అమ్మాయిలు అబ్బాయిల వెంట పడటం చూశా... అదే 'రోజులు మారాయి' : మారుతీ ఇంటర్వ్యూ
ఇండస్ట్రీలో చిన్న సినిమాలంటే ఒకవిధమైన భావన వుందనీ.. రిలీజ్ అయ్యాక ఎప్పుడొచ్చాయో.. ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో తెలియనంతగా బుట్ట దాఖలవుతున్నాయని... దర్శకుడు మారుతి తెలియజేస్తున్నాడు. తాను చిన్న సినిమాలు తీసి ఎదిగినా... ప్రస్తుతం చిన్న సినిమాలంటే వుండే భా
ఇండస్ట్రీలో చిన్న సినిమాలంటే ఒకవిధమైన భావన వుందనీ.. రిలీజ్ అయ్యాక ఎప్పుడొచ్చాయో.. ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో తెలియనంతగా బుట్ట దాఖలవుతున్నాయని... దర్శకుడు మారుతి తెలియజేస్తున్నాడు. తాను చిన్న సినిమాలు తీసి ఎదిగినా... ప్రస్తుతం చిన్న సినిమాలంటే వుండే భావనను పోగొట్టడానికే కొన్ని సినిమాలకు సపోర్ట్ చేస్తున్నాననీ.. నా ప్రయత్నాన్ని చూసి దిల్ రాజు కూడా ప్రోత్సాహిస్తున్నారని అన్నారు.
తాజాగా ఆయన దిల్‌రాజు, శ్రేయాస్ శ్రీనివాస్‌లతో కలిసి నిర్మించిన సినిమా 'రోజులు మారాయి'. కొత్త దర్శకుడు మురళి తెరకెక్కించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తిచేసుకొని ఈ శుక్రవారం (జూలై 1న) విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మారుతీతో ఇంటర్వ్యూ..
రోజులు ఎవరికి మారబోతున్నాయి?
అందరికీ మారబోతున్నాయి. చిన్న సినిమాలు చేసే నిర్మాతలు, దర్శకులకు మారతాయని అనుకుంటున్నాను. సహజంగా.. వారంవారం.. చిన్న సినిమాలు 5,6 విడుదలవుతుంటాయి. అవన్నీ చాలామటుకు డస్ట్‌బిన్‌లోకి వెళ్ళిపోతున్నట్లుగా మరలా కన్పించవు. దానికి ప్రేక్షకుల నాడి తెలియక.. చేసే సినిమాలనే నా భావన. అందుకే మంచి సినిమాలు తీయాలని.. చిన్న సినిమాలు తీస్తున్నాను.
ఈ చిత్ర కథకు ప్రేరణ ఏమిటి?
కొద్దికాలం క్రితం పేపర్లో, అక్కడక్కడా వార్తల్లో అమ్మాయిలు కూడా ఈమధ్య అబ్బాయిల వెంట పడుతున్నారని రావడం చూశా. ఈ ఆలోచనేదో బాగుందే అనిపించి ఈ కథ రాశా. కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా తీసుకొని, వాటిని సినిమాటిగ్గా ఎలా చెప్పొచ్చో ఆలోచించి పూర్తి కథ సిద్ధం చేశా.
మీరే సినిమా చేయవచ్చుగదా?
కొత్తవారిని ప్రోత్సాహించడమంటే ఇష్టం. నాతో పాటు కలిసి పనిచేసిన వారికి ఇలా అవకాశాలు ఇస్తే వాళ్ళూ నిరూపించుకుంటారు. 'రోజులు మారాయి' లాంటి కథలు అప్పటికప్పుడు చెప్పేయాలి. నేను నా సినిమాతో బిజీగా ఉన్నపుడు ఇలాంటి కథలను కొత్తవారితో డైరెక్ట్ చేయిస్తే వాళ్ళకూ అవకాశం దొరుకుతుందన్నదే నా ఆలోచన.
దిల్ రాజుతో కలిసి చేయడం ఎలా అనిపిస్తుంది?
ఏదో మ్యాజిక్‌గా జరిగిపోయింది. 'కేరింత'లో నటించిన పార్వతీశంను ఈ సినిమా కోసం సంప్రదించినపుడు, దిల్ రాజుతో అతడికి అగ్రిమెంట్ ఉందని తెలిసింది. అప్పుడే దిల్ రాజుకి కూడా కథ చెప్పా. ఈ కథేదో బాగుందే, సరదాగా నేనూ కో-ప్రొడ్యూస్ చేస్తా అని ఆయన కూడా ఓ నిర్మాతగా చేరిపోయారు.
మీ గత చిత్రాల తరహాలో పెద్దల కామెడీ వుంటుందా?
అడల్ట్ కామెడీకి దూరంగా వుండే సినిమా. కొత్తగా ప్రయత్నించినప్పుడు అనుకోకుండా కొన్నిసార్లు పక్కదార్లు పడుతుంటాం. ఇందులో స్ట్రైట్‌గా చెప్పాలనుకున్నది నీట్‌గా చెప్పేశాం. చిన్న సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలంటే ఎలా ఉండాలో ఈ సినిమా అలా ఉంటుంది.
చిన్న సినిమాలకు మార్కెట్ లేదంటారు గదా?
కరెక్టే.. అంతంతమాత్రమే ఉంటుంది. మనం చెప్పాలనుకున్న అంశాన్ని ముందు ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. చిన్న సినిమాకు మొదటిరోజు ప్రేక్షకులు ఉండరన్నది తెలుసుకోవాలి. మరి అలాంటప్పుడు మనం ఓ మంచి బలమైన కథను చెప్తే తప్ప ఎవ్వరూ రెండు గంటల సినిమా చూడరు. చిన్న సినిమాకే ఎక్కువ కష్టపడాలని, ఆ సినిమా ఆడితే చిన్న సినిమా వల్లే పెద్ద పేరొస్తుందన్నది మర్చిపోకూడదు.
'రోజులు మారాయి' ఎందుకు చూడాలి?
ఈతరం ప్రేమల గురించి చెప్పాం. ఇప్పుడు లవ్‌లో చాలామందికి ఆప్షన్స్ ఎక్కువైపోయాయి. పెళ్లి చేసుకున్నాక.. కొన్నాళ్ళు.. మరో అమ్మాయి చూస్తే.. గతంలో తప్పు చేశామనే ఫీలింగ్ ఇప్పట్లో చాలామందిలో వుంటుంది. అది ప్రేమలో వుండకూదు. ప్రేమ అనేది ఎప్పటికీ ప్రేమగానే వుండాలి. అందరూ కనెక్ట్ అవుతారన్న నమ్మకం ఉంది.
దర్శకుడిగా మీ ప్రమేయం ఉందా?
నేను నా సినిమాతోనే బిజీగా ఉన్నా. ఒక్కసారి కథ పూర్తిచేసి దర్శకుడు మురళికి ఇచ్చాక అంతా తానే చూసుకున్నాడు. మొన్నే సినిమా చూసినప్పుడు కూడా నేనైతే ఎలా తీసేవాడినో మురళి అలాగే తీసాడనిపించింది.
'బాబు బంగారం' గతంలో వెంకటేష్‌కు చెప్పి.. ఆగిపోయిన కథేనా?
కాదు. ఇది కొత్తది. వెంకటేష్ గారి సినిమాలను చూస్తూ పెరిగా, ఆయనను నేనెలా చూడాలి అనుకుంటానో అలాగే 'బాబు బంగారం'లో చూపించా. మొదటి ప్రేక్షకుడిగా బాబు బంగారం నాకైతే చాలా నచ్చింది. రేపు ప్రేక్షకులందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది అని చెప్పారు.