నిర్మాతలు వేరు. మేకర్స్ వేరు. మేకర్స్‌గా రామానాయుడు, ఎం.ఎస్.రాజు అని చెప్పవచ్చు. సినిమా నిర్మాతగానే కాకుండా మేకింగ్‌లో తగు జాగ్రత్తలు తీసుకునేవాడే అసలైన నిర్మాత ఎం.ఎస్.రాజు. ఆయన సినిమా కెరీర్ మొదలు పెట్టి ఇప్పటికి 25 ఏళ్ళు పూర్తయింది. దసరానాడు అప్పట్లో శత్రువుతో నిర్మాతగా మారిన ఆయన 25 ఏళ్ళకు మళ్ళీ దసరాకు ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన 'కొలంబస్' చిత్రం విడుదల కావడం తండ్రిగా గర్వంగా వుందంటున్నారు. కొలంబస్ చిత్రానికి స్క్రీన్‌ప్లే కూడా సమకూర్చిన ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
25 ఏళ్ళ కెరీర్‌ను విశ్లేషించుకుంటే ఎలా అనిపిస్తుంది?
వెంకటేష్ కథానాయకుడిగా రూపొందించిన 'శత్రువు' నిర్మాతగా నా మొదటి చిత్రం. అది దసరాకు ప్రారంభించాం. మళ్ళీ ఇన్నాళ్ళకు ఇదే దసరాకు నా కొడుకు సినిమా హిట్ కావడం చాలా ఆనందంగా వుంది. శత్రువు తర్వాత 'పోలీస్ లాకప్' కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. మూడో చిత్రంగా నిర్మించిన 'స్ట్రీట్ ఫైటర్' నిజంగానే రోడ్డు మీదకు లాగింది. మొండి ధైర్యంతో భారీ బడ్జెట్‌తో నిర్మించిన 'దేవీ' సూపర్ హిట్ అవ్వగా.. 'దేవీ పుత్రుడు' ఓ మోస్తరు విజయంతో సరిపెట్టుకొంది.
ఆ తర్వాత నేను స్వయంగా కథ, కథనం అందిస్తూ నిర్మించిన 'మనసంతా నువ్వే' నిర్మాతగా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతోపాటు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. 'నీ స్నేహం' కమర్షియల్‌గా ఆడకపోయినా.. ప్రేక్షకులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. ఇక ఆ తర్వాత ''ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా'' చిత్రాలు వరుసగా ఘన విజయాలు సాధించి నన్ను సంక్రాంతి రాజుగా మార్చాయి. ఆ తర్వాత 'పౌర్ణమి, వాన' నన్ను నిర్మాతగా, దర్శకుడిగా నిరాశపరిచినప్పటీకీ 'ఆట, మస్కా' ఓ మోస్తరు విజయం సాధించాయి. ఈవిధంగా నా పాతికేళ్ళ కెరీర్ ఎన్ని ఎత్తులు చూసానో.. అంతకుమించిన పల్లాన్ని సైతం చూశాను.
సక్సెస్ చిత్రాలు చేసిన మీరు నిర్మాతగా గ్యాప్ తీసుకోవడానికి కారణం?
2009లో వచ్చిన 'మస్కా' తర్వాత నా బ్యానర్‌లో మరో సినిమా రాలేదు. అందరూ గ్యాప్ తీసుకున్నారనుకున్నారు. కానీ ఆ గ్యాప్ మా అబ్బాయి సుమంత్ అశ్విన్‌ను హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలన్న గ్రౌండ్ వర్క్‌లో వున్నాను.
ఇప్పటి హీరోలతో సుమంత్ అశ్విన్ నిలదొక్కుకుంటారా?
నా కొడుకు వరుసబెట్టి సినిమాల్లో నటించేయాలని నేనేమీ కోరుకోవడం లేదు. ఎటువంటి కంగారు లేకుండా వాడి వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తూ స్టార్‌గా ఎదగాలి అని కోరుకొంటున్నాను. ఇప్పుడు సూపర్‌స్టార్‌గా హవా సాగిస్తున్న అజిత్ కూడా మొదట్లో సాఫ్ట్ సినిమాలే చేసాడు.
మేకర్‌గా పేరు తెచ్చుకోవడానికి కారణం?
నిర్మాతగా నాన్నగారు డబ్బు పెట్టేవారు. నేను కూడా మొదట్లో కేవలం నిర్మాతగానే వున్నాను. కానీ కోడి రామకృష్ణ చిత్రానికి పనిచేస్తున్నప్పుడు ఆయనే నన్ను మేకింగ్‌లు సలహాలు, విషయాలను తెలియజేసేలా ట్రీట్ చేశారు. దాంతో సినిమాపై పూర్తి పట్టు వచ్చింది. కథ, మాటలు, స్క్రీన్‌ప్లేపై అవగాహన వచ్చింది.
మళ్ళీ నిర్మాతగా ఎప్పుడు?
దర్శకుడిగా ''వాన'' నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ సినిమా క్లైమాక్స్‌ను మారుద్దామని అనుకొన్నప్పటికీ.. నా చుట్టూ ఉన్నవాళ్లు 'ఇలాగే బాగుంది' అనడంతో వారి అభిప్రాయంపై నమ్మకంతో విడుదల చేసాను. ఇకపై దర్శకత్వం చేయను అనను కానీ నిర్మాతగా మళ్ళీ నిలదొక్కుకున్నాకే మళ్లీ దర్శకత్వం వైపు దృష్టి సారిస్తాను.
మళ్ళీ మహేష్‌తో సినిమా ఎప్పుడు?
ఇటీవలే మహేష్‌ను కలిశాను.. ఆయనే సినిమా ఎప్పుడు మొదలుపెడుతున్నారంటూ అడిగారు. తప్పకుండా చేయాలి.. ఒక్కడు సినిమాతో మా ఇద్దరికి మంచి అవగాహన వుంది. దాన్ని చెడగొట్టకుండా వుండాలంటే మంచి కథ దొరకాలి. అలాగే... వెంకటేష్‌కు ఓ కథ చెప్పాను. దాన్ని డెవలప్ చేయమని అన్నారు.
మీ అబ్బాయితో సినిమా చేయరా?
తనకు తాను మౌల్డ్ చేసుకునే తెలివితేటలు వున్నాయి. ఇప్పటికి ఐదు బయట చిత్రాల్లో నటించడానికి సిద్ధంగా వున్నారు. నా వరకు రాకుండా వుంటే చాలు అనుకుంటున్నాను. వస్తే తప్పకుండా చేస్తాను అని ముగించారు.