ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న ధోనీ తన ఖాతాలో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన చెన్నై ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించింది.
గురువారం రాజస్థాన్ రాయల్స్ చివరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌తో వంద మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. మొత్తం 166 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సరిగ్గా వంద విజయాలు నమోదు చేసింది. అంతేకాదు, ఐపీఎల్‌లో వంద మ్యాచులు గెలిచిన జట్టుకు సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా ధోనీ పేరు రికార్డుల్లోకి ఎక్కింది.
ఇకపోతే.. ఐపీఎల్ 2019 సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్ ఆఖరి బంతికి ముగిసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా గురువారం రాత్రి తీవ్ర ఉత్కంఠ, వివాదాల నడుమ ముగిసిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 152 పరుగుల లక్ష్యాన్ని చెన్నై జట్టు 155/6తో ఛేదించింది. మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన మహేంద్రసింగ్ ధోనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
అంతకముందు మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సమష్టిగా రాణించి 151 పరుగులు చేసింది. చెన్నై జట్టులో దీపక్ చాహర్, శార్ధూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టగా.. మిచెల్ శాంట్నర్ ఒక వికెట్ తీశాడు.