Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైతుతో కలిసి నటించడం నాకు ఇష్టం లేదు... కానీ... సమంత అక్కినేని ఇంటర్వ్యూ

Advertiesment
చైతుతో కలిసి నటించడం నాకు ఇష్టం లేదు... కానీ... సమంత అక్కినేని ఇంటర్వ్యూ
, సోమవారం, 1 ఏప్రియల్ 2019 (22:04 IST)
అక్కినేని నాగ‌చైత‌న్య‌, హీరోయిన్ సమంత అక్కినేని పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టించిన‌ చిత్రం ‘మ‌జిలీ’. శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. స‌మంత‌తో పాటు దివ్యాన్ష కౌశిక్ మ‌రో హీరోయిన్‌గా న‌టించారు. ఈ చిత్రం ఏప్రియల్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ సమంతతో ఇంటర్వ్యూ..
 
పెళ్ల‌య్యాక మీ ఇద్దరూ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కదా! సెట్లో ప్రొఫెష‌న‌ల్‌గా ఉండ‌టం ఏమైనా క‌ష్టంగా అనిపించిందా?
చైత‌న్య వైపు నుండి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ నా వైపు నుంచి కొంచెం క‌ష్ట‌మే. ఎందుకంటే ఇంత‌కుముందు మానిట‌ర్ చూస్తే నేను నా పెర్ఫార్మెన్స్ మాత్ర‌మే చూసేదాన్ని. కానీ `మ‌జిలీ`లో నా పెర్ఫార్మెన్స్ క‌న్నా చైత‌న్య పెర్ఫార్మెన్స్‌ను చూసి `ఇది ఓకే క‌దా… ఇది ఓకే క‌దా` అని ఎగ్జ‌యిట్ అవుతూ అడిగేదాన్ని. దానికి ఆయ‌న `ఏయ్ రిలాక్స్‌గా ఉండూ అంతా డైర‌క్ట‌ర్ గారు చూసుకుంటారు` అని అనేవారు. అది ప్రొటెక్టివ్ ఇన్‌స్టింక్స్. దానివ‌ల్ల ఆయ‌న‌కి కాస్త ఇబ్బంది ఏర్పడింది.
 
మజిలి కథ ఎంపిక విషయంలో మీ జడ్జిమెంట్ కరెక్ట్ అని అనుకుంటున్నారా?
ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేయ‌డం నాకు అంత ఇష్టం లేదు. చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయి. వాటిని అంత తేలిగ్గా మ‌నం సంతృప్తిప‌ర‌చ‌లేం అని అనిపించింది. ఇప్పుడు మేమిద్ద‌రం ఒక‌రినొక‌రు చూసుకోవ‌డం, ప్రేమ‌లో ప‌డ‌టం వంటి సినిమాలు చేస్తే రొటీన్‌గా ఉంటుంది? క‌లిసి చేస్తే ఏదైనా కొత్త‌గా చేయాలి. `మ‌జిలి` అలాంటి కొత్త క‌థే. నాకు పెళ్ల‌యి రెండేళ్ల‌యింది. నాకు పెళ్లికి ముందు, పెళ్లి త‌ర్వాత ఉన్న ప్రేమ‌కు తేడా గుర్తించ‌గ‌లుగుతున్నా. పెళ్ల‌య్యాక నేను అనుభ‌విస్తున్న ప్రేమ నాకు ఓ సెక్యూరిటీగా ఉంది. మ‌న‌శ్శాంతిగా ఉంది. పెళ్లికి ముందు ప్రేమలో ఉన్న హైస్ వంటివి ఇప్పుడు లేక‌పోవ‌చ్చు, కానీ భ‌ద్ర‌తాభావాన్ని మాట‌ల్లో చెప్ప‌లేం. 
 
పెళ్ల‌యిన త‌ర్వాత ప్రేమ‌లో ఒక అందం ఉంటుంది. ఈ ప్రేమ‌ను ఎందుకు చాలామంది సినిమాల్లో చెప్ప‌డం లేదు అని అనిపించింది. ఒక‌మ్మాయికి పెళ్ల‌య్యాక కేవ‌లం భ‌ర్త‌తో ప్రేమ కాదు.. ఆ కుటుంబంతో ప్రేమ మొద‌ల‌వుతుంది. అమ్మ‌తో, నాన్న‌తో… ఆ కుటుంబంలో ఉన్న అంద‌రితోనూ జ‌ర్నీ మొద‌ల‌వుతుంది. తండ్రీకొడుకుల మ‌ధ్య ప్రేమ‌.. ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. ఈ రెండున్న‌ర గంట‌లలో శివ‌గారు చాలా రిలేష‌న్‌షిప్స్ గురించి డిస్క‌స్ చేశారు. నేను సినిమా చూశా. చాలా బావుంది. శివ‌గారికి, చైత‌న్య‌కి వాళ్ల కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా ఉంటుంది.
 
ఈ క్యారెక్టర్ చేయ‌డం మీకు ఈజీగా అనిపించిందా?
నా జీవితంలో ఒక మోటో ఉంటుంది. నేనెప్పుడూ నిన్న‌టికంటే బెట‌ర్‌గా ఉండాల‌నుకుంటా.. రేపు ఈ రోజుక‌న్నా ఇంకా బావుండాల‌నుకుంటా. నా గ‌త చిత్రం క‌న్నా ఈ సినిమాలో ఏదో ఒక కొత్త లేయ‌ర్ ఉండాలి. ఈ సినిమాలో నా పెర్ఫార్మెన్స్‌లో ఆ లేయ‌ర్ ఉంది. ఇందులో శ్రావ‌ణి అనే పాత్ర చేశా. త‌నేం ఎక్కువ మాట్లాడ‌దు. కానీ కుటుంబానికి ఆమె చాలా స్ట్రెంగ్త్ ను అందించాలి. నాకు అది చాలెంజ్‌గా అనిపించింది. అది నాకు చాలా కొత్త రోల్‌.
 
నిజ జీవితంలో శ్రావ‌ణికి, మీరు ఏమైనా పోలిక‌లున్నాయా?
స్ట్రెంగ్త్‌లో మాత్రమే పోలిక ఉంది. నేనెక్కువ మాట్లాడ‌తాను. శ్రావ‌ణి మాట్లాడ‌దు.
 
స్క్రిప్ట్ విన్నాక చేంజ‌స్ ఏమైనా చెప్పారా?
అలాంటిదేమీ లేదు. నేను క‌థ వింటున్న‌ప్పుడు చేయాలా? వ‌ద్దా? అని నిర్ణ‌యించుకుంటాను. నేను ఒక్క‌సారి వ‌ద్ద‌నుకుంటే.. ఎన్ని మార్పులు చేసి తీసుకొచ్చినా నేను చేయ‌ను. ఒక‌వేళ నేను ఓకే చెప్పాన‌నుకోండి.. అస‌లుకథలో వేలు పెట్ట‌ను. `మ‌జిలి` క‌థ విన‌గానే వెంట‌నే న‌చ్చి, ఓకే చెప్పా. ఇటీవ‌ల సినిమా చూసుకున్న త‌ర్వాత శివ చెప్పిన‌దానిక‌న్నా చాలా బాగా తీశార‌ని అనిపించింది.
 
ఇంటి దగ్గర షూటింగ్ గురించి మాట్లాడుకుంటారా?
ఇంటికి వ‌చ్చాక కూడా మాట్లాడుకునేవాళ్లం. ఇందులో చైతూ పూర్ణ అనే పాత్ర చేశాడు. చాలా ఇంటెన్స్ ఉన్న పాత్ర అది. ప్ర‌తి రోజు అత‌నికి స‌పోర్ట్ చేయ‌డానికి నేను ఉండేదాన్ని. క్లైమాక్స్ గురించి ఎక్కువ డిస్క‌స్ చేశాం. ఎందుకంటే ఈ సినిమాలో క్లైమాక్స్ మెయిన్‌. ఈ సినిమా చూసిన త‌ర్వాత చైతూని చూస్తే చాలా గ‌ర్వంగా అనిపించింది.
webdunia
 
ఈ క‌థ ఎమోష‌న‌ల్‌గా ఉంటుందా?
ప్ర‌తి ల‌వ్‌స్టోరీలోనూ ఒకే ర‌క‌మైన భావాలుంటాయి. కానీ అందులో మ‌నం ఎంత ఎమోట్ చేస్తున్నామ‌నేది కీల‌కం. ఈ సినిమాలో పూర్ణ‌, శ్రావ‌ణి, అన్షు భావోద్వేగాలు చాలా కీల‌కం. ఈ సినిమాలోని ఈ పాత్ర‌ల‌కు ప్రేక్ష‌కులు ఎంత క‌నెక్ట్ అయితే సినిమా అంత హిట్ అవుతుంది. శివ‌గారు ఈ పాత్ర‌ల‌ను చాలా బాగా డిజైన్ చేశారు. నేను సినిమా చూస్తున్న‌ప్పుడు నాకు సినిమా చూస్తున్నాననే భావ‌నే లేదు. కిటికీ నుంచి వాళ్ల జీవితాల్లోకి తొంగిచూస్తున్నాన‌నే ఫీలింగే క‌లిగింది. సినిమాటోగ్ర‌ఫీ, ఫ్రేములు, చిన్న చిన్న సీన్లు, చిన్న డైలాగులు, న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్… ప్ర‌తిదీ చాలా రియలిస్టిక్ ఉండి..చాలా అందంగా ఉంటుంది. ప్ర‌తి సీన్‌కి ఆడియన్స్ క‌నెక్ట్ అయ్యేలా ఉంటుంది.
 
సినిమాలో చైత‌న్య లిప్‌లాక్‌ గురించి ?
కిస్‌, హ‌గ్గు, ట‌చ్‌… స్క్రీన్ పైన ఏదైనా ఒక‌టే. నేను ఒక న‌టిగా దాన్ని అలాగే చూస్తానంతే. ఎందుకంటే ఆ సీన్‌కి అక్కడ కిస్ కావాలి. అక్క‌డ మాట‌లు దాటిన ఎమోష‌న్ ఉంది దాన్ని పలికించడానికే చైత‌న్య కిస్ చేశారు.
 
సీన్ చేసిన‌ప్పుడు మీరెలా ఫీల‌య్యారు?
ఆ సీన్ చేశార‌ని నాకు ముందు తెలియ‌దు. ఒక‌రోజు శివ‌గారు `స‌మంతా రండి. మీకు ఒకటి చూపిస్తాను` అని చూపించారు. నేను చూసిన త‌ర్వాత `ఓహో కిస్ చేశారా` అని అనుకున్నా.
 
ఈ మ‌ధ్య మ‌హిళ‌ల పాత్ర‌లు గ్లామ‌ర్‌కే ప‌రిమితం కావ‌డం లేదు. గ‌మ‌నించారా?
నిజ‌మే. డ్యాన్సుల‌కు ప‌రిమితం కావ‌డం లేదు. మ‌హిళా ప్రేక్ష‌కుల్లో మార్పు వ‌చ్చింది. న‌టీమ‌ణులు కూడా తెర‌పై త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకోవాల‌ని అనుకుంటున్నా. విమెన్ ఆడియ‌న్‌, గ‌ర్ల్స్ థియేట‌ర్ల‌కు వ‌చ్చి త‌మ‌లాంటి మ‌హిళ‌ల‌ను చూడాల‌నుకుంటున్నారు. కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల్లో చూడాల‌ని అనుకోవ‌డం లేదు. అందుకే ద‌ర్శ‌కుల్లోనూ మార్పు వ‌స్తోంది.
 
ఈ స్టేజ్‌లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ‌డానికి రెడీగా ఉంటారా? ఎలా?
ఇప్పుడున్న స్టేజ్‌లో చాలా లేజీ అయ్యాను. ఎవ‌రైనా క‌థ చెప్తాన‌న్నా ఇప్పుడు వింటానా? రేపు వింటాను.. అని అంటున్నా. ఇంత‌కుముందు ఏడాదికి ఐదు సినిమాలు చేయ‌క‌పోతే నాకు టెన్ష‌న్ వ‌చ్చేది. `నా లైఫ్ అయిపోయిందా? ప్రేక్ష‌కుల‌కు నేను న‌చ్చ‌డం లేదా? చూడ్డానికి బాగోలేనా?` వంటి ఆలోచ‌న‌లు చుట్టుముట్టేవి. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా. హ్యాపీ అంటే వ్య‌క్తిగ‌తంగానూ, వృత్తిప‌రంగానూ. ఇప్పుడు ఒక్క సినిమా వ‌స్తే అది `సూప‌ర్ డీల‌క్స్` లాంటి సినిమా కావాల‌ని ఉంటుంది. రివ్యూలు చ‌దివిన‌ప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంత‌కు ముందులా ఏడాదికి మూడు, నాలుగు, ఐదు సినిమాలు చేసేయాల‌నేం లేదు. ఒక్క సినిమా చేసినా, క్వాలిటీ సినిమా చేస్తే చాలు, పెర్ఫార్మెన్స్ ఉన్న సినిమా ఉంటే చాలు.
 
రంగ‌స్థ‌లం త‌ర్వాత కూడా `మిగ‌తా హీరోయిన్స్‌లా క‌మ‌ర్షియ‌ల్‌ సినిమాలు నేను చేస్తాను` అని అన్నారు?
ఇప్పుడు `సూప‌ర్ డీల‌క్స్ కూడా క‌మర్షియ‌ల్ సినిమానే. అంటే రెగ్యుల‌ర్ అనే మాటను మాట్లాడి ఉండ‌ను. రెగ్యుల‌ర్ అనే మాట ఇప్పుడు నా డిక్ష‌న‌రీలో లేదు. అదెప్పుడో ఎగిరిపోయింది. నేనిప్పుడు సినిమా చేయాలంటే అది నాకు చాలెంజింగ్ గా అనిపించాలి. అప్పుడే చేస్తాను. ఇన్ని ఏళ్ల త‌ర్వాత నాకు జ‌డ్జిమెంట్ ఉంటుంద‌నే అనుకుంటా. కొన్నిసార్లు మ‌నకు స్క్రిప్ట్ చెప్పేట‌ప్పుడు బావుంటుంది. కానీ తీరా సినిమా చూశాక మార్పు రావ‌చ్చు. ఎందుకంటే ఎంతో మంది దానిలో ఇన్ వాల్వ్ అయ్యి ఉండవచ్చు. అలాంటప్పుడు ఏమీ చేయ‌లేం కానీ, నా జ‌డ్జిమెంట్ మీద నాకు న‌మ్మ‌కం ఉంది.
webdunia
 
మ‌జిలీలో మీకు క‌నిపించిన ఆ స్పెష‌ల్ లేయ‌ర్ ఏంటి?
 హీరోగారికి అప్ప‌టిదాకా ఒక‌మ్మాయితో ల‌వ్ ఉంటుంది. అంత‌సేపు వాళ్ల‌ని చూసి ఆనందించిన ఆడియ‌న్ ఉన్న‌ట్టుండి న‌న్ను యాక్సెప్ట్ చేయాలి. అంటే వెరీ ఫ‌స్ట్ షాట్‌లోనే న‌న్ను నేను ప్రూవ్ చేసుకోవాలి.అక్క‌డ ఎదో ఇంపాక్ట్ చూపించాలి. పైగా ఎక్కువ మాట్లాడ‌లేను. అలాంట‌ప్పుడు అది నాకు చాలెంజింగ్ పాత్రే క‌దా. కొన్నిసార్లు క‌ళ్ల‌తో భావాలు ప‌లికించాలి. కొన్ని సార్లు కేవ‌లం నా అభిన‌యంతోనే అంతా చెప్ప‌గ‌ల‌గాలి. ఈ క‌థ‌లో నాకు క‌నెక్ట్ అయిన సీన్ అదే.
 
చైతూ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పండి?
ఆయ‌న నాతో ఈ విష‌యం చెప్పొద్ద‌ని చెప్పి పంపారు. ఆయ‌న పెర్ఫార్మెన్స్ చూసి కొన్ని షాట్స్‌లో నేను కూడా షాక్ అయ్యా. అంత బాగా చేశారు అని మాత్రమే చెప్పగలను.
 
మీరు ఆయ‌న్ని అప్రిషియేట్ చేస్తుంటారా?
బాగా చేస్తే అప్రిషియేట్ చేస్తా. లేకుంటే అస్స‌లు చేయ‌ను.
 
పెళ్ల‌య్యాక ఆయ‌న‌తో న‌టించ‌డం ఎలా అనిపించింది? కంఫ‌ర్ట్ గానే ఫీల‌య్యారా?
నాకు ఎదురుగా ఉన్న ఆర్టిస్ట్ ఎవ‌రైనా స‌రే, నేను నా 100 శాతం న‌ట‌న‌ను క‌న‌బ‌రుస్తానంతే. ఎందుకంటే ఒక షాట్ వెయ్యేళ్లు ఉంటుంది. స్మాల్ షాట్‌ని కూడా మ‌నం అగౌర‌వ‌ప‌ర‌చ‌కూడ‌దు. `యాక్ష‌న్` అన‌గానే నా ముందున్న‌ది ఎవ‌రు? వాళ్ల‌తో నాకున్న బంధం ఏంటి? వాళ్ల‌ను నేను ఇష్ట‌ప‌డ‌తానా? ఇష్ట‌ప‌డ‌నా?… అస‌లు ఇలాంటివేమీ ప‌ట్టించుకోను. ఆ క్ష‌ణం నేను వంద శాతం న్యాయం చేస్తా. కాకపోతే దంప‌తులుగా సెట్‌కి వెళ్ల‌డం, క‌లిసి ఎక్కువ సేపు గ‌డప‌డం ఈ సినిమాలో బెస్ట్ ఎక్స్ పీరియ‌న్స్.
 
ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 9 ఏళ్లయిందా?
ఇది నా తొమ్మిదో ఏడు. నేను `దూకుడు` చేసేట‌ప్పుడు మ‌హేష్‌గారు నాకు కెరీర్ బెస్ట్ అడ్వైజ్ ఇచ్చారు. `ప్ర‌తి సినిమానూ తొలి సినిమా అనుకో` అని అన్నారు. ఆ మాట నాపై చాలా బాగా ప్ర‌భావితం చేసింది. అందుకే నేను తొలి సినిమాను కొత్త సినిమా అనుకుంటా. సెట్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ అదే రెస్పెక్ట్, అదే ట్రీట్‌మెంట్ ఇస్తా. ఆన్‌సెట్‌లో నేను ఇంకా అస్స‌లు ఏమీ మార‌లేదు. అందుకే నేను ఎద‌గ‌గ‌లుగుతున్నానేమో. నేను చేసే షాట్ బాగా రావాలి. మా ద‌ర్శ‌కుడు మెచ్చుకోవాలి అని అనుకుంటా.
 
పెద్ద‌వాళ్ల అడ్వైజ్‌కి అంత విలువిస్తారా?
త‌ప్ప‌కుండా ఇస్తాను. ఎందుకంటే అడ్వైజ్ అనేది నా దృష్టిలో బంగార‌మే. ఎందుకంటే ప‌దిహిట్లు వ‌చ్చిన త‌ర్వాత ఎప్పుడూ రిలాక్స్ కాకూడ‌దు. ఇంకా ఏదో చేయాల‌నే త‌పన‌ను చూపించాలి. అది మ‌న వైపు ఇత‌రుల దృష్టిని మ‌ళ్లిస్తుంది.
 
శివ‌గారు తొలి సినిమాకు త‌న ఫ్రెండ్ లైఫ్ ఇన్స్పిరేష‌న్ అని అన్నారు. ఈ సినిమాకు ఏమైనా ఉన్నాయేమో అడిగారా?
శివ‌గారికి వైజాగ్ అంటే ప్రాణం. అక్క‌డున్న ఒక రాయిని గురించి కూడా ఐదు నిమిషాలు మాట్లాడుతారు. అంత‌టి అభిమానం ఉంటుంది. ఆ వైజాగ్ ఒరిజినాలిటీ ప్ర‌తి మాట‌లో, ప్ర‌తి విజువ‌ల్‌లో అది క‌నిపిస్తుంది. సెట్స్, డైలాగ్స్, పాత్ర‌లు, వాళ్లెలా మాట్లాడుకుంటారు వంటివ‌న్నీ ఒరిజిన‌ల్‌. మిడిల్ క్లాస్ సెట్టింగ్ మొత్తం చాలా ఒరిజిన‌ల్‌గా ఉంటుంది. మొద‌టి సినిమాకు, రెండో సినిమాకు మ‌ధ్య మ‌రో ప‌ది సినిమాలు చేసినంత ఎక్స్పీరియ‌న్స్‌ని కూడ‌గ‌ట్టుకున్నారు.
 
ఎమోష‌న‌ల్ సీన్ల‌లో మీరు నిజంగానే ఏడుస్తారా?
నేనేం అంత ఎమోష‌న‌ల్ ప‌ర్స‌న్‌ని కాదు. కాక‌పోతే ఎమోష‌న‌ల్ సీన్లు చేసేట‌ప్పుడు మాత్రం నేను గ్లిజ‌ర‌న్ వాడ‌ను. వంద శాతం ఇన్వాల్వ్ అయ్యి చేయాల‌నే అనుకుంటా. గ్లిజ‌రిన్ వాడితే మ‌నం కంప్లీట్ యాక్ట‌ర్ అని అనుకోను.
 
మజిలీ 1980ల్లో జ‌రిగిన క‌థా?
1990ల్లో జ‌రిగింది. ఈ సినిమాలో ప్రేమ ఉంది, పెయిన్ ఉంది. ఒక‌బ్బాయి జీవితం, అత‌ను మ‌గాడిగా మార‌డం, అత‌ను వాస్త‌వాల‌ను అర్థం చేసుకోవ‌డం వంటివ‌న్నీ ఉంటాయి. ఇందులో ఒన్ సైడ్ ల‌వ్ స్టోరీ లేదు. అలాగని ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ కాదు.
 
చైతూగారికి లైఫ్‌లో ఒన్‌సైడ్ ల‌వ్ ఉందా?
ఆ మాట న‌న్ను అడుగుతున్నారా? ఆయ‌న‌కు పెళ్ల‌య్యి రెండేళ్ల‌యింది. ఇప్పుడు మొద‌టికి వెళ్తానంటారా చెప్పండి.
 
చైతూగారికి అప్పుడు చూడ్డానికి, ఇప్పుడు చూడ్డానికి మీకేమ‌నిపిస్తోంది?
ఆయ‌న‌లో సీరియ‌స్‌నెస్ వ‌చ్చింది. చాలా ఇంప్రూవ్‌మెంట్ వ‌చ్చింది. ఆయ‌న న‌ట‌న ప‌రంగా కూడా మెరుగ‌య్యారు.
 
నాగార్జున‌గారు `మ‌న్మ‌థుడు2` క‌థ గురించి చెప్పారా?
చెప్పారు. నాకు న‌చ్చింది. కానీ మీకు చెప్పను.
 
కొత్త సినిమాల‌ గురించి ?
ఓ బేబీ సినిమా జ‌రుగుతుంది క‌దా… పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో ఉంది. స‌మ్మ‌ర్ ఎండ్ విడుద‌ల ఉంటుంది. పూర్తి స్థాయి కామెడీ రోల్ చేయాల‌ని నాకు కోరిక ఉండేది. `అ ఆ` లో కాస్త చేశాను. కానీ ఓ బేబీలో ఆ కోరిక నెర‌వేరుతుంది. 96లో త‌మిళ్‌లో త్రిష చేసిన పాత్ర‌ను నేను ఇక్క‌డ చేస్తున్నా. మా ఇద్ద‌రికీ ఏదో క‌నెక్ష‌న్ ఉంద‌నుకుంటా.
 
ఇంకేమైనా సినిమాలు చేయాల‌ని ఉందా? 
స్పోర్ట్స్ సినిమాల‌కు నేను చాలా బాగా క‌నెక్ట్ అవుతా. అలాంటివి చేయాల‌ని ఉంది. స్పోర్ట్స్ బ‌యోపిక్స్ అంటే ఇష్టం. యూనివ‌ర్స‌ల్ ఎమోష‌న్స్ అంటే ఇష్టం. ఏమైనా నేర్చుకోవాల‌న్నా వాటి కోసం నేర్చుకోవ‌డానికి సిద్ధ‌మే.
 
బాలీవుడ్‌కి వెళ్ల‌రా?
నేను రాన‌ని వాళ్లే నిర్ణ‌యించుకున్న‌ట్టున్నారు అని చెప్పారు సమంత.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాని న్యూ మూవీ టైటిల్ ఏంటో తెలుసా..?