భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ పోటీలు సరిగ్గా మరో పది రోజుల్లో ప్రారంభంకానున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ పోటీలను యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తిచేయగా, అన్ని జట్లూ ఇప్పటికే అక్కడకు చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటం చేస్తూ ఈ టోర్నీ మళ్లీ భారత్‌లోనే నిర్వహించబడుతుందనే ఆత్మవిశ్వాసంతో నిండిన ఓ థీమ్ సాంగ్‌ను ఐపీఎల్ యాజమాన్యం రిలీజ్ చేసింది. ఈ పాటకు క్రికెట్ అభిమానుల నుంచి విశేష స్పందన వస్తుండగా.. 'అయేంగే హమ్ వాపస్' అనే లిరిక్స్‌తో సాగిన ఈ పాట ఆద్యంతం క్రికెట్ అభిమానులను అలరిస్తోంది.
ఇదిలావుండగా, ఇటీవలే ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 19వ తేదీన చెన్నై - ముంబై జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం యూఏఈలో అడుగుపెట్టిన 8 జట్ల ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. ఎన్నో ఒడిదొడుకులను దాటి కరోనా కష్టకాలంలో బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహిస్తుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.