చేసినవి మూడు సినిమాలే అయినా అవి తన స్థాయివి కాదంటూ... దర్శకుడు కుమార్ నాగేంద్ర సెస్సేషనల్ వ్యాఖ్యలు చేశాడు. గుండెల్లో గోదారి.. సినిమాను లక్ష్మీ మంచుతో రూపొందించినప్పుడు.. పెద్ద క్రియేటివి వున్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన 'జోరు' సినిమాతో చెత్త దర్శకుడిగా మారిపోయాడు. ఆ కథ ప్రేక్షకులకు అర్థం కాలేదంటూ.. వివరణ ఇస్తున్న ఆయన.. మూడో చిత్రంగా.. నారా రోహిత్‌తో 'తుంటరి' చేశాడు. ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆయనతో చిట్‌చాట్.
దర్శకుడిలా ఎలా మారారు?
నేను అసిస్టెంట్ దర్శకుడిగా 15 ఏళ్ళు పనిచేశాను. కృష్ణవంశీ దగ్గర 'ఖడ్గం' నుంచి 'రాఖీ' వరకు పని చేశాను. ఆయన ప్రియ శిష్యుడ్ని. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని కొన్ని కథలు రాసుకున్నాను. ఆ సమయంలో లక్ష్మీమంచు గారితో పరిచయం కావడం.. కథ చెప్పడం జరిగింది. అప్పుడు 'గుండెల్లో గోదారి' వచ్చింది. ఆ తర్వాత 'జోరు'చేశాను. ఇప్పుడు తుంటరి..
'జోరు' ఒక్కరోజు సినిమాగా మిగిలిందే?
'జోరు' సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దానికి కారణం బడ్జెట్ పరిమితులే. అంతకుముందు 'గుండెల్లో గోదారి' సినిమా చేశాను. అంతా కొత్తవాళ్ళు. కానీ.. జోరు సినిమాను నటీనటులంతా సీనియర్లనే పెట్టుకుని పనిచేశాను. నాకున్న పరిమిత బడ్జెట్‌తో చేయాలి. ఆర్టిస్టులకు వన్‌మోర్ చెప్పే ఛాన్స్ లేదు. వాళ్ళు ఇచ్చిన పెర్‌ఫార్మెన్స్ తీసుకున్నాను. అందుకే నేను అనుకున్నది చేయలేకపోయాను. అది కన్‌ఫ్యూజ్ కామెడీ. నాకు అర్థమైంది కానీ, ఆ కథ ప్రేక్షకులకు అర్థంకాలేదు.
ఆ సినిమా ఏమి నేర్పింది?
ఏదైనా చూసేది ప్రేక్షకుడు.. ఫైనల్‌గా వారికి నచ్చాలి. మనం తెరవెనుక ఏం చేశామనేది అనవసరం.. అది గ్రహించాను.
తుంటరి ఎలాంటి కథ?
ఇది చిత్రమైన కాన్సెప్ట్.. తమిళ సినిమాకు రీమేక్. ముగ్గురు స్నేహితులకు రాబోయే ఓ న్యూస్ పేపర్ దొరుకుతుంది. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. జరుగబోయేది ముందే తెలిస్తే ఎలా వుంటుందనేది. చిత్రంలోని ఆసక్తికర పాయింట్. ఫాంటసీ కథ. తమిళంలో పెద్ద హిట్ సినిమా. దాన్ని తెలుగుకు మార్పులు చేశాం. తమిళంలో రెండు గంటల ముప్పై నిముషాలు. తెలుగులో అరగంట తీసేశాం. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ చాలా అందంగా వుంటుంది.
కథకు హీరోగా ఎవరినైనా అనుకున్నారా?
లేదు. ఈ కథకు ముందుగానే రోహిత్‌ను అనుకున్నాం. ఆయనకూ కథ నచ్చడంతో వెంటనే అంగీకరించారు. రోహిత్ బాక్సర్‌గా కన్పిస్తారు. ఈ కథను మురుగదాస్ అందించారు. నిర్మాతలు హక్కులు పొందాక.. ఆయన్ను కలిశాను. కొన్ని సలహాలు ఇచ్చారు. లవ్ స్టోరీ ఇంకాస్త బలంగా వుంటే బాగుంటుందని సూచించారు కూడా.
రీమేక్ చేయడం ఈజీనా?
ఈజీకాదు.. కొద్దిగా కష్టమే. హిట్ అయిన సినిమాను మళ్ళీ తీయడం మెప్పించడం కష్టమైన పనే. నాకు రీమేక్ సినిమాల కంటే స్ట్రెయిట్ చిత్రాలు చేయడంలో కిక్ వుంటుంది. ఎందుకంటే.. ఆ కథలు నా ఊహ.. నేనేం చేస్తున్నానో ఎవరికీ తెలియదు. అందరిలో ఆసక్తి వుంటుంది. రీమేక్‌లో ఆ కిక్ వుండదు. అయితే.. నిర్మాతల శ్రేయస్సు కోసమే రీమేక్ చేస్తున్నా.
సీరియస్ పాత్రలు వేసే రోహిత్ ఎలా సరిపోయాడు?
నారా రోహిత్ పెర్‌ఫార్మెన్స్ మెచ్చూర్డ్‌గా వుంది. ఇప్పటివరకు ఆయన సీరియస్ పాత్రలే చేశారు. తొలిసారి చాలా ఈజ్‌వున్న పాత్ర పోషించారు. 'సోలో' చిత్రం కంటే ఎనర్జీ లెవల్స్ వున్న పాత్ర అది. చివరి నలభై నిముషాలు మెప్పిస్తాడు.
ఏ తరహా చిత్రాలు చేయాలనుకుంటున్నారు?
ప్రేక్షకులు మెచ్చే చిత్రాలు తీయాలి. ఒక్కోసారి అందులో ఫెయిల్ అవుతాం. ప్రేక్షకులు మనకు డబ్బులిచ్చి విలువైన సమయాన్ని కూడా ఇస్తున్నారు. అందుకే గొప్ప సినిమాలు చేయాలి. అందుకు అన్నీ సహకరించాలి. దానికి సరైన నిర్మాత, హీరోహీరోయిన్లు కావాలి. మొదట్లో నాకు అలాంటి అవకాశాలు రావు. అందుకే వచ్చిన అవకాశాలతో సినిమాలు చేస్తున్నా. ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాను. అవి నా స్థాయికి తగవు. మొదట్లో అవాకశాలు ఇలాగే వస్తాయి.. అందుకే మంచి ఛాన్స్ వస్తే.. ఇండస్ట్రీని నెక్ట్స్ లెవల్‌కు వేళ్ళే చిత్రాలు చేయాలనుంది అని ముగించారు.