చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో సహా మొత్తం 50 మందికి డోపీంగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. యూఏఈ వేదికగా వచ్చే నెల 19వ తేదీ నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకానుది. దీంతో ఐపీఎల్‌లో పాల్గొనే క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సిద్ధమైంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన జాతీయ డోపింగ్ నిరోధక కమిటీ (నాడో)తో కలిసి క్రికెటర్ల శాంపుల్స్ సేకరిస్తామని నాడా ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. యూఏఈలో సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు మ్యాచ్ వేదికల్లో ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించనున్నట్లు నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ పేర్కొన్నారు.
యూఏఈలో నాడా ఐదు డోపింగ్ కంట్రోల్ స్టేషన్లను ఏర్పాటుచేయనుంది. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఒక్కో సెంటర్‌ను ఏర్పాటు చేయనుండగా శిక్షణా వేదికలు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ, అబుదాబిలోని జాయేద్ క్రికెట్ స్టేడియంలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఆటగాళ్ల మూత్రం శాంపిల్స్‌తో పాటు రక్త నమూనాలను కూడా నాడా సేకరించవచ్చు.
ప్రముఖ భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోనీ సహా స్టార్ క్రికెటర్లు 50 మంది నుంచి శాంపిళ్లను సేకరించనున్నారు. నాడాకు చెందిన మూడు బృందాలు వేర్వేరు బ్యాచ్‌ల్లో యూఏఈకి వెళ్లనున్నాయి. ఫస్ట్ బ్యాచ్ సెప్టెంబర్ మొదటి వారంలో బయలుదేరుతుంది. ఆ తర్వాత మిగతా బృందాలు వెళ్తాయి. యూఏఈ వెళ్లడానికి ముందే అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు.
ఇదిలావుండగా, మరికొన్ని వారాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ యూఈఏ వేదికగా ప్రారంభం కానుంది. సెప్టెంబరు 19న ప్రారంభమై, నవంబరు 10న ముగియనుంది. ఐపీఎల్ ప్రారంభ, ముగింపు తేదీలు తప్ప ఇప్పటికీ పూర్తి షెడ్యూల్ వెల్లడి కాలేదు. దీనిపై ఐపీఎల్ చైర్మన్ బ్రజేశ్ పటేల్ వివరణ ఇచ్చారు. ఆగస్టు 30 నాటికి ఐపీఎల్ షెడ్యూల్ వచ్చే అవకాశముందన్నారు.