తెరమీద హీరోలం అయినా.. నిజజీవితంలో జీరోలమే.. ఎందుకంటే.. అన్నీ అనుకున్నట్లు జరగవు. నాకు అలా వుండాలని.. ఇలా ఉండాలని ఉంటుంది.. కొత్తగా సినిమా రంగంలోకి వచ్చాక... ఇండస్ట్రీని ఏలేద్దామనుకున్నా.. కానీ ఏదీ మనచేతుల్లో లేదని అర్థమయింది.. అంటూ తత్త్వవేత్తగా మాట్లాడుతున్నాడు హీరో శర్వానంద్.
ప్రస్తానం, గమ్యం, అందరిబంధువయ, మళ్ళీమళ్ళీ రాని రోజు.. వంటి చిత్రాలు చేసిన శర్వానంద్.. రన్‌రాజా రన్, ఎక్స్‌ప్రెస్‌రాజా వంటి చిత్రాలతో హ్యాట్రిక్ సాధించాడు. ఈనెల 6న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా శర్వానంద్‌తో ఇంటర్వ్యూ...
* కెరీర్ ఎలా వుంది?
'మళ్ళీ మళ్ళీ రానిరోజు, 'రన్‌రాజారన్', ఎక్స్‌ప్రెస్‌రాజాతో.. హ్యాట్రిక్ కొట్టినందుకు చాలా సంతోషంగా వుంది. ఈ ఏడాది సంక్రాంతికి హిట్ కొట్టాను. నిర్మాతలు, పంపిణీదారులు చాలా హ్యాపీగా ఉన్నారు. కెరీర్ చాలా బాగుంది.
* అయినా సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుంటున్నారు?
సినిమాలు ఎక్కువగా చేయాలని మాత్రం అనుకుంటున్నాను. సినిమా సినిమాకు గ్యాప్‌కు కారణం.. సరైన కథలు కోసమే. ప్రస్తుతం మూడు సినిమాలకు సంబంధించిన కథలు జరుగుతున్నాయి.
* పుట్టినరోజు ప్రత్యేకతలు?
పుట్టినరోజునాడు నిర్ణయాలు తీసుకోనే స్థితిలో లేను. ఈ ఏడాది మూడు సినిమాలు చేయాలనుకుంటున్నాను. కేసినేని నాని తమ్ముడు చిన్ని నా కోసం కథ రాసుకుంటున్నారు. అలానే మరో ముగ్గురు దర్శకులు కథలు రాస్తున్నారు. ఎవరి సినిమా మొదలవుతుందో చెప్పలేను. బౌండ్ స్క్రిప్ట్ వచ్చే వరకు ఏ సినిమా చేయను.
* కొత్తగా 'రాజాధిరాజా' పేరుతో ఓ సినిమా వస్తోంది. రాజా.. సెంటిమెంటా?
అదేంలేదు. అసలు ఆ సినిమా గురించి నాకు పెద్దగా తెలీదు. ఐదేళ్ళనాటి సినిమా అది. తమిళంలో చేరన్ దర్శకత్వంలో చేశాను. 'ఏమిటో ఈ మాయ' అని టైటిల్ అనుకున్నాం. ఇప్పుడు టైటిల్ మార్చినట్లు తెలిసింది. ఆ సినిమాలో నా పేరు జె.కె... అసలు ఈ సినిమా ఎవరు రిలీజ్ చేస్తున్నారో కూడా తెలీదు. అసలు తమిళంలోనే ఆ సినిమాను సీడీలో రిలీజ్ చేశారు. అంటే థియేటర్‌లో విడుదలకాలేదు. అలాంటిది తెలుగులో థియేటర్లలో విడుదలకావడం ఆశ్చర్యం కల్గిస్తుంది.
* థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి కథలో చేస్తారా?
అందరూ అది చేస్తే బోర్ కొడుతుంది. కానీ, చేయవచ్చునేమో. కథ నచ్చితే చేస్తాను. కానీ అది కొత్తగా వుండాలి. తక్కువ బడ్జెట్‌లో జాగ్రత్తగా తీసుకోవాలి. కానీ ఎక్కువగా ప్రేమకథలే వస్తున్నాయి. గమ్యం.. తరహా చేయవచ్చు. అలాంటి కథలు కుదరాలి.
* పారితోషికం పెంచుతున్నారే?
నేను పెంచలేదు. సినిమా సినిమాకు వారే పెంచేస్తున్నారు. నిర్మాతను ఇబ్బందుల్లో పెట్టాలని అనుకోను. మార్కెట్ రీత్యా వారు అలా ఇస్తున్నారు. దాన్ని బట్టి మొత్తం సినిమా బడ్జెట్‌కూడా పెరుగుతుంది. ఏదైనా.. ఊరికే డబ్బులు నిర్మాతలు ఇవ్వరుకదా.
* మీతో నటించిన హీరోయిన్లలో ఎవరంటే ఇష్టం?
నేను ఇప్పటివరకు నటించిన హీరోయిన్లందరిలోనూ నిత్యమీనన్ అంటే ఇష్టం. బాగా నటిస్తుంది. డైలాగ్ ఒక్కసారి చెబితే పట్టేస్తుంది.
* ఎలాంటి దర్శకులతో చేయాలనుంది?
రాజమౌళితో నటించాలనుంది. అలాగే మణిరత్నం, త్రివిక్రమ్, పూరీలాంటి దర్శకులతో పనిచేయాలనుంది. పూరీ చిత్రాల్లో హీరోకు స్పెషల్ క్యారెక్టరైజేషన్ వుంటుంది.
* పెండ్లెపుడు.. ఎవరినైనా ప్రేమించారా?
పెళ్లి అయినప్పుడు అవుతుంది. నేను ఎవరితోనూ ప్రేమలో పడలేదు. పడినా సినిమాలోని పాత్ర వరకే.
* ఖాళీ సమయాలల్లో ఏం చేస్తారు?
ఖాళీగా ఉన్నప్పుడు తినడం, నిద్రపోవడం, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం.. ఇవే నా వ్యాపకాలు.
* హ్యాబీలు?
జర్నీ అంటే ఇష్టం. ఆమధ్య.. ఇండియ బోర్డర్ వరకు వెళ్ళి వచ్చాను. అక్కడ వారి సాధకబాధలు తెలుసుకున్నాను. వారి ముందు మనమెంత? అనిపించింది. ఇక్కడేదో అభిమానులు. సినిమాలు.. హీరోలు.. దండాలు పెడుతుంటే.. ఇదే లోకం అనుకుంటాం.. కానీ అక్కడ వారిని చూస్తే జీవితం అర్థమైంది. వారి మాటల్లో.. మాపై ఓ సినిమా చేయకూడదా? అని అడిగారు కూడా. చేయాలనుంది. చేస్తే... నా బేనర్‌లోనే చేస్తా..
* గోల్స్ ఏమైనా వున్నాయా?
ఏమీలేవు.
* అంటే నటుడిగా అలా వుండాలి. ఇలా వుండాలని వుంటుంది కదా.. అస్సలు ఇండస్ట్రీకి మొదట్లో ఏమనుకుని వచ్చారు?
నాకు అది చేయాలని. ఇది చేయాలని.. చాలా వుంటాయి. కానీ వాస్తవంలో అది జరగదు. ఏదీ మనచేతుల్లో లేదు. అందుకే గోల్ పెట్టుకోలేదు. ఇక ఇండస్ట్రీకి వచ్చే కొత్తలో.. ఇండస్ట్రీని ఏలేద్దామని మాత్రం అనుకుని వచ్చాను... అంటూ నవ్వుతూ ముగించారు.