తేజ దర్శకత్వంలో 'జయం' సినిమాతో సినిమా కెరీర్‌ను ప్రారంభించిన నటుడు నితిన్. ఆంధ్ర, తెలంగాణ రెండు వేర్వేరు అయినా తెలంగాణ నటుడిగా ముద్ర వేయించుకోవడానికి ఇష్టపడడు. తాను నటుడినేనని చెబుతాడు. ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డి నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్. ఆమె సోదరి నిర్మాత. లేటెస్ట్‌గా ఆమె నిర్మించిన చిత్రం 'చిన్నదాన నీకోసం'. ఈ చిత్రం క్రిస్ట్‌మస్ సందర్భంగా ఈ నెల 25న విడుదలవుతుంది. ఈ సందర్భంగా నిఖితా రెడ్డితో చిట్‌చాట్.
సినిమా కథేమిటి?
చిన్నదాని ప్రేమకోసం పడే పాట్లే కథ. ఇది పూర్తిగా లవ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. నితిన్ సరిపడే కథ. అన్ని వర్గాలవారికి నచ్చేట్లుగా వుంటుంది.
కరుణాకరన్‌ను ఎంపిక చేసుకోవడానికి కారణం?
పవన్‌కళ్యాన్‌తో తొలిప్రేమ తీశాడని కాదు. చాలా మంది అదే అనుకుంటున్నారు. నితిన్ .. పవన్ ఫ్యాన్ కాబట్టి. ఆయన సినిమాకు దర్శకత్వం వహించిన కరుణాకరన్‌తో ఎప్పటినుంచో చేయాలనుంది. కానీ ప్రతిసారీ వాయిదా పడుతూ వచ్చింది.
సోదరికిగా నితిన్‌కు మీరిచ్చే సలహాలు ఏమైనా వుంటాయా?
సినిమారంగం నాకు కొత్త. గతంలో పలు ఈవెంట్స్ నిర్వహించే పనిలో వుండేదాన్ని. ఆ తర్వాత తండ్రి గారు ఒక్కరే సినిమా బాధ్యతలు చూసుకోవడం కష్టమైనందువల్ల గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంతో నేను నిర్మాతగా మారి .. ప్రొడక్షన్ చూసుకుంటున్నాను. నితిన్ హీరోగా చాలా సినిమాలు చేశాడు. అందరి సలహాలు తీసుకుంటాడు.
ముఖ్యంగా కథల ఎంపిక ఎవరిది?
కథలు నాన్నగారు వింటారు. నేను వింటాను. గతంలో కథల గురించి నేను పట్టించుకునేదాన్నికాదు. ఇప్పుడు మాత్రం నన్నుకూడా వినమని తమ్ముడు చెబుతుంటాడు. ఫైనల్‌గా అందరి సపోర్ట్ వుంటుంది.
నితిన్ గత కెరీర్‌లో చాలా ఫెయిల్యూర్స్ వున్నాయి. దీన్ని ఎలా విశ్లేషిస్తారు?
ప్రతి వ్యక్తికీ పగలు రాత్రి వున్నట్లే... చీకటి వెలుగులు మామూలే. అప్పట్లో సరైన నిర్ణయాలు తీసుకోలేదని అనిపించింది.
చిత్రం ఏ స్టేజ్‌లో వుంది.
చిత్రం పూర్తయింది. అనుకున్నదానికంటే బాగా వచ్చింది. దర్శకుడు కరుణాకరన్ విజన్‌కు తగినట్లుగా వుంటుంది. అన్ని అంశాలున్న కుటుంబకథా చిత్రమిది. పోస్ట్‌ప్రొడక్షన్‌కూడా పూర్తయ్యాయి. త్వరలో సెన్సార్‌కు వెళుతుంది.
నితిన్‌తో యాక్షన్ చేసే ఆలోచన వుందా?
ఒకప్పుడు యాక్షన్ సినిమాలు చూసేవారు ప్రేక్షకులు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అన్ని సున్నితంగా స్పృశించే అంశాలనే ఇష్టపడుతున్నారు. ఈ చిత్ర కథకు తగినట్లుగా అన్నీ వుంటాయి. పూర్తిస్థాయి యాక్షన్ సినిమా భవిష్యత్‌లో చేస్తాడని అనుకుంటున్నాను.
ఇప్పుడు నితిన్ మార్కెట్‌ను ఆలోచించి సినిమా చేస్తున్నారా?
నితిన్‌కు ఒకప్పుడు పెద్దగా మార్కెట్ లేకపోయినా.. ఇష్క్ చిత్రం నుంచి అది పెరుగుతూ వచ్చింది. గుండెజారి.. చిత్రంతో మరింత పెరిగింది. అన్ని దృష్టిలో వుంచుకునే చిత్ర షూటింగ్‌ను కూడా యూరప్‌లో 40 రోజులు చిత్రించాం. అందుకు తగినట్లేగా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.
మీరు వచ్చాక లక్కీహాండ్ అనే టాక్ వుంది?
అదేం లేదు. నేను రాకముందే ఇష్క్ సక్సెస్ చేశాడు. ఆ తర్వాత నేను ఎంటర్ అయ్యాను. అందరూ కలిస్తేనే విజయం వస్తుంది.
బయట చిత్రాలు నితిన్ చేయడా?
చేస్తాడు. కథలు నచ్చాలి. తప్పకుండా త్వరలో చేస్తాడు.
ఈ సినిమాలో కూడా పవన్ గురించి ప్రస్తావించారా?
సినిమా చూసి మీరే చెప్పాలి. ఏమి వుందో ముందుగానే చెబితే రుచి తెలియదు.
నితిన్‌కు పెండ్లి ఎప్పుడు చేస్తున్నారు?
ప్రస్తుతం ఆ మూడ్‌లో లేడు. ఇప్పుడంతా కెరీర్ గురించే ఆలోచన.
కొరియర్ బాయ్ ఎంతవరకు వచ్చింది?
'కొరియర్‌బాయ్' చిత్రం తెలుగు షూటింగ్ పూర్తయింది., తమిళ వెర్షన్ ఇంకా వర్క్ వుండడంతో ఆలస్యమవుతుంది. దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా వేరే సినిమాలో బిజీగావున్నాడు. త్వరలో అదికూడా పూర్తవుతుంది. అని చెప్పారు.