కృష్ణంరాజు అంటే ఇప్పటితరానికి పెద్దగా తెలీకపోయినా.. ప్రభాస్ పెద్దనాన్న అంటే చాలు.. ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు. ఢిల్లీలో కూడా పిల్లలు ఆయన కనబడితే అలానే పిలుస్తారట. ఇక అమెరికాలో సరేసరే... అక్కడ ఏదో పనిమీద వెళితే.. ప్రత్యేక సౌకర్యాలు కూడా చేశారట.. ఈ విషయాలను కృష్ణంరాజు పంచుకున్నారు. ఈ నెల 20న అంటే బుధవారమే ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ..
ఈ పుట్టినరోజును ఎలా జరుపుకుంటున్నారు?
సాదాసీదాగా చేయాలని అభిమానులకు చెప్పాను. కానీ జూన్ 10న గ్రాండ్‌గా చేయాలని వారు కోరుతున్నారు.
అంటే.. అప్పటికి మీ కెరీర్‌లో ప్రత్యేకమైన రోజా?
అవును. నేను నటుడిగా ప్రారంభించింది జూన్ 10న.. తొలి సినిమా 'చిలుక గోరింక'. అది 1966 జూన్ 10న విడుదలైంది. 50 ఏళ్ళు పూర్తవుతాయి. అసలు మేకప్ వేసుకుంది ఫిబ్రవరిలో. కానీ సినిమా విడుదలనే కౌంట్ చేస్తారు కాబట్టి జూన్‌కు వస్తుంది.
ఇన్నేళ్ల కెరీర్ ఏమనిపించింది?
ఇన్నేళ్ళ కెరీర్ నాకు చాలా సంతృప్తినిచ్చింది. సినీ కుటుంబంలో అందరి ఆప్యాయతలను రుచి చూపించింది. బాయ్స్ నుండి సహనటీనటులు, టెక్నీషియన్లు ఎంతోమంది సహకరించారు. చిన్నచిన్న మనస్పర్థలు వచ్చినా అవన్నీ తాత్కాలికమే. అవన్నీ నెమరేసుకోవడానికి అవకాశం కల్పించింది.
ఇంకా సాధించాల్సింది ఏదైనా వుందా?
అది అపరిమితం. ఒక్క జీవితం సరిపోదు. నటుడికి ఎంత చేసినా ఇంకా చేయాలనే తపన వుంటుంది. కాకపోతే చేసే పాత్ర బాగా చేశామా! లేదా! అనే తృప్తి వుంటే చాలు. అది నాకు వుంది.
దర్శకత్వం ఎంతవరకు వచ్చింది?
సమాజాన్ని ఆలోచించేలా చేయాలని చాలా చక్కటి పాయింట్‌తో ముందుకు రావాలనుంది. అదెలాగంటే.. నాలుగ్గోడ్డల మధ్య కూర్చొని నేర్చుకునే విద్య విద్యకాదు. కొన్ని చదువులు ల్యాబరేటరీలకే పరిమితం. అలా కాకుండా... విద్యార్థి బయట ప్రపంచంలోకి రావాలి. అక్కడ తనకు ఏది ఇంట్రెస్టో దానిపై శ్రద్ధ పెట్టాలి. వ్యవసాయం కోర్సు నేర్చుకుంటే.. పొలం పనులు పాలుపంచుకోవాలి. కష్టనష్టాలు తెలుసుకోవాలి. ఇలా పలు పాయింట్లను తీసుకుని ప్రజల్తో మమేకమయితే వారికి ప్రాక్టికల్ అభ్యాసం వస్తే జీవితంలో ఉన్నత స్థితికి ఎదగలుగుతాడు. ఈ ప్రయోగం ఎలక్షన్ల ముందు అనుకున్నాం. అప్పుడు వద్దన్నారు. ఇప్పుడు అవేమీ లేవు గనుక.. కార్యరూపం దాల్చాలనిపించింది. ఈ కథకు 'ఒక్క అడుగు' ముందుకు వేయండి.. అనే టైటిల్‌ను రిజిష్టర్ కూడా చేశాం. ఇలాంటి కాన్సెప్ట్ వల్ల విద్యార్థికీ, రాష్ట్రానికి దేశానికి మేలు జరుగుతుంది. అనేది చెప్పదలిచాం.
ప్రభాస్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు గతంలో చెప్పారు?
అవును. చక్కటి ప్రేమకథను ప్లాన్ చేస్తున్నాం.
'బాహుబలి' తర్వాత అటువంటి కథను రిసీవ్ చేసుకుంటారా?
'బిల్లా' తీస్తున్నప్పుడు చాలామంది ప్రభాస్ పర్సనాలిటికీ జేమ్స్‌బాండ్ సినిమా తీయాలన్నారు. అప్పటికి బిల్లా కరెక్ట్.. ఒక్కో టైంకు ఒక్కోటి కరెక్ట్. నన్ను మొదట్లో రెబల్‌స్టార్ అన్నారు. ఇలాగే ముద్రపడి పోతే కష్టమని భయపడ్డా. అమరదీపం.. ఒక్క ఫైట్ లేకుండా తీశాను. మనఊరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మన్న వంటి పలు చిత్రాలు చేసి కొత్త ఇమేజ్ తెచ్చుకున్నాను.
'బాహుబలి' ఇమేజ్ మీకెంత వరకు వుపయోగపడింది?
ఢిల్లీలో నేను వెళుతుంటే.. పిల్లలు కూడా.. బాహుబలి పెద్దనాన్న అంటున్నారు. అంతలా సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది. అమెరికాలో కూడా.. స్కూల్లో మావాడి పిల్లలు చదవడానికి వెళితే రిఫరెన్స్ కావాలి.. ఇండియా నుంచి వచ్చాం అన్నారు. బాహుబలి చూశారా? అని అడిగారు.. ఆయన మా బ్రదరే అని చెప్పగానే.. అక్కడ రిసీవింగ్ మామూలుగా లేదు. అంతలా ప్రపంచవ్యాప్తంగా ఆ చిత్రం పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆ చిత్రాన్ని చైనాలో 5 వేల థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
మీరు అందులో నటిస్తారా?
ఆ చిత్రం తర్వాత మా గోపీకృష్ణ బేనర్‌లో సినిమా కావచ్చు. లేదంటే యువీ క్రియేషన్స్ కూడా వుండొచ్చు.. అందులో నేను నటిస్తానా లేదా అనేది పాత్రను బట్టి వుంటుంది.
ప్రభాస్‌కు పెండ్లెప్పుడు చేస్తున్నారు?
అంతకుముందు అడిగితే.. బాహుబలి అవ్వాలన్నాడు. అయింది. ఇప్పుడు పార్ట్-2 అంటున్నాడు. అందుకే మొన్న సంక్రాంతికి ఈ ఏడాది చేసుకోవాలన్నాను. చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. పెండ్లి కార్యక్రమాలు మొదలు పెట్టాలి.
లవ్ మ్యారేజా? పెద్దల నిర్ణయించిందా?
ఏదైనా అవ్వొచ్చు. ఎదుకంటే ఫైనల్‌గా తనకు నచ్చాలి. చేసేది నేనే అయినా.. చేసుకునేవాది వాడు. జీవితాంతం కలిసి వుండాల్సిన అమ్మాయి వాడికి నచ్చాలి. పూర్వం రోజుల్లోలా ఫోర్స్ చేసి పెండ్లి చేయను. ఆమధ్య అమ్మాయి దొరికిందని.. కొన్ని వార్తలు వ్యాపించాయి.. అవన్నీ అబద్దాలే.
మీ బేనర్‌లో లేడీ ఓరియెంటెంట్ చిత్రాలు వచ్చాయి. మరలా అలాంటి ప్రయత్నం చేస్తారా?
అవి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కావు. కథాబలం వున్న చిత్రాలు. అప్పట్లో.. ఆడదంటే అలుసా? అన్నట్లుగా వుండేవి. చిన్న పొరపాటు జరిగితే జీవితాన్ని నాశనం చేసుకునే రోజులు. తండ్రులు కూడా మా అబ్బాయి ఎంతోమంది అమ్మాయిల్ని చూశాడనే చెప్పుకునే దౌర్భాగ్యపు రోజులు. అలాంటి టైంలో 'కృష్ణవేణి' అనే సినిమా తీశాను. ఆ సినిమాను ఎన్‌టిఆర్‌కు ప్రివ్యూ చూపించాను. 'పేదలపాట్లు' వంటి చిత్రాలు చేసిన ఆయనకు ఇలాంటి ఆలోచన నచ్చుతుందో లేదో అనుకున్నా. సినిమా చూశాక.. ఇంత మంచికథ తీశావ్ అని మెచ్చుకున్నారు. అప్పటినుంచి ఆయనంటే గౌరవం ఏర్పడింది. అందుకే వందరోజుల ఫంక్షన్‌ను ఆయనచేత చేయించాను.
గణపతిదేవుడు తర్వాత మరేమైనా చిత్రాలు చేస్తున్నారా?
ఆ పాత్ర సహజంగా వుండే పాత్ర. అలాంటివి వస్తే తప్పకుండా చేస్తాను. 'ఎవడే సుబ్రహ్మణ్యం'లో కూడా కొత్త తరహా పాత్ర వుంది. అలాంటివి.. మనస్సుకు నచ్చేవి వస్తే అంగీకరిస్తాను. ఆ మధ్య బడా వ్యాపారవేత్త పాత్ర వచ్చింది. తణుకుకు చెందిన ముళ్ళపూడి హరిశ్చందప్రసాద్ అనే పెద్ద వ్యాపారవేత్త. ఆయన పెద్ద కంపెనీలకు సిఇఓ. అయినా పంచెకట్టుతో విదేశాల్లో తిరిగారు. అంతర్జాతీయ బిజనెస్ మీట్‌లో ఆయన అలాగే వెళ్ళేవారు. ఆయన సబ్జెక్ట్ చెప్పారు. దేశాన్ని ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, ఎవ్వరూ చేయని పాత్ర వుంటే తప్పకుండా చేస్తాను.
కేంద్ర మంత్రిగా చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో మీ పాత్ర ఏమిటి?
పూర్తిగా పార్టీకే పని చేస్తాను. మన రాష్ట్రం రెండుగా విడిపోయే ముందు 13 జిల్లాల్లోని ప్రధాన ప్రాంతాలు పర్యటించి వారిని సముదాయించాను. హైదరాబాద్ అనే గుండె పోయిందని అందరూ బాధపడ్డారు. పోతేపోయింది. మనం అంతకంటే ఎక్కువగా ఏర్పాటు చేసుకోవచ్చనే ధైర్యాన్ని నూరిపోయాల్సి వచ్చింది. మనకు హైదరాబాద్‌లా విజయవాడ, వైజాగ్ వంటివి వున్నాయని చెప్పాం. అప్పట్లో ఎమోషనల్‌గా అందరూ బాధపడ్డారు. అసలు 1960 లోనే బిజెపి విడిపోవాలని ప్రతిపాదించింది. అప్పుడే విడిపోతే.. ఈపాటికి ఎంతో అభివృద్ధి చెందేవాళ్ళం. మదరాసులో కలిసి వున్నప్పుడు ఏమయింది? కొన్నాళ్ళు బాధపడ్డాం. హైదరాబాద్‌లో అభివృద్ధి చేశాం. ఇప్పుడు విజయవాడ, వైజాగ్‌లలో అభివృద్ది చేస్తాం. దానికి కొంత సమయం పడుతుంది. ఏది ఏమైనా.. రాజకీయాల్లో వున్నా.. సినిమాను వదలను. నిర్మాతగా పలు చిత్రాలు తీస్తాను.
ఇంతవరకు సంతృప్తి ఇచ్చిన పాత్రలు ఏమిటి?
చాలా వున్నాయి. బొబ్బిలి బ్రహ్మన్న, కటకటాల రుద్రయ్య, తాండ్రపాపారాయుడు వంటి చిత్రాలు వున్నాయి. తాండ్రపాపారాయుడులో నిర్మాణ విలువలు అద్భుతంగా చేశాం. గుర్రాలు లారీల్లో తెచ్చేవారు. అప్పట్లో ఎంతో ఖర్చుచేశారు. ఇప్పడది వందల కోట్లకు చేరుతుంది.
ఇప్పటి సినిమాపై మీ అభిప్రాయం?
ఒకప్పుడు ఫైట్స్, పాటలు వస్తే ఈలలు వేసేవారు. ఇప్పుడు సిగరెట్ తాగడానికి బయటకు వస్తున్నారు. ఒకప్పుడు తీపి.. రానురాను చేదుగా మారిపోయింది.
థియేటర్లు దొరక్క నిర్మాత బాధపడుతున్నారు. దానిపై మీ స్పందన?
దీన్నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం. మన థియేటర్లు పెంచుకోవడమే. ఇందుకు ప్రభుత్వ సహకారం కూడా కావాలి. దానికోసం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తున్నాను. ఇందుకోసం వివిధ దేశాల థియేటర్ల వ్యవస్థను పరిశీలించాను. చైనాలో ప్రతి స్ట్రీట్‌కు ఓ ధియేటర్ వుంటుంది. అలాంటి వ్యవస్థ మన దగ్గర తేవాలని చూస్తున్నాను. దీనిపై చాలా కసరత్తు జరుగుతోంది. థియేటర్లు అందుబాటులో వుంటే. అన్ని సినిమాలు అందరికీ చూసే వీలు కలుగుతుంది. ప్రతి వీధిలో స్క్రీన్ వుంటే.. ఇంటర్‌వెల్ గ్యాప్‌లో తనింటికి వచ్చి ఫలహారాలు సేవించి వెళ్ళిపోతాడు. లేదంటే..టిక్కెట్ రేటుకంటే.. తినుబండారాల రేట్లు అధికంగా వున్నాయి. పార్కింగ్ ఫీజు వుంటుంది.
అందుకోసం చాలామంది కుటుంబాలు థియేటర్‌కు రాలేకపోతున్నాయి. 'బాహుబలి' సినిమా చైనాలో 5వేల థియేటర్లలో విడుదల కావడం కూడా థియేటర్లు ఎక్కువవగా వుండడమే. థియేటర్ వ్యవస్థ కోసం కేంద్రప్రభుత్వం, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తగువిధంగా సహకరిస్తే కార్యరూపం దాలుస్తుంది. ఈ పనిమీద నేను వున్నాను. ఈ ఆలోచనను బిజెపి నాయకుడు మురళీధరరావు చెప్పాడు. చాలా బాగుంది అనిపించింది. ఇండస్ట్రీ తరఫున కూడా రాజమౌళి, శోభు యార్లగడ్డ, రమేస్‌ప్రసాద్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి వంటి ప్రముఖులు సహకరిస్తామని చెప్పారు.
బాహుబలి సినిమా విశ్వమార్కెట్ రావడంతో.. మన సినిమాను మరింతగా మన రాష్ట్రంలోనూ దేశంలోనూ విస్తరించేందుకు చాలా దోహపడుతుంది. ప్రాంతీయ సినిమాలు కూడా ప్రోత్సహించడానికి తోడ్పడుతుంది. ఈ థియేటర్ వ్యవస్థ గురించి అన్ని దేశాలను పరిశీలించి.. సిఐ, పియు రిపోర్ట్స్ ఆధారంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ ప్రక్రియ త్వరలో కార్యరూపం దాలుస్తుంది. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తాను అని చెప్పారు.