హైదరాబాద్ అనగనే ముందుగా గుర్తొచ్చేది హైదరబాద్ బిర్యానీ, ఇరానీ చామ్.. ఇక రంజాన్ మాసంలో అదే స్థాయిలో గుర్తుకువచ్చే అద్భుత వంటకం హలీం. ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభం అవటంతో నగరంలో హలీం గుబాళింపులు వీస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసినా హలీమ్ తయారీ కేంద్రాలు ప్రత్యేకంగా వెలిసి రుచికరంగా హలీం అందిస్తున్నాయి
అందుబాటులో వెజ్ హలీం
నగరంలోని ప్రముఖ హలీం తయారీ సంస్థలు కోరుకున్న వారికి కోరుకున్న రుచుల్లో హలీమ్‌ని అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశాయి. హలీం తయారీలో వివిధ రకాల ఫ్లేవర్స్‌ను అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. నాన్‌వెజ్‌లో మరిన్ని రకాలతో పాటు శాకాహరుల కోసం వెజ్ హలీంను కూడా అందిస్తున్నారు.
తినరా మై మరచి
శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు హలీంలో లభించడంతో దీనిని ఆరగించేందుకు యువత సైతం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఖర్జూరం, ఎండు ద్రాక్ష, కిస్‌మిస్, జీడిపప్పు, బాదంపప్పు వంటి దినుసులతో రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్నిచ్చేలా ఉండటంతో హలీమ్ అందరి అభిమానాన్ని చూరగొంటుంది. మరీ ముఖ్యంగా డైటింగ్‌ల పేరుతో నోరుకట్టేసుకునే యువత సైతం హలీం రుచులను ఎంచక్కా ఆస్వాదిస్తున్నారు. మరి మీరు కూడా ఆస్వాదించండి. ఇతర ప్రాంతాలకు చెందిన వారయితే హైదరాబాద్ వచ్చినప్పుడు హలీంను మిస్సవకండి.