Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''త్రిపుర''లో నవరసాలున్నాయి.. సప్తగిరి వినోదం సినిమాకు హైలైట్: నిర్మాతలు

Advertiesment
Tripura Producers interview
, శనివారం, 31 అక్టోబరు 2015 (19:15 IST)
స్వాతి, నవీన్‌ చంద్ర ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'త్రిపుర'. 'గీతాంజలి' ఫేం రాజకిరణ్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రం తెరకెక్కింది. క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం.రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కమ్రాన్ స్వరాలు ఇటీవల విడుదలయ్యాయి. తెలుగులో నవంబర్ 6న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తమిళంలో 27న విడుదలవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత చినబాబు 'త్రిపుర' గురించి చెప్పిన విశేషాలివి.. 
 
ప్రశ్న: 'త్రిపుర' కథేంటి..? 
జ : అమాయకపు పల్లెటూరి అమ్మాయి స్వాతి. ఆమెకు వచ్చిన కలలన్నీ నిజమవుతుంటాయి. ట్రీట్మెంట్ కోసం సిటీ వస్తుంది. అక్కడ డాక్టర్ నవీన్ చంద్రతో ఆమె వివాహం జరుగుతుంది. గతంలో వచ్చిన కలలో డాక్టర్ కూడా ఉంటారు. తర్వాత ఏం జరిగిందనేది చిత్రం చూసి తెలుసుకోవాలి. 
 
ప్రశ్న: గీతాంజలి, త్రిపుర మధ్య తేడా ఏంటి..? 
జ : గీతాంజలి.. హారర్ కామెడీ చిత్రం. త్రిపుర.. థ్రిల్లర్ కామెడీ, కుటుంబ కథా చిత్రం. పెళ్లికి ముందు, తర్వాత జీవితం ఎలా ఉంటుంది? భార్యాభర్తల మధ్య అలకలు, ప్రేమానురాగాలు.. ఇలా నవరసాలు ఉన్న చిత్రమిది. దర్శకుడు వినోదాత్మకంగా తెరకెక్కించారు. సప్తగిరి చేసిన వినోదం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 
 
ప్రశ్న: స్వాతి కోసమే కథ రాశారా..? 
జ : లేదండీ. 'గీతాంజలి' తర్వాత దర్శకుడు రాజకిరణ్, నేను కలసి చిత్రం చేయాలనుకున్నాం. కథ కంటే ముందు 'త్రిపుర' పేరు పెట్టేశాం. కథ రాసుకున్న తర్వాత స్వాతి అయితే పాత్రకు న్యాయం చేస్తుందని అంతా భావించాం. ఆమెను కలవడం, ఓకే చెప్పడం జరిగాయి. మరో కథానాయిక ఆలోచన కూడా మాకు రాలేదు. స్వాతి అంతే అద్బుతంగా నటించింది. 
 
ప్రశ్న: విడుదలకు ముందే లాభాల్లో ఉన్నారట..? 
జ : అవునండీ. ముందు అనుకున్న బడ్జెట్ ఒకటి, ఇప్పుడు ఖర్చుపెట్టిన బడ్జెట్ ఒకటి. నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగ సెట్ వేశాం. హంపి, బాదామిలలో ఒక్కో పాట చిత్రీకరించాం. కథను నమ్మి ఖర్చు చేశాం. అంచనాలు బాగుండడంతో బిజినెస్ బాగా జరిగింది. శాటిలైట్ హక్కులను మూడున్నర కోట్లకు కొన్నారు. హ్యాపీ. 
 
ప్రశ్న: చిత్రంపై అంచనాలు ఏర్పడానికి కారణం ఏంటి? 
జ : కథ. స్వాతి గత రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. అలాగే 'గీతాంజలి' తర్వాత రాజకిరణ్ దర్శకత్వం వహిస్తున చిత్రం కావడం, కోన వెంకట్, వెలిగొండ స్క్రీన్ ప్లే.. మంచి అంచనాలు ఏర్పడడానికి కారణమయ్యాయి. 
 
ప్రశ్న: మీరు సినిమా చూశారా..? 
జ : చూశానండి. చాలా హ్యాపీ. నవంబర్ 6న ప్రేక్షకులు చిత్రం చూసి ఎలా ఉందో చెప్పాలి. 
 
ప్రశ్న: ఎన్ని ధియేటర్లలో విడుదల చేస్తున్నారు..? 
జ : ప్రపంచవ్యాప్తంగా సుమారు 600లకు పైగా ధియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఓవర్సీస్ ప్రేక్షకులలో కూడా చిత్రంపై మంచి అంచనాలున్నాయి. నైజాంలో 'శ్రీమంతుడు', 'రుద్రమదేవి' చిత్రాలను విడుదల చేసిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ 'త్రిపుర'ను పంపిణీ చేస్తుంది. చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మా చిత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి అంచనాలతో విడుదల కావడం సంతోషంగా ఉంది. 
 
ప్రశ్న: తమిళంలో 27న విడుదల చేయడానికి కారణం..? 
జ : తెలుగు, తమిళ భాషల్లో 27న విడుదల చేయాలనేది మా ప్రణాళిక. తెలుగులో కంచె, బెంగాల్ టైగర్, అఖిల్, శంకరాభరణం తదితర చిత్రాల విడుదల తేదీలలో మార్పులు చోటు చేసుకున్నాయి. లక్కీగా థియేటర్లు లభించాయి. బిజినెస్ అంతా ముందే పూర్తవడంతో 6న విడుదల చేస్తున్నాం. 
 
ప్రశ్న: తదుపరి చిత్రాలు..? 
జ : ఇంకా నిర్ణయం తీసుకోలేదు. స్వాతి అంగీకరిస్తే మళ్లీ ఆమెతో చిత్రం చేయడానికి రెడీ. 'త్రిపుర' తరహాలో మరో చిత్రం నిర్మించాలనుకుంటున్నా.

Share this Story:

Follow Webdunia telugu