ఆడిన మ్యాచ్‌లు.. గెలుపు, ఓటములు సమానంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ - రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన పోరు ఏకపక్షంగా ముగిసింది. జోస్ బట్లర్ 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 (నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ కారణంగా రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో స్టీవ్ స్మిత్ సేన ఎనిమిది పాయింట్లతో ప్లేఆప్స్ రేసులో నిలిచింది.
మరోవైపు, చెన్నై జట్టు ఆడిన 10 మ్యాచ్‌లలో ఏడింటిలో ఓడింది. కేవలం మూడు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ ఓటమితో చెన్నై జట్టు ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా కనుమరుగమయ్యాయి. మున్మందు ఆ జట్టు మరో నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నాలుగింటిలో వరుస విజయాలు సాధించాల్సివుంది. అప్పటికీ ప్లేఆఫ్స్‌కు వెళుతుందన్న గ్యారెటీ లేదు.
నిజానికి ఐపీఎల్ టోర్నీ మొదలైనప్పటి నుంచి ప్లేఆఫ్స్‌కు చేరుతూ అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు నిజంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదేమో. ఆ జట్టు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 ఓటములతో పట్టికలో అట్టడుగున ఉన్న సీఎస్కే ఖాతాలో కేవలం ఆరు పాయింట్లే ఉన్నాయి. దీంతో ఈసారి నాకౌట్‌కు దాదాపు దూరమైన పరిస్థితి కనిపిస్తోంది.
ఇప్పుడు ధోనీ సేన మిగిలిన నాలుగు మ్యాచ్‌లను గెలవాల్సిందే. అప్పుడు ప్లేఆఫ్‌కు కనీస అర్హతైన 14 పాయింట్లతో ఉంటుంది. అయితే అంతకన్నా ముందు ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. అలాగే తమ 14 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు సాధించినా నెట్‌రన్‌రేట్ కూడా కీలకంగా మారుతుంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ కేవలం 12 పాయింట్లు సాధించినా ప్లేఆఫ్స్‌కు చేరింది. అందుకే సీఎస్కే సాంకేతికంగా ఇప్పటికీ ద్వారాలు మూసుకుపోలేదనే చెప్పవచ్చు.