'కళ్యాణ వైభోగమే'లో విలన్‌గా, హీరోగా చేస్తున్నా: నాగశౌర్య ఇంటర్వ్యూ
'క్రికెట్ గాళ్స్ అండ్ బీర్'లో నలుగురిలో ఒకడిగా..'చందమామ కథలు'లో ఉద్యోగిగా నటించిన నాగశౌర్య క్రమేణా.. 'ఊహలు గుసగుసలాడే'తో కథానాయకుడిగా ఎదిగిపోయాడు.
'క్రికెట్ గాళ్స్ అండ్ బీర్'లో నలుగురిలో ఒకడిగా..'చందమామ కథలు'లో ఉద్యోగిగా నటించిన నాగశౌర్య క్రమేణా.. 'ఊహలు గుసగుసలాడే'తో కథానాయకుడిగా ఎదిగిపోయాడు. దిక్కులు చూడకు రామయ్యా.. లక్ష్మీరావే మా ఇంటికి.. వంటి చిత్రాలు తీసి ఏవరేజ్‌లో వున్నాడు. జాదుగాడు.. వంటి చిత్రంతో డిజాస్టర్ హీరోగా నిలిచాడు.. అయినా.. తనలోని హీరోయిజాన్ని.. మరోసారి నిరూపించుకునేందుకు 'కళ్యాణ వైభోగమే' పేరుతో ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ.
చిన్నపాత్రలు వేసి హీరోగా ఎదిగారే.. బ్యాక్‌గ్రౌండ్ వుందా?
సినిమాలపై తపనతో ఈ రంగంలోకి వచ్చాను. స్నేహితులు బంధువులు నన్ను హీరోగా బాగుంటావని.. ఎంకరేజ్ చేసేవారు. అయినా.. ఒకేసారి హీరోగా అవకాశం రాలేదు. క్రికెట్ గాళ్స్.. చిత్రంలో నలుగురిలో ఒకడిగా చేశాను.. ఆ తర్వాత హీరోగా 'ఊహలు గుస..'చేశాను. ఆ తర్వాత పలు చిత్రాలు చేశాను.. ఇప్పుడు నందినిరెడ్డి దర్శకత్వంలో.. కళ్యాణవైభోగమే' చేస్తున్నాను.
ఇందులో పాత్ర ఎలా వుంటుంది?
శౌర్య అనే పాత్ర చేస్తున్నాను. నాకు వ్యక్తిగతంగా దగ్గరగా వుండే పాత్ర. ఇప్పటి యువతలో వుండే ఆలోచనలే ఈ పాత్రలో వుంటాయి. పెండ్లంటే వాయిదా వేయడం.. జీవితంలో స్థిరపడాలని కోరుకునే వారు ఇందులో కన్పిస్తారు.
అసలు కథేమిటి?
పెళ్ళంటే ఇష్టంలేని ఓ కుర్రాడు. తల్లిదండ్రుల ఒత్తిడితో పెండ్లి చేసుకున్నాక.. ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతల రుచి తెలుసుకున్నాక.. తను ఎంత కోల్పోయాడో తెలుసుకున్న విధానమే ఈ చిత్ర కథ.
'అలా మొదలైంది' తర్వాత దర్శకురాలికి పెద్దగా సక్సెస్‌లేదే. ఆమెతో చేయడం ఎలా అంగీకరించారు?
అలా మొదలైంది.. ఆమెలోని టాలెంట్‌కు నిదర్శనం. తర్వాత జబర్‌దస్త్ చిత్రం చేసినా ఫెయిల్ అయింది. కానీ ఆమె ప్రతిభ ఎక్కడికిపోలేదు. నాక్కూడా ఇంతకుముందు రెండు, మూడు చిత్రాలు ఫెయిలయ్యాయి. అయినా ఆమె నన్ను నమ్మి కథ విన్పించారు. 45 నిముషాలు విన్నాను. కానీ ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. మూడు నెలల తర్వాత ఆమె మరలా ఫోన్ చేసి.. దామోదరప్రసాద్‌గారు నిర్మాత అని చెప్పారు. పెద్ద బేనర్.. పెద్ద నిర్మాత చేస్తే.. మనకూ లాభమని. వెంటనే అంగీకరించాను.
ఈ కథకు సంగీతం ఎంత హెల్ప్‌అవుతుంది?
'ఊహలు గుసగుసలాడే' సినిమాకు కళ్యాణ్ కోడూరి మంచి సంగీతం అందించారు. ఈ చిత్రానికి అంతకంటే ఎక్కువగానే చేశారు. ముఖ్యంగా పెళ్లి పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. చక్కటి సాంప్రదాయంతో కూడిన ట్యూన్స్.. సాహిత్యం ఇందులో వున్నాయి.
లవర్‌బాయ్‌లా కన్పించే మీకు 'జాదూగాడు' అవసరమా?
కరెక్టే.. మాస్ ప్రేక్షకుల్ని కూడా దగ్గరవ్వాలని చేసిన ప్రయత్నమిది. కానీ వారు దాన్ని రిసీవ్ చేసుకోలేదు. ఒక్కోసారి మన నిర్ణయాలు తర్వాత ఫలితాలు ఇస్తాయి. ఇకపై జాగ్రత్తగా కథలు ఎంపిక చేసుకుంటాను.
హీరోయిన్ పెర్‌ఫార్మెన్స్ ఎలా చేసింది?
మాళవిక నాయర్.. సెట్‌లో చాలా కూల్‌గా వుంటుంది. నేనే గోలగోల చేస్తాను. తను మంచి నటి. మామూలుగా.. సినిమా ప్రమోషన్‌కు రావాల్సి వుంది. కానీ ఆమె డిగ్రీ పరీక్షలు దగ్గర పడటంతో.. రాలేనని ముందుగానే చెప్పింది.
పోటీ యుగంలో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
భిన్నమైన పాత్రలు చేయాలని అనుకున్నాను. అందుకు అనుగుణంగానే.. నేనే విలన్, హీరోగా రెండు పాత్రలు వున్న ఓ క్యారెక్టర్ చేస్తున్నా. సుకుమార్ బేనర్‌లో వుంటుంది. అదికాకుండా.. ప్రత్యేకమైన లాయర్‌గా వుండే కథతో ఓ సినిమా చేయబోతున్నాను. ఇవికాకుండా.. ప్రస్తుతం రామరాజు దర్శకత్వంలో 'ఒక మనసులో' నటిస్తున్నాను. షూటింగ్ పూర్తయింది. తదుపరి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న 'జో అచ్యుతానంద'లో నటిస్తున్నాను అని చెప్పారు.