Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరుణ్ తేజ్‌తో 'పాతాళ భైరవి' తీయాలనుంది... నిర్మాత సి.కళ్యాణ్‌

వరుణ్ తేజ్‌తో 'పాతాళ భైరవి' తీయాలనుంది... నిర్మాత సి.కళ్యాణ్‌
, మంగళవారం, 8 డిశెంబరు 2015 (19:49 IST)
'శ్రీమతి కావాలి' చిత్రంతో నిర్మాతగా కెరీర్‌ స్టార్ట్‌ చేసి అతి తక్కువ టైమ్‌లోనే ప్రముఖ హీరోలతో అందరూ మెచ్చే సినిమాలు చేస్తూ అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా, సౌత్‌ ఇండియన్‌ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడిగా పదవులు చేపట్టి అందరి అభిమానాన్ని పొందిన సి.కళ్యాణ్‌ ప్రస్తుతం ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం 'లోఫర్‌'. ఇటీవల ఆడియో ఆవిష్కరణ జరుపుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 17న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతోంది. ఇప్పటివరకు నిర్మాత 59 సినిమాలు నిర్మించిన సి.కళ్యాణ్‌ పుట్టినరోజు డిసెంబర్‌ 9. ఈ నేపథ్యంలో సి.కళ్యాణ్‌తో జరిపిన ఇంటర్వ్యూ.
 
ఈ బర్త్‌డే ప్రత్యేకత ఏమిటి?
ప్రత్యేకత అంటూ ఏమీలేదు. సాధారణంగా నాకు బర్త్‌డేలు జరుపుకోవడం, హడావిడి చేయడం ఇష్టం వుండదు. నా ఫ్రెండ్స్‌ అందరూ ఈ విషయాన్ని అడిగినా పదిమందికి ఉపయోగపడే పనులు ఆరోజు ఏమైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచన వుంటుంది తప్ప మరొకటి కాదు. ఈ బర్త్‌డేకి నా విషయంలో ఆనందం మాత్రం ఒకటి వుంది. 'లోఫర్‌' సినిమా ఈ నెల 17న విడుదల కాబోతోంది. 
 
నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్‌కి ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చింది?
చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఒక తల్లి, కొడుకు సెంటిమెంట్‌ని బాగా ప్రమోట్‌ చెయ్యగలిగాం. డైరెక్టర్‌గారు చాలా అద్భుతంగా తీశారు. ఆడియో ఫంక్షన్‌ చూసిన తర్వాత, ఇందులోని అమ్మ పాట విన్న తర్వాత తమ ఫోన్‌లో వాళ్ళ అమ్మ ఫోటో పెట్టుకోవాలనిపించింది అని చాలామంది ట్వీట్‌ చేస్తుంటే కొంతమంది మనసుల్ని మనం టచ్‌ చెయ్యగలిగామన్న ఆనందం కలుగుతోంది. ఇందులోని అమ్మ పాటని సుద్దాల అశోక్‌తేజ చాలా చక్కగా రాశారు. ఆదిత్య మ్యూజిక్‌ వారు మొదట నాలుగు రోజుల క్రితం ఈ పాటనే నెట్‌లో రిలీజ్‌ చేశారు. ఈ పాటకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 
 
59 సినిమాలు తీసిన నిర్మాతగా ఇప్పుడు చిత్ర పరిశ్రమ గురించి చెప్పాలంటే  ఏం చెప్తారు?
ప్రస్తుతం ఇండస్ట్రీ చాలా బ్యాడ్‌ పొజిషనల్‌లో వుంది. అది మాత్రం హండ్రెడ్‌ పర్సెంట్‌ కన్‌ఫర్మ్‌. హీరోలుగానీ, డైరెక్టర్లుగానీ, ఇతర టెక్నీషియన్స్‌గానీ అందరూ ఒక్కసారి మేకింగ్‌ గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితుల్లో వున్నప్పుడు నేను మాత్రం ఆ విషయంలో కొంచెం ఫాస్ట్‌గానే వున్నానని చెప్పాలి. మధ్యలో కొంచెం గ్యాప్‌ వచ్చినా ఇప్పుడు ఫాస్ట్‌గానే సినిమాలు చేస్తున్నాను. 
 
బ్యాడ్‌ పొజిషన్‌లో వున్న ఇండస్ట్రీలో మీరు సినిమాలు చేస్తున్నారు కదా! దానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
మొదట డైరెక్టర్‌తో నిర్మాతకు అండర్‌స్టాండింగ్‌ రావాలి. ఆ డైరెక్టర్‌ ఖర్చు పెట్టే ప్రతి పైసా స్క్రీన్‌ మీద కనిపిస్తుందా లేదా తెలియకపోతే మనుగడ కష్టం. క్లారిటీ అనేది లేకుండా సినిమా చెయ్యాలనుకుంటే ఈ రోజుల్లో జరిగే పని కాదు. దానికి హీరోల సహకారం వుండాలి. అంటే వాళ్ళు ఇచ్చే కాల్షీట్స్‌ విషయంలో మేం ఇచ్చే కాల్షీట్స్‌లోనే సినిమా ఫినిష్‌ చెయ్యాలి అనే లాకింగ్‌ చెయ్యకపోతే సినిమాలు తియ్యడం కష్టం. ఇప్పుడు మార్కెట్‌ పెరిగింది అని మనం అనుకుంటున్నాం. కానీ, ఎంత పెరిగినా ప్రతి సినిమా 'బాహుబలి' అయిపోదు. మన సినిమాల్లో మాగ్జిమమ్‌ 8 నుంచి 10 శాతం మాత్రమే సక్సెస్‌ అవుతున్నాయి. కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ అనేది కంట్రోల్‌లో వుండాలి. 
 
సినిమాలు కాస్ట్‌ ఫెయిల్యూర్స్‌ అవ్వడానికి రీజన్‌ ఏమిటనుకుంటున్నారు?
సినిమాలు రిలీజ్‌ అయిన తర్వాత మొదటి రోజుగానీ, ఆ తర్వాత రోజుల్లోగానీ ఆ సినిమాకి వున్న వేల్యూ ప్రకారం డబ్బులు పెట్టి సినిమాలు చూస్తున్నారు. కానీ, మేమే రూపాయిలో చెయ్యాల్సిన దాన్ని ఐదు రూపాయల్లో చేసి అది జనం మీద రుద్ది అది రిటర్న్‌ రాలేదని ఫీల్‌ అవుతున్నాం. సినిమా చూసేందుకు థియేటర్‌కి వచ్చే ఆడియన్స్‌ పెరిగారు. ఈ విషయంలో రాజమౌళికి థాంక్స్‌ చెప్పాలి. సినిమాని థియేటర్స్‌కి వెళ్ళి చూడాలన్న కోరికను 'బాహుబలి' సినిమా పెంచింది. 
 
మీ కెరీర్‌లో నిర్మాతగా మీకు పర్సనల్‌గా, కమర్షియల్‌గా తృప్తినిచ్చిన సినిమా?
'చందమామ' నా కెరీర్‌లో నాకు బాగా సంతృప్తినిచ్చిన సినిమా. ఫైనాన్షియల్‌గా ఆ ఫ్రూట్‌ని నేను ఎంత ఎంజాయ్‌ చేశాననేది పక్కన పెడితే వరల్డ్‌వైడ్‌గా ఒక పేరు అనేది వచ్చింది. 'చందమామ' అనే మంచి సినిమా కళ్యాణ్‌ చేశాడు అనే పేరుని మాత్రం తెచ్చింది. 
 
'లోఫర్‌'తో పాటు మీరు చేస్తున్న సినిమాలు?
'లోఫర్‌' నా 59వ సినిమా. 56, 57, 58 రిలీజ్‌ అవ్వకుండానే 59 రిలీజ్‌ అవుతోంది. ఆ సినిమాలకు సంబంధించి వర్క్‌ జరుగుతోంది. రామ్‌గోపాల్‌ వర్మ 'ఎటాక్‌' టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో వుండే సినిమా. వర్మగారు చాలా కాన్‌సన్‌ట్రేట్‌ చేసి ఈ సినిమా చేస్తున్నారు. జనవరి లోపే 'ఎటాక్‌' రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం. 
 
వరుణ్‌ తేజ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఎలా వుంది?
కొన్ని సినిమాల్లో ఆడవాళ్ళు బాధపడుతున్నప్పుడు మనకు బాధ అనిపించడం సహజం. కానీ, ఈ సినిమాలో వరుణ్‌ కళ్ళల్లో నీళ్ళు చూసి రెండుమూడు సన్నివేశాల్లో మన హార్ట్‌ ఫ్రీజ్‌ అవ్వడం అనేది జరుగుతుంది. మాస్‌ సినిమా అయినప్పటికీ ఇందులో సెంటిమెంట్‌ కూడా చాలా వుంది. దాన్ని వరుణ్‌ అద్భుతంగా చేశాడని చెప్పాలి. 
 
వరుసగా పూరి జగన్నాథ్‌తో రెండో సినిమా చేశారు. ఆయన మేకింగ్‌ స్టైల్‌ నచ్చి కంటిన్యూ అవుతున్నారా?
పూరిగారు తక్కువ టైమ్‌లో సినిమా చెయ్యడం అనేది ఏమీ లేదు. ఈ సినిమా 78 రోజులు షూట్‌ చేశాం. ఎక్కువ రోజులు టైమ్‌ వేస్ట్‌ చెయ్యడం వుండదు. తను తీద్దామనుకున్న సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ని పర్‌ఫెక్ట్‌గా రెడీ చేసి పెడతాడు. సిట్యుయేషన్‌ పరంగా కొంత బెటర్‌మెంట్‌ చేస్తాడు కానీ షూటింగ్‌ ప్లాన్‌ చేసి సీన్లు ఆలోచించడు. స్క్రిప్ట్‌ లేకుండా షూటింగ్‌ పెట్టడు. షూటింగ్‌ పెట్టిన తర్వాత సినిమా కంప్లీట్‌ చేసే పనిలోనే వుంటాడు తప్ప ఇంకో ఆలోచనలోకి వెళ్ళడు. నిర్మాత తనలో ఒక పార్ట్‌ అనే ఫీలింగ్‌ అతనికి వుంటుంది.
webdunia
 
నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?
'లోఫర్‌' తర్వాత ఇమ్మీడియట్‌గా 'ఎటాక్‌' రిలీజ్‌ వుంటుంది. దాని తర్వాత తమిళ్‌లో 'నానుమ్‌ రౌడీదాన్‌' పెద్ద హిట్‌ అయిన సినిమాని తెలుగులో 'నేనూ రౌడీనే' పేరుతో రిలీజ్‌ చేస్తున్నాం. ఇది కాకుండా సుదీప్‌, ప్రియమణి నటించిన కన్నడ సినిమా 'హలో బాస్‌' తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాను. పూరి జగన్నాథ్‌తో 'లోఫర్‌' తర్వాత మళ్ళీ సినిమా చేస్తాను. వి.వి.వినాయక్‌తో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే శ్రీను వైట్లతో కూడా ఒక సినిమా చేస్తున్నాను. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను. వీటన్నింటికీ మించి మా అన్నయ్య త్రివిక్రమ్‌కి థాంక్స్‌ చెప్పాలి. ఎందుకంటే నాకు ఒక సినిమా చెయ్యాల్సి వుంది. అది ఆయనే గుర్తుపెట్టుకొని నీకు ఒక సినిమా బాకీ వున్నాను చేస్తాను అన్నాడు. ప్రస్తుతం వున్న రెండు కమిట్‌మెంట్స్‌ తర్వాత త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ్‌లో చాలా పెద్ద సినిమా చెయ్యబోతున్నాం. 
 
నిర్మాతగా మీకు వున్న లక్ష్యాలు? 
నిర్మాతగా నాకు ఒక గోల్‌ వుంది. స్వర్గీయ రామానాయుడుగారంటే నాకు ప్రాణం. దేవుడు కరుణించి అన్నీ కుదిరితే నాయుడుగారిలా 100 సినిమాలు నిర్మించాలని వుంది. అలాగే పాతాళభైరవి చిత్రాన్ని మళ్ళీ చెయ్యాలని వుంది. రామ్‌గోపాల్‌ వర్మగారు మేం అనుకున్నదానికి ఇన్‌స్పిరేషన్‌. 'అమ్మ' అనే టైటిల్‌ కూడా అనుకున్నాను. కాళీమాత మీద వుంటుంది. ఒక ఎడ్వంచరస్‌ మూవీ. టోటల్‌గా సినిమా చూస్తుంటే మాత్రం పాతాళభైరవి గుర్తొస్తుంది. సోషల్‌లో మిక్స్‌ అయి ఫాంటసీలో జాయిన్‌ అయి సినిమా ఫినిష్‌ అవుతుంది. అది నాకు ఒక డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. అన్నీ కుదిరితే వరుణ్‌ తేజ్‌తో చెయ్యాలని వుంది. 
 
వ్యక్తిగతంగా మీకు వున్న లక్ష్యాలు? 
వచ్చే సంవత్సరానికి పర్సనల్‌గా నాకు వున్న డ్రీమ్‌ ఒక్కటే. సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ తరఫున అన్ని రాష్ట్రాల్లో సినిమా వాళ్ళకి ఓల్డేజ్‌ హోమ్స్‌ నిర్మించాలన్నది నా లక్ష్యం. ప్రతి స్టేట్‌లో మినిమం 10 ఎకరాల్లో ఫైవ్‌స్టార్‌ ఫెసిలిటీస్‌తో ఈ ఓల్డేజ్‌ హోమ్స్‌ని మా జనరేషన్‌లో నేను లీడ్‌ చేస్తూ నిర్మించాలన్నది నా కోరిక. డెఫినెట్‌గా చేస్తానన్న నమ్మకం వుంది. దానికి ఫస్ట్‌ చెన్నైలో జయలలితగారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నాలుగు భాషలకు చెందిన ఐదు రాష్ట్రాల్లో ఈ ఓల్డేజ్‌ హోమ్స్‌ నిర్మించాలనుకుంటున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌.

Share this Story:

Follow Webdunia telugu