులు పవిత్ర గ్రంథంగా భావించే "ఖురాన్" ఆవిర్భవించడమే.

అలాంటి ఈ రంజాన్ నెలలో ముస్లింలు దాతృత్వం, క్రమశిక్షణ, ధార్మిక చింతనలతో అల్లదేవునిని ప్రార్థిస్తారు. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఉపవాసవ్రతాన్ని ఆచరిస్తారు. ఈ మాసంలో ఉపవాసదీక్షలను పూర్తినెలరోజుల పాటు పాటించడం అనేది వయోజనులైన స్త్రీపురుషులందరికీ విధిగా నిర్ణయించబడిందని మహమ్మదీయుల నమ్మకం.

రంజాన్ నెలలోని 27వ రోజున "షబ్-ఎ-ఖ్రద్‌"ను ముస్లింలు జరుపుకుంటారు. ఈ రోజున దివ్యఖురాన్ అవతరించిందని ముస్లిం శాస్త్రాలు చెబుతున్నాయి. ఇదే రోజున మహమ్మదీయులు రాత్రంతా జాగరణ చేసి ప్రార్థనలు చేస్తూ గడుపుతారు. ఆ రాత్రి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసే వారికి ఎన్నో సంవత్సరాల పాటు ప్రార్థనలు చేసిన ఫలం దక్కుతుందని విశ్వాసం.

ఇదే నెలలో జరిగే "ఇఫ్తార్ విందు"కు ముస్లింలు ఆత్మీయులను, సహృదయులను ఆహ్వానిస్తారు. రంజాన్ మాసంలోనే జకాత్, ఫిత్రా అనే పండుగలను ముస్లింలు జరుపుకుంటారు. ఈ పండుగ రోజుల్లో సంపన్నులు పేదవారికి దానం చేస్తుంటారు. ఈ విధంగా నెలంతటా పవిత్ర కార్యక్రమాలతో గడిపిన ముస్లింలు "షవ్వాల్" నెలవంక ప్రత్యక్షమయ్యాక ఉపవాస వ్రతాన్ని విరమిస్తారు.

మరుసటి రోజున ఈద్ ముబారక్ (రంజాన్) పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో, సంతోషానందాలతో జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగను కోలాహలంగా జరుపుకుంటారు. బంధువులు, ఆత్మీయులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu