మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించిన నటి నిక్కి గల్రాని. నటి సంజన చెల్లెలు. మలయాళంలో పలు చిత్రాలు చేసిన ఆమెకు తొలిసారిగా తెలుగులో దిల్‌రాజు సినిమా 'కృష్ణాష్టమి'లో అవకాశం వచ్చింది. గ్లామర్‌కూ, అందానికి తేడా చెబుతూ... గ్లామర్ అంటే స్కిన్ షో కాదు. చీరకట్టులోనూ గ్లామర్ వుందని చెబుతోంది. వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న చిత్రం ఈ నెల 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ నిక్కీ గల్రానితో చిట్ చాట్.
మిమ్మల్నిచూస్తుంటే.. మీ సోదరే గుర్తుకు వస్తుంది?
అవును. ఇద్దరూ ఒకేలా వుంటామని స్నేహితులు అంటుంటారు.
తను మీకు ఎటువంటి సూచనలు చేస్తుంది?
సినిమా కథలు నేనే వింటాను. నాకు నచ్చిన తరువాత అక్కకు చెబుతాను. పూర్తి క్లారిటీ ఇస్తుంది. అక్కేకాదు. అమ్మలా ట్రీట్ చేస్తుంది. నేను సక్సెస్ అయితే మొదట సంతోషించేది తనే.
ఈ రంగంలోకి స్పూర్తి ఎవరు?
నేను పెద్ద డాక్టర్ కావాలని ఇంట్లోవారి కోరిక. అందుకే సైన్స్ తీసుకున్నాను. కానీ అబ్బలేదు. మధ్యలో వదిలేసి ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేశాను. కాలేజీ వుండగానే కొంతమంది సినిమా ఛాన్స్ ఇస్తామన్నారు. కోర్సు పూర్తయ్యాక మోడలింగ్ చేశాను. 10 నెలల్లో 45 యాడ్స్‌లో నటించాను. 1983 అనే మలయాళం సినిమా ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టాను. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో 15 సినిమాల్లో నటించాను. 'కృష్ణాష్టమి' సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నాను. అసలు ఈ రంగంలోకి రావడానికి అక్కతోపాటు మాధురీ స్పూర్తి.
పెద్ద బేనర్‌లో అవకాశం ఎలా అనిపించింది?
మలయాళ సినిమాలో చేస్తుండగా దిల్ రాజుగారి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. అప్పుడే డేట్స్ కుదరలేదు కానీ రెండుమూడు రోజుల తరువాత దిల్ రాజుగారు మరలా ఫోన్ చేసి ప్రీప్రొడక్షన్ పనులు మొదలుపెట్టిన నెల తరువాత సినిమా చిత్రీకరణ మొదలవుతుందని చెప్పారు. వెంటనే సినిమా ఒప్పుకున్నాను.
ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది?
ఈ సినిమాలో ఓ ఎన్నారై అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. నా క్యారెక్టర్ పేరు పల్లవి. బేసిక్‌గా తను మంచి రైటర్. తను ఎలా వుండాలనుకుంటుందో తన ఆలోచనలు 'పల్లవిజం' అనే ఓ బుక్‌లో రాస్తుంటుంది. అమాయకంగా ఉండే తను 'పల్లవిజం'లో రాసే లాజిక్స్‌కు ఇంటెన్స్ మీనింగ్ ఉంటుంది. బుక్‌ను పబ్లిష్ చేయాలనుకుంటుంది. ఏ సమస్యనైనా పాజిటివ్‌గా తీసుకొని సాల్వ్ చేసుకుంటుంది.
'కృష్ణాష్టమి' పేరు ఎందుకు పెట్టారు?
సినిమాలో హీరో పేరు కృష్ణ వరప్రసాద్. తను పుట్టింది కృష్ణాష్టమి రోజు. కృష్ణాష్టమి రోజునే తన లైఫ్‌లో పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఘటనతో తన జీవితంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. మళ్ళీ అదే సమస్యను 'కృష్ణాష్టమి' రోజే పరిష్కరిస్తాడు. అందుకే సినిమా టైటిల్ 'కృష్ణాష్టమి' అని పెట్టారు.
సునీల్‌తో నటించడం ఎలా వుంది?
తను గొప్ప డాన్సర్. చాలా సరదాగా నవ్విస్తుంటారు. ఇగో లేదు. ఆయన దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను. పనిపట్ల తపన ఉన్న మనిషి. విదేశాల్లో రెండు డిగ్రీల టెంపరేచర్‌లోనూ ఉదయాన్నే నాలుగింటికి లేచి జాగింగ్ చేసేవారు.
ఎలాంటి నటి కావాలనుకున్నారు?
పాటలకు, కొన్ని సీన్లకు మాత్రమే హీరోయిన్‌గా నటించడం నాకు నచ్చదు. నా పాత్రకు వెయిట్ ఉండాలి. పెర్ఫార్మన్స్‌కు అవకాశముండాలి. గ్లామర్ డాల్‌లా ఉండటం నాకు నచ్చదు. అందుకే నా పాత్రలో ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. నేను చేసే క్యారెక్టర్స్‌లో స్టఫ్ వుండేలా చూసుకుంటాను. నేను నటించే సినిమాలు కుటుంబమంతా కలిసి చూడాలి. అలా ఉండే పాత్రలే ఎన్నుకుంటాను.
దర్శకుడు వాసు ఎలా చేయించారు?
మూడు భాషల్లో దర్శకులను పరిశీలించాను. తనలో క్లారిటీ వుంది. ఎలాంటి పరిస్థితినైనా చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తారు.
ఇక్కడ చిత్రాల్లో ఎటువంటి తేడా గ్రహించారు?
ఇక్కడ నాచురాలిటీ కంటే కమర్షియాలీటీకి పెద్ద పీట వేస్తారు. హీరోయిజం చూపించే కథలే వుంటాయి. మలయాళం సినిమాలు జీవితానికి దగ్గరగా ఉంటాయి. తమిళంలో రియాల్టీకి దగ్గరగా ఉంటూ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు.
ఎక్స్‌పోజ్‌పై మీ అభిప్రాయం?
ఎక్స్‌పోజ్ అందరికీ వర్తించదు. నా దృష్టిలో గ్లామర్ అంటే స్కిన్ షో కాదు. అమ్మాయిని చీరలో కూడా గ్లామర్‌గా చూపించొచ్చు. ఈ సినిమాలో నేను స్కర్ట్స్, జీన్స్ వేసుకున్నాను. క్యూట్‌గా కనిపిస్తాను కాని ఎక్కడా వల్గారిటీ ఉండదు.
కొత్త చిత్రాలు?
తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తున్నాను. అందులో రాఘవ లారెన్స్‌తో.. పటాస్.. రీమేక్‌లో చేస్తున్నా. రెండోది 'రంగం' సీక్వెల్ 'కో-2'. తెలుగులో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. 'కృష్ణాష్టమి' రిలీజ్ అయిన తరువాత ఫైనల్ చేస్తాను అని చెప్పారు.