Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శభాష్.. రిషభ్ పంత్ : తండ్రి మరణం... క్రీజ్‌లో బ్యాటింగ్... ఆకట్టుకున్న యువ క్రికెటర్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు రిషభ్ పంత్ అందరినీ ఆకట్టుకున్నాడు. తండ్రి మరణించిన విషాదాన్ని అధిగమించి ఇన్నింగ్స్‌ను నడిప

Advertiesment
శభాష్.. రిషభ్ పంత్ : తండ్రి మరణం... క్రీజ్‌లో బ్యాటింగ్... ఆకట్టుకున్న యువ క్రికెటర్
, ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (09:52 IST)
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు రిషభ్ పంత్ అందరినీ ఆకట్టుకున్నాడు. తండ్రి మరణించిన విషాదాన్ని అధిగమించి ఇన్నింగ్స్‌ను నడిపి అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. బుధవారం రాత్రి రిషభ్ తండ్రి హఠాన్మరణం చెందారు. 
 
తండ్రి అంత్యక్రియలకు వెళ్లిన రిషభ్ గురువారం దహన సంస్కారాలు చేసి వస్తుండగా జరిగిన ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు కూడా. అయితే శనివారం జరిగిన మ్యాచ్‌లో దుఃఖాన్ని దిగమింగి బ్యాటింగ్‌కు దిగిన పంత్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. రిషభ్ కడదాకా చేసిన పోరాటం జట్టుకు విజయాన్ని అందివ్వకపోయినా క్రీడాభిమానుల హృదయాలను మాత్రం గెలుచుకున్నాడు.
 
కాగా, ఈ మ్యాచ్‌లో బెంగుళూరు జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై విజయం సాధించింది. 15 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను మట్టికరిపించింది. తొలుత టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. మెరుపులు మెరిపిస్తాడని ఆశలు పెట్టుకున్న క్రిస్‌గేల్ 6 పరుగులకే పెవిలియన్ చేరి ఉసూరుమనిపించాడు. 
 
కెప్టెన్ క్రిస్‌గేల్ కూడా 24 పరుగులకే వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది. మన్‌దీప్ కూడా త్వరగానే వికెట్ సమర్పించుకున్నాడు. 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన దశలో బ్యాటింగ్‌కు దిగిన కేదార్ జాదవ్ (37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి ప్రత్యర్థి ముందు 158 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
 
అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి ఓడిపోయింది. తండ్రి మరణించిన విషాదాన్ని దిగమింగి మ్యాచ్‌ ఆడిన డేర్ డెవిల్స్ ఆటగాడు రిషబ్ పంత్ (36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు) ఒంటరి పోరాటం వృథా అయింది. బెంగళూరు బౌలర్ల ధాటికి తలవంచిన డెవిల్స్ బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. 
 
ఓపెనర్లు ఆదిత్య తారే (17 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు), బిల్లింగ్స్‌ (19 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 25‌), కరుణ్‌ నాయర్‌ (4), శామ్సన్‌ (13)లు విఫలమవడంతో డేర్‌డెవిల్స్ ఓటమి మూటగట్టుకుంది. కాగా, చిన్నస్వామి స్టేడియంలో 200 కంటే తక్కువ పరుగులు చేసి విజయం సాధించడం రెండేళ్లలో ఇదే తొలిసారి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ్యాక్స్‌వెల్ దూకుడు.... కింగ్స్ ఎలెవన్ విజయం