Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు హీరోగా చేయాలనే ఆలోచన లేదు...: థమన్‌ ఇంటర్వ్యూ

Advertiesment
music director thaman interview
, శనివారం, 16 ఏప్రియల్ 2016 (22:25 IST)
'బాయ్స్‌' సినిమాలో నటించి ఆ తరువాత కొన్ని చిత్రాలకు కీ బోర్డు ప్రోగ్రామింగ్‌ చేసి 'కిక్‌' సినిమాతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తెలుగు తెరకు పరిచయమయిన సంగీత దర్శకుడు ఎస్‌.థమన్‌. మాస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన ఎన్నో హిట్‌ చిత్రాలకు పని చేశాడు. ప్రస్తుతం తను మ్యూజిక్‌ అందించిన 'సరైనోడు' సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలయిన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సందర్భంగా యస్‌. యస్‌. థమన్‌తో ఇంటర్వ్యూ విశేషాలు.
 
అల్లు అర్జున్‌ సినిమాకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? 
'రేసు గుర్రం' తరువాత నేను అల్లు అర్జున్‌తో చేస్తున్న సినిమా కాబట్టి సహజంగానే నాపైన ఒత్తిడి ఉంటుంది. అయితే మాస్‌ ప్రేక్షకులకు 'సరైనోడు' పాటలు బాగా నచ్చాయి. ఈ పాటలు సినిమా మరింత విజయం సాధించాడానికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను.
 
బన్నీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఎంతవరకు వుంది?
తనతో పని చేస్తుంటే తెలియని కాన్ఫిడెన్స్‌ వస్తుంది. స్టోరీకు తగ్గట్లుగా పాట సిట్యుయేషన్‌ కరెక్ట్‌ గా చూసుకుంటాడు. కొరియోగ్రఫీ, లిరిక్స్‌, లొకేషన్స్‌ విూద శ్రద్ధ తీసుకుంటాడు. ఒక హీరోకి అభిమాని అయితే సక్సెస్‌ ఫుల్‌ ట్యూన్స్‌ ఇవ్వగలం. బన్నీకి మంచి కమాండింగ్‌ ఉంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచిపైన మంచి అవగాహన ఉంది. మాస్‌, క్లాస్‌కు నచ్చేవిధంగా మంచి పాటలు కావాలని కోరారు. ఓ పాటకు దగ్గరుండి బాణీలు ఎంపిక చేశారు.
 
'తెలుసా తెలుసా' బాగా ఆకట్టుకుంది. ఆ పాట గురించి చెప్పండి?
రొమాంటిక్‌ పాటలకు సంగీతం అందించడం అంటే ఇష్టం. అలాంటి సన్నివేశం ఎప్పుడు కుదిరినా నేను తప్పనిసరిగా మంచి ట్యూన్‌ ఇస్తాను. 'తెలుసా తెలుసా' పాట ఒక్క సిటింగ్‌లోనే ఎంపికయింది. ఈ పాట అంత పెద్ద హిట్‌ కావడానికి కారణం... బాలీవుడ్‌కు చెందిన జూబిన్‌, సవిూరా భరధ్వాజ్‌ అద్భుతంగా పాడారు.
 
ఈ చిత్రానికి ఎటువంటి పరికరాలు తెప్పించారు?
లుథియానా నుండి ప్రత్యేకంగా చేసిన డ్రమ్స్‌, అలానే 'బ్లాకు బాస్టర్‌' పాట కోసం ఆంధ్రలో ఉండే రూరల్‌ ప్రాంతాల నుండి స్పెషల్‌ డ్రమ్స్‌ తెప్పించాం.
 
మీ దగ్గర రెడీమేడ్‌ ట్యూన్స్‌ వుంటాయా?
నా దగ్గర రెడీమేడ్‌ ట్యూన్స్‌ ఉంటాయని అనుకుంటారు. కానీ నా రెడీమేడ్‌ ట్యూన్స్‌ ఒకరు వద్దన్నవే.  ఒక సినిమా కోసం చేసిన ట్యూన్స్‌ డైరెక్టర్‌కు నచ్చకపోతే పక్కన పెట్టేస్తాం. అవే ట్యూన్స్‌ వేరే డైరెక్టర్‌కు నచ్చుతాయి. అయితే నేను మోసంచేసి ఆ ట్యూన్స్‌ వినిపించను. నా అధ్రుష్టమేమిటంటే నేను ట్యూన్స్‌ అందించిన దర్శకుడే వేరే డైరెక్టర్‌కు థమన్‌ చేసిన ట్యూన్స్‌ నాకు సెట్‌ కాలేదు కాని ఒకసారి విూరు వినండని చెప్పేవారు. సో.. ట్యూన్స్‌ విన్నప్పుడు ఆ డైరెక్టర్‌ కు తెలిసే వినేవారు.
 
దర్శకుడు బోయపాటి శీనుతో పని చేయడం ఎలా ఉంది?
బోయపాటి గారి 'భద్ర' సినిమాకు దేవి మ్యూజిక్‌ చేశారు. ఆ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ దగ్గర కీ బోర్డు ప్రోగ్రామింగ్‌ చేశాను. సుమారుగా దేవికు ఇరవై సినిమాలకు కీ బోర్డు ప్లేయర్‌గా చేశాను. అయితే 'సరైనోడు' సినిమా బోయపాటి గారి డైరెక్షన్‌లో మ్యూజిక్‌ చేయాలంటే మొదట భయపడ్డాను. అయితే మేం చాలా సార్లు చెన్నైలో కలుసుకుని మ్యూజిక్‌ గురించి చర్చించుకోవడంతో ఒక అవగాహనకి వచ్చాం. ఆ అవగాహనతోనే అద్భుతమైన పాటలు ఇచ్చాను.
 
గాయకులను ఎలా ఎంపిక చేసుకుంటారు?
ప్రతీసారి మారుతుంటుంది. ఎలాగంటే.. నాకు విశాల్‌ డాడ్లానితో పనిచేయాలని ఉండేది. ఈ సినిమాలో అతను పాడిన 'అతిలోక సుందరి' పాట వింటే అతనంటే ఏంటో తెలుస్తుంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే అతను కేవలం అరగంట వ్యవధిలో ఈ పాట పాడాడు.
 
తెలుగు చిత్రపరిశ్రమలో పోటీని ఎలా తీసుకుంటారు?
ఏ సంగీత దర్శకుడి పాటలు హిట్‌ అయినా నాకు చాలా భయం వేస్తుంది. అందులోనూ ఐటమ్‌ సాంగ్స్‌ హిట్‌ అయితే ఇంకా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే.. ఒక సంగీత దర్శకుడు ఓ మంచి పాట ఇచ్చాడంటే.. నేను తప్పనిసరిగా అంతకంటే మంచి పాట ఇవ్వాల్సిఉంటుంది కాబట్టి నాపై ఒత్తిడి ఉంటుంది. అయినా ఈ పోటీ ఇష్టమే. ఎందుకంటే దీనివల్ల మరింత బాణీలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది.
 
మిమ్మిల్ని విమర్శించేవారికి విూరిచ్చే సమాధానం ఏమిటి?
నిజం చెప్పాలంటే ట్యూన్‌ కానీ, పాటలు కానీ నేనొక్కడినే నిర్ణయించను. ఎంతో మందికి దీనిలో భాగస్వామ్యం ఉంటుంది. ఒక పాట సరిగా లేదంటే అందుకు భాగస్వామ్యం వహించిన వారు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. 
 
మళ్ళీ ఎప్పుడు తెరపై కనిపిస్తారు?
'బాయ్స్‌' సినిమాకు సీక్వెల్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో ఈ సినిమా మొదలవుతుంది. ఇందులో నటించడంతో పాటు సంగీతం కూడా సమకూర్చుతున్నాను.
 
అప్పటి బాయ్స్‌‌కు ఇప్పటికి తేడా వుందికదా?
అప్పటి బాయ్స్‌.. ఇప్పటి బాయ్స్‌గా నటిస్తున్నారు. అది ఏమిటి? అనేది తెరమీద చూడాల్సిందే. అందరికీ కనెక్ట్‌ అవుతుంది.
 
తోటి సంగీత దర్శకుడుల హీరోలవుతున్నారు. మరి మీరు?
నాకు హీరో అయ్యే ఆలోచన లేదు. అయితే వారికంటే నేనే సీనియర్‌ను.. బాయ్స్‌ చేసేటప్పుడు ఏ సంగీత దర్శకుడు నటుడు కాలేదు. వారికంటే ముందే నేను తెరపైన కన్పించాను.
 
బాలీవుడ్‌కు వెళ్ళే ఆలోచన వున్నదా?
ఆలోచన ఉంది. బాలీవుడ్‌లో ఓ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.
 
రీమిక్స్‌కి దూరంగా ఉంటున్నారు. ఎందుకు?
ఒరిజనల్‌ పాటను చెడగొట్టడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే పాతపాటలో ఉన్న మ్యాజిక్‌ని మళ్ళీ సృష్టించడం సాధ్యం కాదు. అందుకే రీమిక్స్‌కి దూరంగా ఉంటాను.
 
కొత్త సినిమాల గురించి..?
ప్రస్తుతం గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్‌తో చేస్తున్న సినిమాకి పనిచేస్తున్నాను.

Share this Story:

Follow Webdunia telugu