మోహన్ బాబు కుమార్తెగా, నటిగా పరిచయమై ఇప్పుడు నిర్మాతగా ఎదిగిన మంచు లక్ష్మీ... 'దొంగాట' అనే చిత్రాన్ని నిర్మించారు. అంతేకాదు... అందులో పాట పాడింది.. 'ఏందిరా..మీ మగాళ్ళ గొప్ప..' అంటూ ప్రశ్నిస్తుంది. దానికితోడు ఈ చిత్రంలో 9మంది హీరోల కలయికతో ఓ పాట కూడా పెట్టింది. ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ...
'దొంగాట' అంటే ఏమిటి? ఎలా వుండబోతుంది?
సరదాగా ఆడుకునే ఆటల్లో దొంగాట కూడా వుంటుంది. అందుకే సరదాగా సినిమా తీయాలని పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో చేసింది.ఇంతకుముందు మా బేనర్‌లో గుండెల్లో గోదారి, ఊ కొడతారా ఉలిక్కిపడతారా వంటి సీరియస్ సినిమాలు చేశాం. ఫస్ట్ టైమ్ ఒక కామెడీ సినిమా చేస్తున్నాం. క్రైమ్, కామెడీ జోనర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కథగా చెప్పాలంటే... సినిమాలో ఓ హీరోయిన్‌ను కిడ్నాప్ చేస్తారు. అసలు ఆ కిడ్నాప్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు అనే విషయాలు తెరపైనే చూడాలి.
నిర్మాతగా బడ్జెట్ కంట్రోల్ చేశారా?
అనుకున్న బడ్జెట్‌లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసాం. ఒక్కోసారి ఎక్కువతక్కువలు జరుగుతుంటాయి. కానీ ఈ చిత్రానికి అది జరుగలేదు.
చిత్రంలో ప్రత్యేకతలు ఏమిటి?
తొమ్మిది మంది హీరోలతో చేసిన పాట ప్రత్యేకంగా వుంటుంది. సినిమాలో సెకండ్ హాఫ్‌లో నా పుట్టినరోజు సందర్భంగా వస్తుంది.
9మందిని ఎలా ఒప్పించారు?
ముందు కొంచెం ఎక్కువమందిని నటించమని అడిగాను కానీ కుదరక కొంతమందిని రిజక్ట్ చేయాల్సి వచ్చింది. అడిగిన వాళ్ళందరు వచ్చేసరికి సినిమాకి లైఫ్ వచ్చిందనిపించింది. నా మీద నమ్మకంతో అందరు సాంగ్ చేయడానికి వచ్చారు. నాగార్జున, రవితేజ, మంచు మనోజ్, రానా, శింబు, నాని, నవదీప్, సుశాంత్, సుధీర్‌బాబు, తాప్సీ మేం అడగ్గానే స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
మీరు పాడిన పాటకు ఎలాంటి స్పందన వచ్చింది?
అసలు పాడాలని అనుకోలేదు. 'ఏందిరా..' అని పాటకు ట్యూన్ ఇస్తుంటే కాజువల్‌గా హమ్ చేస్తున్నాను.. దాన్ని సంగీత దర్శకుడు రఘు కుంచె మీరే పాడితే బాగుంటుంది. వాయిస్ బాగుంది అన్నారు. పాడాక ఇంత రెస్పాన్స్ వస్తుందనుకోలేదు. ఫన్నీగా ఎంజాయ్ చేసే విధంగా ఉంది కాబట్టే అందరికీ నచ్చింది.
ఈ చిత్రానికి రామ్‌గోపాల్‌వర్మ రిజెక్ట్ చేయడానికి కారణం?
ముందుగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయమని రామ్‌గోపాల్ వర్మను అడిగాను. ఆయన కథ విని బావుంది కానీ దర్శకత్వం చేయనన్నారు. కారణం.. ఇది నా జోనర్ కాదు నేను చేయను అని చెప్పేశారు. అప్పుడు మావద్ద పనిచేస్తున్న వంశీకి బాధ్యతలు అప్పగించాను. దీనికోసం చాలా హార్డ్‌వర్క్ చేస్తాడు. సెట్‌లో చాలా సీరియస్‌గా ఉంటాడు. ఆయన డైరెక్ట్ చేయగలడని తెలుసు కానీ మరి ఇంత బాగా చేయగలడు అనుకోలేదు.
ఎన్ని థియేటర్లలో వస్తుంది?
నైజాంలో 140 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మిగిలిన ఏరియాల్లో ఎన్ని థియేటర్లో ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
తదుపరి చిత్రాలు?
తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన 'సైన్మా' అనే షార్ట్ ఫిలిం చూసాను. నాకు చాలా నచ్చింది. ఆయనతో ఒక చిత్రాన్ని చేసే ప్లాన్‌లో ఉన్నాను. జూన్ నెల నుండి ఆ చిత్రం షూటింగ్ మొదలుకానుంది.
నిర్మాతగానే ఉంటారా? దర్శకత్వం చేస్తారా?
దర్శకత్వం చేయాలంటే చాలా తెలివితేటలు కావాలి. అవి నావద్ద లేవు అని ముగించారు.