'యజ్ఞం' సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఏ.ఎస్.రవి కుమార్ చౌదరి. ఆ తర్వాత ఆయన చిత్రాలు మందకొడిగా సాగాయి. దాదాపు పది సంవత్సరాల తర్వాత 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రంతో వెలుగులోకి వచ్చారు. ఈలోగా ఆడతా తడపా నటుడిగా చేశారు. 'బ్రోకర్' చిత్రంలో విలన్‌గా నటించారు. అయితే ఆ తర్వాత కొన్ని చిత్రాలు వచ్చినా దర్శకత్వం వెనుకబడిపోతుందనే వద్దనుకున్నట్లు తెలియజేశారు.
ప్రస్తుతం ఆయన గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈనెల 25న రవికుమార్ చౌదరి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ.
* మళ్ళీ గోపీచంద్‌తో సినిమా ఎలా అనిపించింది?
'యజ్ఞం' చిత్రం తర్వాత మరలా గోపీచంద్‌తో పని చేసే అవకాశం వచ్చింది. అయితే 'యజ్ఞం'కు సీక్వెల్ కాదు. ఆ చిత్రానికి దీనికి సంబంధమేలేదు. ఇది పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌లో సాగుతుంది. అలా అని 'లౌక్యం'లా వుండదు. దానికి మించి వుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం సగభాగం పూర్తయింది. ఇంకోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది.
* బాలీవుడ్‌లో సినిమా ఓపెనింగ్‌నాగే రిలీజ్ డేట్ చెప్పేస్తారు. ఇక్కడ ఎందుకు అలా జరగదు?
బాలీవుడ్‌లో అన్నీ ప్లాన్‌గా జరిగిపోతాయి. మన దగ్గర వచ్చేసరికి కొన్ని పరిమితులు వుంటాయి. ఒకే సమయంలో పెద్ద చిత్రాలు విడుదలైతే పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు మందగిస్తాయి. రెండూ ఒకేసారి విడుదల చేసేందుకు థియేటర్లు దొరకవు. మా చిత్రానికి ఇప్పుడు అటువంటి ప్రాబ్లమ్ లేదు. డిసెంబర్ 25న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
* దర్శకుడిగా గ్యాప్ రావడానికి కారణం?
మీకు తెలియనిదికాదు.. అవకాశాలు రాకపోవడమే. చెప్పిన కథలు కొందరికి నచ్చవు. నచ్చినా అందుకు కొన్ని లెక్కలు వుంటాయి. ఆ కాంబినేషన్‌లు కుదిరేవరకు కాస్త ఆలస్యమవుతూ ఉంటాయి.
* మీ గత చిత్రాల అపజయాల వల్ల ఏమి నేర్చుకున్నారు?
కొన్ని తప్పులు జరిగాయి. కథ అనుకున్నప్పుడు తెరపైకి తెచ్చేటప్పుడు కొన్ని పరిమితులు వుంటాయి. అందువల్ల ఒక్కోసారి బట్జెట్‌పరంగా నియంత్రణ వుంటుంది. అలాంటప్పుడు అనుకున్నదానికి న్యాయం చేయలేకపోవచ్చు. నేను అనుకున్న కథను ప్రేక్షకులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. వీటన్నింటికి మించి సరైన థియేటర్లు, టైం కూడా కలిసిరాకపోతే పడిన కష్టం వృధా. అందుకే గతంలో తెలిసో తెలియకో చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటున్నాను.
* గోపీచంద్ ఎలా నటించాడు?
డైరెక్టర్‌ను ప్రేమగా చూసే విధానం గల హీరో గోపీచంద్. సినిమాలో తన క్యారెక్టర్ ఏంటి? ఎలా నటించాలి? అనే విషయాలను తప్ప మిగిలిన విషయాలను పట్టించుకోరు. 'యజ్ఞం' సినిమా సమయంలో నటనపై కంటే కసి ఈరోజుకు కూడా తనలో ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమాలో చలాకీగా ఉండే పాత్రలో గోపీచంద్ కనిపిస్తాడు. చాలా స్టైలిష్ ఉంటారు.
* పుట్టినరోజు నిర్ణయాలు?
నిర్ణయాలు అంటూ పెద్ద లేవు. కానీ ప్రతి సినిమాకు మధ్య రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాను. ఇకపై అలా కాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని భావిస్తున్నాను. అలానే సినిమాల్లో నేను చేసిన తప్పులు ఇంక రిపీట్ కాకుండా చూసుకుంటాను.
* మీ సినిమాలు టీవీల్లో చూసుకుంటే ఎలా వుంటుంది?
'యజ్ఞం' తర్వాత నేను చేసిన 'ఆటాడిస్తా', 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రాలకు ప్రేక్షకాదరణ లభించలేదు. టివిలో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. అవి చూసి చాలామంది మంచి సినిమా ఎందుకు పోయింది అన్నారు. దానికి కారణం చెప్పలేం. అందుకే ఆ చిత్రాల తర్వాత ఇలా కాదు డిఫరెంట్‌గా చేయాలనుకున్నాను. కథ కంటే కథనం అనేది ముఖ్యమని తెలుసుకున్నాను. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ చేసిన 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాతో విజయాన్ని అందుకున్నాను.
* నటుడిగా కొనసాగిస్తారా?
నేను చేసిన చిత్రాలు ఆబ్లిగేషన్‌పై చేశాను. బ్రోకర్ సినిమాకు దర్శక నిర్మాత స్నేహితుడు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తేజ అడిగారు. కానీ నా ఎయిమ్ దర్శకత్వం. అది పక్కదారి పడుతుందని వద్దన్నాను. నా దృష్టిలో ట్రైన్‌లో ఇంజన్ ఉంటుంది. బోగీలు ఉంటాయి. నాకు ట్రైన్‌లో ఇంజన్‌లా ఉండమే ఇష్టం. అందుకే డైరెక్టర్‌గానే ఉండాలని ఫిక్స్ అయ్యాను.
* తదుపరి చిత్రాలు ?
కళ్యాణ్‌రామ్ బ్యానర్‌లో సాయి ధరమ్ తేజ్ హీరోగా సినిమా చేస్తున్నాం. జనవరిలో సినిమా షూటింగ్ మొదలు పెట్టి జూన్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.. అని చెప్పారు.